సాక్షి, హైదరాబాద్: వివిధ దర్యాప్తు, నిఘా సంస్థల్లో అధికారినని చెప్పుకుంటూ సంపన్న యువతులు, మహిళలతో పాటు క్యాబ్ డ్రైవర్లకు టోకరా వేస్తున్న ఘరానా మోసగాడిని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఇతడిపై నగరంలోని ఎస్సార్‌నగర్‌తో పాటు సైబరాబాద్‌లోని రాయదుర్గంలో కేసులు నమోదై ఉన్నాయని ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు పేర్కొన్నారు. నగరంలోని మణికొండ ప్రాంతానికి చెందిన గరికపాటి శ్రీనివాస్ గతంలో నగరంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేశాడు. కొన్నాళ్లుగా వివిధ విభాగాల పేర్లు చెప్తూ తాను వాటిలో అధికారినంటూ మోసాలు చేయడం మొదలెట్టాడు.
ప్రధానంగా సీఐడీతో పాటు సీబీఐ, రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్‌ల్లోని ఏదో ఒక విభాగం పేరు వాడతాడు. తాను అందులో ఉన్నతాధికారినంటూ యువతులు, మహిళలను పరిచయం చేసుకుంటాడు. ప్రధానంగా సంపన్న వర్గాలకు చెందిన, విడాకులు తీసుకున్న, వితంతు మహిళలనే టార్గెట్ చేసుకుంటాడు. వారితో పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చే శ్రీనివాస్ కొన్నాళ్ల పాటు చెట్టపట్టాల్ వేసుకుని తిరుగుతాడు. అదను చూసుకుని అనుకోకుండా అవసరం వచ్చిందనో, సమస్య ఎదురైందనో చెప్పి వారి నుంచి అందినకాడికి దండుకుంటాడు.
తన వల్లోపడిన మహిళ, యువతితో కలిసి నగరంలో చెక్కర్లు కొట్టడానికి, బయటి రాష్ట్రాలకు టూర్లకు వెళ్లడానికి క్యాబ్స్, అద్దె కార్లు వినియోగించే వాడు. విహారయాత్ర పూర్తయ్యే వరకు అన్ని ఖర్చులూ ఇతగాడి వెంట వచ్చే యువతులు, మహిళలే భరించే వాళ్లు. చివరకు తాను ఫలానా డిపార్ట్‌మెంట్ అధికారినంటూ ఆయా డ్రైవర్లకు చెప్పే శ్రీనివాస్ కిరాయి తమ డిపార్ట్‌మెంట్ చెల్లిస్తుందని కొందరితో చెప్పి, చెక్కులు ఇచ్చి మరికొందరిని మోసం చేసేవాడు.
ఈ నెల 2న ఎస్సార్‌నగర్‌లో కారు బుక్ చేసుకున్న ఇతడు బెంగళూరు, మైసూరుల్లో నాలుగు రోజులు టూర్ వెళ్లాడు. తిరిగి వచ్చిన తరవాత డ్రైవర్‌కు చెల్లించాల్సిన రూ.51 వేలు ఎగ్గొట్టాడు. తాను ఓ కేసు దర్యాప్తు కోసం ఇలా వచ్చానంటూ డ్రైవర్‌ను బురిడీ కొట్టించాడు. ఈ నెల 15న బేగంపేటలోని ఓ స్టార్ హోటల్ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్న శ్రీనివాస్ అందులో నగరం మొత్తం షికారు చేశాడు. చివరకు షేక్‌పేటలోని మరో స్టార్ హోటల్ వద్ద దిగి 12 గంటల్లో కిరాయి ఆన్‌లైన్‌లో వస్తుందని చెప్పి డ్రైవర్‌ను పంపాడు. ఆపై తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని ఉడాయించాడు.
శ్రీనివాస్ ఇదే పంథాలో స్టార్ హోటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాహకులు, ఎయిర్‌పోర్టు అధికారులనూ మోసం చేశాడు. ఇతడిపై ఎస్సార్‌నగర్, రాయదుర్గం ఠాణాల్లో కేసులు నమోదై ఉన్నాయి. అతడి ఆచూకీ కోసం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ టి.శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, ఎం.అనంతాచారి, బి.అరి్వంద్ గౌడ్, బి.అశోక్‌రెడ్డి రంగంలోకి దిగారు. మంగళవారం అరెస్టు చేసి తదుపరి చర్యల నిమిత్తం ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు.
శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment