ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం మూడు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు బాలికలు, ఓ మహిళ మృతి చెందారు. వనపర్తి జిల్లాలో బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్లిన ముగ్గురు అక్కాచెల్లెళ్లలో చిన్నమ్మాయి ప్రమాదవశాత్తు నీటిలో పడడంతో ఆమెను కాపాడేందుకు అక్కలు కూడా నీటిలో దిగడంతో ఈత రాక ముగ్గురూ మృత్యువాత పడ్డారు.
శ్రీరంగాపురం మండలంలోని తాటిపాములకు చెందిన గంధం కురుమయ్య, భాగ్యమ్మ దంపతుల కుమార్తెలు తిరుపతమ్మ(16), సంధ్య (12), దీపిక (10) బట్టలు ఉతకడానికి గ్రామంలోని వీరసముద్రం చెరువు దగ్గరకు వెళ్లారు. బట్టలు ఉతుకుతున్న సమయంలో చిన్న అమ్మాయి దీపిక కాలు జారి చెరువులో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు ఇద్దరు అక్కలు చెరువులోకి దిగడంతో అక్కడే గొయ్యి ఉండడంతో ఈత రాక నీట మునిగిపోయారు.
ఈతకు వెళ్లి మరో ముగ్గురు: నారాయణపేట జిల్లాలో పెళ్లింటికి వచ్చిన ముగ్గురు బాలికలు కోయిల్‌సాగర్ వాగు (ఊకచెట్టువాగు)లోకి ఈతకు వెళ్లి మృతి చెందారు. మరి కల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన భాగ్యమ్మ, అశోక్ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. హైదరాబాద్‌కు చెందిన ఓ అబ్బాయితో ఆదివారం పెద్దకూతురు పెళ్లి జరిపించి సోమవారం రాకొండకు చేరుకున్నారు.
పెళ్లికూతురు సోదరి రాధిక (16)తో పాటు నర్వమండలం పాతర్‌చేడ్‌కు చెందిన బంధువులు సువర్ణ, గణేష్ దంపతుల కుమార్తెలు శ్రావణి (15), మహేశ్వరి (14), మరో ఇద్దరు శశికళ, చంద్రకళ కోయిల్‌సాగర్ ఊకచెట్టు వాగులో కి ఈతకు వెళ్లారు. కాగా.. ఇసుక కోసం తీసిన గుంత లోతుగా ఉండడంతో రాధిక, శ్రావణి, మహే శ్వరి నీటిలో మునిగిపోయారు. వారిని కాపాడే యత్నంలో శశికళ కూడా నీటిలోకి జారుతుండగా.. వెంటనే అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పిల్లలకు ఈత నేర్పించేందుకు బావిలోకి దిగి...
నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం బావాయిపల్లికి చెందిన తెలుగు లింగమ్మ(30) భర్త లింగస్వామితో కలిసి పిల్లలకు ఈత నేర్పించేందుకు వ్యవసాయబావిలోకి దిగింది. అయితే ఈత సరిగ్గా రాక బావి నీటిలో మునిగిపోయింది. భర్తతో పాటు చుట్టుపక్కల వాళ్లు ఎంత వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు.
చదవండి: బిడ్డా పదేండ్ల తర్వాత వస్తిని.. మినరల్ వాటర్ కోసం పోయి..
Comments
Please login to add a commentAdd a comment