వివరాలు వెల్లడిస్తున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్ (నిందితుడు ప్రశాంత్)
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఫ్లాట్లు కేటాయించేలా చూస్తున్నానని 40 మంది నుంచి దాదాపు రూ.70 లక్షలు వసూలు చేసిన నిందితుడిని సైబరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కేపీహెచ్‌బీ తొమ్మిదో ఫేజ్‌లో నివాసముంటున్న ఈస్ట్ గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం నడిమిలంక గ్రామవాసి, విజన్– టీవీ చానల్ చైర్మన్ గుతుల ప్రశాంత్‌ను నిందితుడిగా గుర్తించి పట్టుకున్నారు. కేసు వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షలపైనే..
డబుల్ బెడ్రూం ఫ్లాట్ల కోసం చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని నిజాంపేట, కైతలాపూర్ గ్రామాల్లో మీడియా వ్యక్తులకు డబుల్ బెడ్రూం ఫ్లాట్లు కేటాయిస్తోదంటూ కొంతమంది అమాయకులతో ప్రశాంత్ పరిచయం పెంచుకున్నాడు. దాదాపు 40 మంది నుంచి ఆధార్ కార్డులు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ప్రస్తుత చిరునామా కరెంట్ బిల్లు తీసుకున్నాడు. అనంతరం ఒక్కో వ్యక్తి వద్ద రూ.1,55,000 నుంచి రూ.1,70,000 వసూలు చేశాడు. కొన్నాళ్లు గడిచాక రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ కాపీ ఇచ్చినట్టుగానే తన ల్యాప్‌టాప్‌లో రెడీ చేసి ఆ తర్వాత బాండ్ పేపర్‌పై కలర్ జిరాక్స్ తీశాడు. దానిపై మేడ్చల్ జిల్లాలోని ఓ సెక్షన్ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆర్డర్ కాపీ అందరికీ ఇచ్చాడు.
కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, బాచుపల్లి, మియాపూర్ ఠాణా పరిధిలోని వారిని మోసం చేశాడు. ఈ సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు నిందితుడు ప్రశాంత్‌గా గుర్తించి కేపీహెచ్‌బీ పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. రూ.8 లక్షల నగదుతో పాటు కారు, ల్యాప్‌టాప్, కలర్ ప్రింటర్, ఎనిమిది డబుల్ బెడ్రూం కేటాయింపు నకిలీ లెటర్లు స్వాధీనం చేసుకున్నారు. ‘గతంలోనూ సైబరాబాద్ పోలీసు కమినరేట్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా నకిలీ పోలీసు ఐడీని క్రియేట్ చేసి హైవే టోల్‌గేట్‌ల వద్ద డబ్బులు చెల్లించకుండానే తిరుగుతుండటంతో విజయవాడలోని భవానీపురం పోలీసులు ప్రశాంత్‌ను జూన్ 24న అరెస్టు చేశారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఇతగాడు డబుల్‌బెడ్రూం ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించేలా చూస్తామంటూ చెప్పే దళారులు మాటలు నమ్మవద్దని సీపీ సజ్జనార్ సూచించారు. కార్యక్రమంలో క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment