Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Supreme Court Comments on Bihar electoral roll revision July 10th News1
బీహార్ ఓటర్ల జాబితా సవరణ.. ఈసీపై సుప్రీం కోర్టు ఆగ్రహం

బీహార్ ఓటర్ల జాబితా సవరణ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీం కోర్టు మండిపడింది. ఓటర్‌ జాబితా ప్రక్రియలో తప్పులు సరిదిద్దే ప్రక్రియ మంచిదేనని.. అయితే ఈ కసరత్తును ముందే ఎందుకు చేపట్టలేదని ఈసీని నిలదీసింది.న్యూఢిల్లీ: బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు దాఖలైన అత్యవసర పిటిషన్‌ను జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా ఈసీ చర్య రాజ్యాంగబద్ధమైనదే అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈసీ చర్యను సమర్థించిన సుప్రీం ధర్మాసనం.. 2003లో చివరిసారి అలాంటి ప్రక్రియ జరిగిందని వ్యాఖ్యానించింది. అయితే, ఎన్నికల ముందే ఈ ప్రక్రియ ప్రారంభించడం వెనుక అనుమానం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగం ప్రకారం చేయాల్సిన పని. ప్రాక్టికల్ అవసరం ఉంది. కంప్యూటరైజేషన్ తర్వాత మొదటిసారి కావడం వల్ల తగిన లాజిక్ ఉంది. ఓటర్ల జాబితాలో నాన్-సిటిజన్లు ఉండకూడదని తొలగింపు ప్రక్రియ చేపట్టడం తప్పేం కాదు. కానీ, ఎన్నికల ముందు రెండు నెలలకే నిర్ణయం తీసుకోవడం సరైనదా? అని ప్రశ్నించింది.వాదన సమయంలో ఆధార్‌ పౌరసత్వ గుర్తింపు కాదని పేర్కొన్న ఎన్నికల సంఘం.. ఆర్టికల్ 326 కింద తమకు అన్ని అధికారాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో.. ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదు. కానీ, ఇక్కడ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోంది. ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దే ప్రక్రియ మంచిదే. అలాంటప్పుడు ఈ కసరత్తు ముందే ఎందుకు చేపట్టలేదు. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రారంభిస్తే ఎలా? అని ప్రశ్నించింది. ఈ తరుణంలో కేంద్రం, ఎన్నికల సంఘానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.బీహార్‌ ఓటరు జాబితా ప్రత్యేక సవరణను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంలో ఈసీ ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డును పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. జూలై 25 కల్లా అధీకృత డాక్యుమెంట్లు చూపించకుంటే... ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని పిటిషన్‌లో ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఈ రివిజన్ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకేనని, బీజేపీని వ్యతిరేకిస్తున్న వర్గాలను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే ఈ కసరత్తు లక్ష్యమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో స్పెషల్ రివిజన్ నిలిపివేసేలా ఈసీని ఆదేశించాలని పిటిషన్‌ వేశాయి. వాదనలు & విమర్శలు• అధిక సంఖ్యలో పాత ఓటర్లను తొలగించే అవకాశం ఉందని కాంగ్రెస్, RJD వంటి విపక్షాలు విమర్శించాయి.• ఆధార్, ఓటర్ ID వంటి సాధారణ పత్రాలను అంగీకరించకపోవడం వివక్షత అని పిటిషనర్లు అభిప్రాయపడ్డారు.• 2003 ముందు పౌరసత్వంపై అనుమాల్లేకుండా అంగీకరించారు. కానీ ఇప్పుడు ఐదుసార్లు ఓటు వేసినా పౌరసత్వం నిరూపించాల్సిన పరిస్థితి ఉందని వాదించారు. ఎన్నికల సంఘం వాదనగత 20 ఏళ్లలో పునరావృత నమోదు, మరణాల సమాచారం లేకపోవడం, వలసలు వంటి కారణాలతో డూప్లికేట్ ఎంట్రీలు పెరిగాయని తెలిపింది.57% మంది ఇప్పటికే ఫారాలు సమర్పించారని పేర్కొంది.పలు ప్రశ్నలుఎన్నికల సంఘం చేపట్టిన Special Intensive Revision (SIR) ప్రక్రియ రాజ్యాంగబద్ధమా?పౌరసత్వ నిరూపణ కోసం ఓటర్లపై పెట్టిన నిబంధనలు సమంజసమా?ఎన్నికల ముందు నెలలకే ఈ కసరత్తు ప్రారంభించడం సమయపరంగా సరైనదా?

KSR Comment On CBN Revanth Banakacherla Drama2
బనకచర్ల.. గురు శిష్యుల డ్రామా?

రాజకీయాల్లో కొందరు గాల్లో కత్తులు తిప్పుతూంటారు. అదే యుద్ధమని జనాన్ని నమ్మించే ప్రయత్నమూ జరుగుతూంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల్లో హడావుడి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంతి​ గత ఏడాది అధికారంలోకి వచ్చింది మొదలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూనే ఉన్నారు. సుమారు రూ.85 వేల కోట్లతో గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామని ప్రతిపాదించారు. కేంద్రం కూడా నిధుల రూపంలో సాయం చేయాలని కోరారు. అయితే.. పలు లిఫ్ట్‌లు, రిజర్వాయర్లు, సొరంగాలతో కూడిన బనకచర్ల ప్రాజెక్టు అంత తేలికగా అయ్యేది కాదన్నది అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వమేమో సాయం సంగతి దేవుడెరుగు... పంపిన ప్రతిపాదననే తిప్పి పంపింది. జలసంఘం ఆమోదం తరువాత పర్యావరణ అనుమతులు కూడా తీసుకుని మాట్లాడమని సూచించింది. ఇదంతా ఒక పార్శ్వమైతే.. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో ఇంకో రకమైన రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఈ అంవాన్ని పెద్ద వివాదంలా మార్చి వాదోపవాదాలు సాగిస్తున్నాయి. రెండు పార్టీలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూండటం గమనార్హం. కానీ... ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంతున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రాజెక్టులను అంగీకరించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డిలు స్పష్టం చేస్తూనే కేసీఆర్‌ హయాంలోనే తెలంగాణకు నష్టం జరిగిందని విమర్శిస్తున్నారు. వీరు ఒక ప్రజెంటేషన్ ఇస్తే, దీనికి పోటీగా బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి టి.హరీష్ రావు మరో ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు గురు శిష్యులని, అందుకే బనకచర్ల ప్రాజెక్టుకు సహకరిస్తున్నారని హరీష్‌ అంటున్నారు. చంద్రబాబు, రేవంత్‌లు హైదరాబాద్‌లో భేటీ అయినప్పుడే బనకచర్ల ప్రాజెక్టుకు ఓకే చేశారని హరీష్‌రావు ఆరోపిస్తున్నారు. ఆ తరువాత ఉత్తం కుమార్ రెడ్డి విజయవాడ వెళ్లి చంద్రబాబు వద్ద బజ్జీలు తిని మరీ ఈ ప్రాజెక్టుకు ఓకే చేసి వచ్చారని అన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలోనే తెలంగాణ నీటి వాటాలలో నష్టం జరిగిందని, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైనప్పుడు ఇందుకు బీజం పడిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్‌, జగన్‌లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఒక భేటీ జరిగిన మాట నిజమే. గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి జూరాలకు తరలించడానికి కేసీఆర్‌ ప్రతిపాదించగా, దానిని పరిశీలించడానికి జగన్ ఒప్పుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు వల్ల ఏపీకి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం ఏర్పడడంతో అది ముందుకు సాగలేదు. కేసీఆర్‌, జగన్‌లు అయినా, చంద్రబాబు, రేవంత్ అయినా సమావేశమైతే ఉభయ రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రయత్నించవచ్చు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ పక్షాన ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. తదుపరి చంద్రబాబుకు చెప్పే కాంగ్రెస్‌లో చేరారు. తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండి, పిమ్మట పీసీసీ అధ్యక్షుడై, ఎన్నికలలో గెలవడంతో ముఖ్యమంత్రి అయ్యారు.అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పరోక్షంగా తెలంగాణ టీడీపీ కూడా సహకరించడం బహిరంగ రహస్యమే.చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, కాంగ్రెస్‌తో కూడా స్నేహం చేస్తున్నారన్నది రాజకీయ వర్గాలలో ఉన్న మాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్‌లు కలిసి కూర్చుని విభజన సమస్యలను చర్చించి పరిష్కారం కనుక్కుని ఉంటే బాగుండేది. తెలంగాణ నుంచి ఏపీకి సుమారు రూ.ఏడువేల కోట్ల విద్యుత్ బకాయిలు రావల్సి ఉంది. హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తుల్లో వాటా తెచ్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించి ఉండాల్సింది. తనను చంద్రబాబు శిష్యుడని చెప్పడాన్ని రేవంత్ అంత ఇష్టపడక పోయినట్లు కనిపిస్తుంటారు. అయినా వారిద్దరి మధ్య సంబంధ, బాంధవ్యాలు బాగానే ఉన్నాయని అంటారు. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ ఉదాసీనంగా ఉన్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. గోదావరి జలాలలో 1500 టీఎంసీల నీటిని కేటాయించిన తర్వాత ఏపీ ప్రాజెక్టును చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం వాదనగా ఉంది. అయితే తాము వరద జలాలను మాత్రమే వాడుకోదలిచామని, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులపై గతంలో ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై పలు ఆరోపణలు చేస్తూ తెలంగాణ అడ్డుపడింది. ఇప్పుడు బనకచర్ల విషయంలో కూడా తెలంగాణ గట్టిగా అడ్డుపడుతున్నట్లు కనిపిస్తుంది. బీజేపీ కోణంలో చూస్తే వారికి తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఏపీకి ఎంతవరకు సహకరిస్తుందన్నది సందేహమే. ఇక్కడ విశేషం ఏమిటంటే బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం వల్ల ఏపీకి వచ్చే లాభం ఏమీ లేదని, తెలుగుదేశానికి మద్దతుదారుగా పేరొందిన మాజీ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో సహా మరికొందరు ప్రత్యేకంగా సమావేశం పెట్టి ప్రకటన చేశారు. అంతేకాక 18.5 కిలోమీటర్ల వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల తవ్వకాలు రెండున్నర దశాబ్దాలుగా సాగుతూనే ఉన్నాయని, అయినా అవి ఒక కొలిక్కి రాలేదని, అలాంటిది ఇప్పుడు ఏకంగా నల్లమల అడవులలో, కొండల్లో 26.5 కీలోమీటర్ల మేర సొరంగం తవ్వకం ఆరంభిస్తే అది ఎప్పటికి పూర్తి అవుతుందని వారు ప్రశ్నించారు. చంద్రబాబుకు ఒక లక్షణం ఉంది. తాను ఏమైనా ప్రతిపాదిస్తే, ఎవరూ దాన్ని వ్యతిరేకించరాదని భావిస్తారు. భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే అభివృద్ది వ్యతిరేకులంటూ వారిపై తట్టెడు బురద వేసి ప్రజల మైండ్ ఖరాబు చేస్తుంటారు. ఇందుకు తనకు మద్దతు ఇచ్చే మీడియాను పూర్తిగా వాడుకుంటారు. అందువల్ల ఏపీలో తెలుగుదేశం మినహా ఇతర రాజకీయ పార్టీలేవి ఈ ప్రాజెక్టుపై పెద్దగా స్పందించడం లేదు. ఇదంతా ఏపీలోని కూటమి ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఆడుతున్న డ్రామా అని ఆయా రాజకీయ నేతలు భావిస్తున్నారు. సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కావాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురుశిష్యులు చంద్రబాబు, రేవంత్‌ కలిసి ఈ డ్రామా నడుపుతున్నారని, చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు పూర్తిచేసే ఉద్దేశం లేదని అభిప్రాయపడ్డారు. గతంలో వైఎస్సార్‌సీపీ కూడా ఇదే తరహా ప్రాజెక్టుకు డీపీఆర్‌ పంపించింది. ప్రభుత్వం మారడంతో బనకచర్ల ప్రాజెక్టు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం అంత తేలిక కాదన్న సంగతి అందరికి తెలుసు. ఎందుకంటే ఏకంగా రూ.85 వేల కోట్ల వ్యయం అవుతుంది. అది అక్కడితో ఆగుతుందన్న నమ్మకం కూడా లేదు. కేంద్రం దీనికి నిధులు కేటాయించితే పెద్ద విశేషమే. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదు. అయినా కేసీఆర్‌ రుణాలు తెచ్చి ఆ ప్రాజెక్టును నిర్మించారు. కాని అందులో ఒక భాగం దెబ్బతినడం కేసీఆర్‌ ప్రభుత్వానికి ఇరకాటమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల వాయిదాలు సరిగా చెల్లించలేక పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునే యత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో బనకచర్లకు రుణాలు వచ్చే అవకాశం ఎంతన్నది చెప్పలేం. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టినా, తెలంగాణకు వచ్చే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. అయినా రాజకీయ పక్షాలు పరస్పర విమర్శలు సాగిస్తూ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నాయి. మరో వైపు ఏపీ ప్రభుత్వం తామేదో పెద్ద ప్రాజెక్టును చేపడితే ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పి జనాన్ని మభ్యపెట్టే యత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేంద్రం తగ్గించిన అంశాన్ని పక్కన బెట్టి డైవర్షన్ రాజకీయాలలో భాగంగా చంద్రబాబు ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు భారీ ప్రాజెక్టులపై అంత విశ్వాసం ఉండేది కాదు. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి భారీ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న విషయాన్ని గుర్తించి, ఇప్పుడు ఆయన కూడా ఆ రాగం ఆలపిస్తున్నారు. అయితే ఆ పాట పాడుతున్నది చిత్తశుద్దితోనా, రాజకీయం కోసమా అన్నదానిపై ఎవరికి కావల్సిన విశ్లేషణ వారు చేసుకోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

YSRCP Buggana Rajendranath Serious comments On CBN Govt3
బాబు.. 2,45,000 కోట్ల బడ్జెట్‌ ఏమైంది.. అప్పులపై అడిగితే దేశద్రోహులమా?: బుగ్గన

సాక్షి, హైదరాబాద్‌: ​చంద్రబాబు.. కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా రాజధానిని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. అమరావతిని అభివృద్ధి చేయలేక వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నల వర్షం కురిపించారు.మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎందుకు అప్పులు చేస్తున్నారని అడిగతే మేము దేశద్రోహులమా?. మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం ఎందుకు?. అమరావతిని అభివృద్ధి చేయలేక మాపై విమర్శలు చేస్తున్నారు. మేం అప్పు చేస్తే తప్పు.. మీరు అప్పులు చేస్తే ఒప్పా?. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయి. రూ.2,45,000 కోట్ల బడ్జెట్‌ ఎక్కడికి పోయింది?. ఒక్క పెన్షన్లకు తప్ప ఏ సంక్షేమ పథకానికైనా కేటాయింపులు చేస్తున్నారా?. రాష్ట్రంలో పొగాకు, మామిడి, మిర్చి రైతుల పరిస్థితి ఏంటి?. ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు చేశారా?. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా?. 20 లక్షల మందికి ‍ఇవ్వాల్సిన తల్లికి వందనం 13 లక్షల మందికి ఇచ్చారు. ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ అడిగితే దేశద్రోహులమా?. ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇచ్చి ఇప్పుడు షరతులు పెడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకే పరిమితం అంటున్నారు. ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ ఇచ్చారా?. దీపం ఎంత మందికి వచ్చంది?. 50 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజల తరఫున పోరాటం చేస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని వ్యాఖ్యలు చేశారు.

CID Arrests HCA President Jagan Mohan Rao 4 Others Probe On Details4
SRHను బెదిరించి టికెట్లు పొందాలని చూశారు: సీఐడీ

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA), సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) ఫ్రాంఛైజీ మధ్య వివాదంలో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఐపీఎల్‌ టికెట్ల వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సీఐడీ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావును బుధవారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిధుల దుర్వినియోగం కేసులో కేసు నమోదైంది. ధరం గురువరెడ్డి ఫిర్యాదుతో 465, 468, 471, 403, 409, 420 r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.ఇక విచారణలో భాగంగా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో ఉన్న గౌలిగూడ క్రికెట్ క్లబ్‌ను అడ్డుపెట్టుకుని జగన్‌మోహన్‌రావు మోసానికి పాల్పడినట్లు గుర్తించింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్ భార్య, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితతో కలిసి క్లబ్‌ డాక్యుమెంట్లను అతడు ఫోర్జరీ చేసినట్లు గుర్తించింది. ఈ మేరకు ఫోర్జరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. వీటితోనే జగన్‌మోహన్‌ రావు హెచ్‌సీఏలోకి ఎంట్రీ ఇచ్చినట్లు తేల్చింది.అదే విధంగా.. హెచ్‌సీఏలో జగన్‌మెహన్‌ రావు భారీగా నిధుల గోల్‌మాల్‌కు పాల్పడినట్లుగానూ సీఐటీ గుర్తించింది. అసోసియేషన్‌ సభ్యులకు, జగన్‌మోహన్‌ రావుకు మధ్య భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా విచారణలో తేలింది.అంతేకాదు.. ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యాన్ని టికెట్ల విషయంలో బ్లాక్‌మెయిల్‌ చేయడం, కాంప్లిమెంటరీ టికెట్ల వ్యవహారంలో బెదిరింపులకు దిగడం నిజమేనని గుర్తించింది. కార్పొరేట్‌ బాక్సులను తమకు కేటాయించాలని.. లేదంటే ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగనివ్వబోమంటూ బ్లాక్‌మెయిల్‌ చేశారని తేలింది. ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కోసమే జగన్‌మోహన్ రావు నేరపూరితంగా హెచ్‌సీఏలోకి ఎంట్రీ ఇచ్చాడని సీఐడీ గుర్తించింది.కాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో వివాదం నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణ నేపథ్యంలో హెచ్‌సీఏకు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తోంది.అయితే మరో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగబోనివ్వమని జగన్‌మోహన్‌ రావు బెదిరించారన్నది ప్రధాన అభియోగం. హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్‌ పెట్టుకుంటే ఆలోచన చేస్తామని ఫ్రాంఛైజీ చెప్పినప్పటికీ.. తనకు వ్యక్తిగతంగా 10 శాతం వీఐపీ టికెట్లు కచ్చితంగా ఇవ్వాలని ఆయన బెదిరింపులకు దిగారు. లేకుంటే మ్యాచ్‌లు జరగనివ్వబోమని బ్లాక్‌మెయిల్‌ చేశారు.ఇందుకు ఎస్‌ఆర్‌హెచ్‌ నిరాకరించగా.. లక్నో మ్యాచ్‌ సందర్భంగా వీఐపీ కార్పొరేట్‌ బాక్స్‌కు జగన్‌మోహన్‌ రావు తాళాలు కూడా వేయించారు. ఈ నేపథ్యంలో తాము హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోతామంటూ ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగి.. విజిలెన్స్‌ ఎంక్వయిరీకి ఆదేశించింది. ఈ వ్యవహారంలో విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా హెచ్‌సీఏ అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన సీఐడీ.. అక్రమాలు వాస్తవమేనని తేలడంతో అరెస్టులు చేసింది.ఈ విషయం గురించి సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా వివరాలు తెలియజేశారు. ‘‘తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం.. SRH ఫ్రాంచైజీని బెదిరించి టికెట్స్ పొందాలని చూశారు.. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు’’ అని తెలిపారు.

Shashi Tharoor Sensational Comments On Indira 1975 Emergency5
ఇందిరాగాంధీపై శశిథరూర్‌ సంచలన వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా అభివర్ణిస్తూ.. దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అంటూ ఓ విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారాయన. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. ఆ చీకటి అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎమర్జెన్సీ కాలంలో స్వేచ్ఛను హరించారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు.. అంటూ ఎమర్జెన్సీకి యాభై ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘‘ప్రాజెక్టు సిండికేట్‌’’ అనే వెబ్‌సైట్‌లో ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఓ ఆర్టికల్‌ రాశారు. దేశంలో అంతర్గత గందరగోళాన్ని తొలగించడానికి, బయటి నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి ఎమర్జెన్సీలాంటి కఠినమైన నిర్ణయం తప్పనిసరి అని ఆమె(ఇందిరాగాంధీని ఉద్దేశించి..) భావించారు. కానీ, ఈ విధానాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి, అణచివేతతో కూడిన స్థితిలోకి ప్రజలను నెట్టివేశాయి అని పేర్కొన్నారాయన.అయితే స్వేచ్ఛను అణచివేసే చర్యలు ఎంత ప్రమాదకరమో, ప్రజల జీవితాలపై ఎంత తీవ్ర ప్రభావం చూపవచ్చో అంటూ నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ ఆయన పలు విమర్శలు చేశారు. 21 నెలలపాటు పౌర హక్కులను హరించి వేశారు. సంజయ్ గాంధీ నేతృత్వంలో బలవంతపు వాసెక్టమీ కార్యక్రమాలు.. పేద ప్రాంతాల్లో అమలయ్యాయి. ఢిల్లీలోని స్లమ్ ప్రాంతాలు కూల్చివేయబడ్డాయి, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. న్యాయవ్యవస్థ ఒత్తిడికి లోనై, హేబియస్ కార్పస్ హక్కును కూడా నిలిపివేసింది. ఈ చర్యలు “అత్యధిక అధికారాన్ని” ఎలా దుర్వినియోగం చేయవచ్చో చూపించాయి. ఫలితంగా.. ప్రజలు 1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీని తిరస్కరించి ప్రజాస్వామ్యాన్ని తిరిగి స్థాపించారు అని తన వ్యాసంలో థరూర్‌ పేర్కొన్నారు.ఎమర్జెన్సీని కేవలం భారత చరిత్రలోని చీకటి అధ్యాయంగా గుర్తుపెట్టుకోవడం కాకుండా, దాని నుంచి పాఠాలను నేర్చుకోవాలి. ప్రజాస్వామ్యం అనేది అది అపురూపమైన వారసత్వం. దానిని నిరంతరం పోషిస్తూ.. పరిరక్షించుకోవాలి. ఈ విషయం ప్రజలందరికీ ఎప్పటికీ గుర్తుండేలా చేయాలి. చరిత్ర మళ్లీ పునరావృతం కాకుండా.. స్వేచ్ఛను నిలుపుదాం అంటూ వ్యాసం ముగించారాయన. My column for a global audience on the lessons for India and the world of the Emergency, on its 50th anniversary @ProSyn https://t.co/QZBBidl0Zt— Shashi Tharoor (@ShashiTharoor) July 9, 20252020లో.. జీ23 పేరిట విడుదలైన లేఖ కాంగ్రెస్‌లో కలకలం రేపింది. శశిథరూర్‌ సహా 23 మంది సీనియర్ నేతలు ‘కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్థిరమైన నాయకత్వం’ కోరుతూ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది సోనియా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా(మరీ ముఖ్యంగా అప్పటి రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..) తిరుగుబాటు లాగా భావించారంతా. అప్పటి నుంచి థరూర్‌కు, కాంగ్రెస్‌ అధిష్టానానికి గ్యాప్‌ మొదలైంది. తిరిగి.. 2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ గ్యాప్‌ మరోసారి బయటపడింది. శశిథరూర్ మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఖర్గే గెలిచినా, థరూర్‌కు 1,000కి పైగా ఓట్లు వచ్చాయి. అయితే పార్టీలో అంతర్గతంగా థరూర్‌కు మద్దతు ఉన్నట్లు ఈ ఎన్నిక స్పష్టం చేసింది. 2023-24.. శశిథరూర్ ఈ మధ్యకాలంలో తరచూ పార్టీ లైన్‌కు భిన్నంగా మాట్లాడారు. మరీ ముఖ్యంగా విదేశాంగ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రధానమంత్రి మోదీని ప్రశంసించడం పార్టీ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. అదే సమయంలో థరూర్‌ అభిప్రాయాల ఆధారంగానే కాం‍గ్రెస్‌పైకి బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. 2025లో.. ఆపరేషన్ సిందూర్ తర్వాత కాంగ్రెస్‌కే షాకిస్తూ ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ను అఖిలపక్ష బృందంలో ఎంపిక చేసింది బీజేపీ. పలు దేశాల సమావేశాల్లో థరూర్‌ మోదీ నాయకత్వంపై ప్రశ్నలు గుప్పించారు. ఇది ఆయన కొందరు కాంగ్రెస్‌ నేతలతో సోషల్‌ మీడియా వేదికగా వాగ్వాదానికి కారణమైంది. విదేశాల నుంచి తిరిగి వచ్చాక పార్టీ అధిష్టానంతో విభేదాలున్నాయని అంగీకరిస్తూనే.. అవి నాలుగు గోడల మధ్య చర్చించుకునే విషయమని కేరళలో స్పష్టం చేశారు. ఆపై ది హిందూ కోసం ఆయన రాసిన ఓ కథనం.. ప్రధాని మోదీ శక్తి, చురుకుదనం భారతదేశానికి ప్రధాన ఆస్తి అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మరింత ఆగ్రహం తెప్పించాయి. అయితే ఇవేవీ తాను బీజేపీలో చేరతాననే సంకేతాలు మాత్రం కాదని శశిథరూర్‌ తాజాగా స్పష్టత ఇచ్చారు. అయితే థరూర్‌పై చర్యలు ఉండబోవని కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు ఖర్గే ఇప్పటికే స్పష్టం చేశారు. ఈలోపే ఏకంగా ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని తప్పుబడుతూ మరో వ్యాసం రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై కాంగ్రెస్‌ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

former Meta AI researcher debate on company culture6
‘మెటాలో పని.. క్యాన్సర్‌ అంత ప్రమాదం’

ప్రముఖ టెక్‌ కంపెనీ మెటా సూపర్‌ ఇంటలిజెన్స్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ముందుకుసాగుతున్న తరుణంలో కంపెనీ మాజీ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారుతున్నాయి. కంపెనీలో ఉద్యోగం మానేసి బయటకు వస్తున్న సమయంలో అంతర్గతంగా ఆ ఉద్యోగి ఈమెయిల్ పంపించాడు. దీనిలో కంపెనీ కృత్రిమమేధ విభాగం గురించి తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తాడు.ది ఇన్ఫర్మేషన్‌లో టిజ్మెన్ బ్లాంకెవర్ట్‌ రాసిన కథనంలో మెటాలోని సంస్కృతిని సంస్థ అంతటా వ్యాపిస్తున్న ‘మెటాస్టాటిక్ క్యాన్సర్’తో పోల్చాడు. మెటా ఎల్ఎల్ఏఎంఏ మోడళ్లపై పనిచేసే బృందంలో బ్లాంకెవర్ట్ కూడా కొంతకాలం పని చేశాడు. ఉద్యోగం నుంచి నిష్క్రమించే ముందు అతడు మెటా నాయకత్వాన్ని, అక్కడి పని విధానాన్ని విమర్శిస్తూ ఒక సుదీర్ఘ లేఖ రాశాడు.‘మెటాలో పని చేస్తున్నన్ని రోజులు చాలా మంది ఉద్యోగులు ఎంతో నష్టపోయారు. అక్కడ భయంతో కూడిన సంస్కృతి ఉంది. తరచుగా పనితీరు సమీక్షలు, తొలగింపులు ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని, సృజనాత్మకతను దెబ్బతీశాయి. ప్రస్తుతం 2 వేల మందికిపైగా బలంగా ఉన్న ఏఐ విభాగానికి దిశానిర్దేశం కొరవడింది. చాలా మందికి మెటాలో పని చేయడం ఇష్టం లేదు. తమ మిషన్ ఏమిటో కూడా వారికి తెలియదు. పదేపదే అంతర్గత విభేదాలు, అస్పష్టమైన లక్ష్యాలు నిర్దేషిస్తారు. ఇది జట్టు నూతన ఆవిష్కరణల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో పనిచేయకపోవడం మాత్రమే కాదు. మెటాస్టాటిక్ క్యాన్సర్‌లా ఇది సంస్థను ప్రభావితం చేస్తుంది’ అని ఆయన అన్నారు.ఇదీ చదవండి: తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర..ఓపెన్ఏఐ, గూగుల్ డీప్‌మైట్‌ వంటి ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు మెటా తన ఏఐ కార్యకలాపాలను దూకుడుగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయన విమర్శలు గుప్పించారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) నిర్మాణంపై దృష్టి సారించే సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగాన్ని కంపెనీ ఇటీవల సృష్టించింది. మెటా పరిశ్రమ అంతటా అగ్రశ్రేణి ప్రతిభావంతులను నియమించుకుంటోంది. అందుకు కంపెనీ ఎంతైనా ఇచ్చేందుకు వెనకాడడంలేదు.

Vidya Balan Says She Lost 9 Films, After Film With Mohanlal Got Shelved7
ఆ ఒక్క కారణంతో రాత్రికి రాత్రే 9 ప్రాజెక్టుల నుంచి తీసేశారు.. : విద్యా బాలన్‌

చిత్ర పరిశ్రమలో రాణించడం చాలా కష్టం. ఇప్పుడు స్టార్‌ హోదాలో ఉన్నవారంతా ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించే ఈ స్థాయికి వచ్చారు. ముఖ్యంగా హీరోయిన్లకు కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఫస్ట్‌ చాన్స్‌ కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూసినవాళ్లు కూడా ఉన్నారు. వచ్చిన ఆ ఒక్క చాన్స్‌ని సరిగ్గా వాడుకున్న వాళ్లే ఇప్పుడు స్టార్‌ హీరోయిన్లుగా మారారు. అలా అందరిలాకే కెరీర్‌ ప్రారంభంలో తాను కూడా చాలా ఇబ్బందులు పడ్డానని చెబుతోంది బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యా బాలన్(Vidya Balan)‌. ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ టాలెంటెడ్‌ నటిపై మొదట్లో ‘ఐరెన్‌ లెగ్‌’ అనే ముద్ర వేసి రాత్రికి రాత్రే 9 ప్రాజెక్టుల నుంచి తీసేశారట. ఈ విషయాన్ని తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా విద్యా బాలనే చెప్పింది.‘కెరీర్‌ ప్రారంభంలో నాకు మోహన్‌లాల్‌తో కలిసి ‘చక్రం’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. షూటింగ్‌ ప్రారంభం అయిన కొన్నాళ్లకు అనూహ్యంగా అది ఆగిపోయింది. దానికి కారణం నేనే అని ప్రచారం జరిగింది. నాపై ‘ఐరెన్‌ లెగ్‌’ అనే ముద్ర వేసి ఘోరంగా విమర్శించారు. చక్రం సినిమా ఆగిపోయిందనే విషయం తెలియగానే రాత్రికి రాత్రే నేను ఒప్పుకున్న 9 ప్రాజెక్టుల నుంచి నన్ను తొలగించారు. అసలు ఆ సినిమా ఆగిపోవడానికి కారణం నేను కానే కాదు. ఆ మూవీ డైరెక్టర్‌, మోహన్‌లాల్‌ మధ్య బేధాభిప్రాయాలు రావడంతో సగంలోనే ఆపేశారు. అది నా కెరీర్‌పై చాలా ప్రభావం చూపింది. అయినా నేను ధైర్యం కోల్పోలేదు. విశ్వాసంతో ముందుకు సాగాను. నాపై నాకు ఉన్న నమ్మకే ఈ రోజు ఈ స్థాయిలో నిలబడేలా చేసింది. విశ్వాసంతో ముందుకుసాగితే ఏదోఒకరోజు కచ్చితంగా మనది అవుతుంది’ అని విద్యా చెప్పుకొచ్చింది. కాగా, 2005లో పరిణిత మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన విద్యా.. ‘ది డర్టీ పిక్చర్‌’తో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. సిల్క్‌ స్మిత జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో విద్యా లీడ్‌ రోల్‌ చేసింది. ఆమె నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూ.. బాలీవుడ్‌లోనే కాదు దేశమంతటా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. ఇటీవల భూల్‌ భూలయ్య 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మరో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది.

Phone tapping Case SIT Will Approach Supreme Court8
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ట్విస్ట్‌.. ప్రభాకర్‌ రావుకు ఝలక్‌!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సిట్‌ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు డీసీపీ విజయ్‌కుమార్‌, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి వెళ్లారు.అయితే, గతంలో ప్రభాకర్‌ రావును అరెస్ట్‌ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మినహాయింపులు రద్దు చేయాలని సుప్రీంకోర్టును సిట్‌ అధికారులు కోరనున్నారు. ప్రభాకర్‌ రావు విచారణకు సహకరించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభాకర్‌ రావును కస్టడీకి తీసుకోవాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను సిట్‌ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు డేటా కీలకంగా మారనుంది. వీటి నుంచి డేటాను సేకరించి పనిలో అధికారులు ఉన్నారు. ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కి సిట్ అధికారులు పంపించారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ నుండి మార్చి15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రభాకర్‌ రావు.. పలువురు బీఆర్‌ఎస్‌ నేతలతో, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సిట్‌ అనుమానం వ్యక్తం చేస్తోంది.ఇక, ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్‌ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. రేపు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. 2023 నవంబర్ 15 నుండి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లను సిట్‌ గుర్తించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ధ్వంసమైన హార్డ్ డిస్కులలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్టు సమాచారం. దీంతో, సిట్‌ అధికారులు.. హార్డ్ డిస్కులపైన ఆశలు పెట్టుకున్నారు. డేటా రిట్రైవ్, హార్డ్‌ డిస్కులోని రహస్యాలపై సిట్ ఆరా తీస్తోంది.

Welcome to Afghanistan Most Bizarre Tourism Video Ever9
అమెరికా.. మీకు ఇదే మా సందేశం: తాలిబన్లు

మార్పును బట్టే సమాజం ముందుకు పోతోంది. కానీ, కొన్ని దేశాల్లో మాత్రం మతం, ఆచార వ్యవహారాల పేరిట వెనక్కి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జాబితాలో అఫ్గనిస్తాన్‌కు చోటు ఉంది. అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాలతో వీధుల వెంట విచ్చలవిడిగా తిరుగుతుండడం, విద్యపై నిషేధం, మహిళలపై అక్కడ అమలు చేస్తున్న కఠిన ఆంక్షల సంగతి సరేసరి. ఇలాంటి తరుణంలో తాలిబన్ల నుంచి కలలో కూడా ఊహించని వీడియో ఒకటి విడుదలై ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓపెన్‌ చేయగా.. ముసుగులో ఉన్న కొందరు వ్యక్తుల చుట్టూ ఏకే 47 తుపాకులతో, మారణాయుధాలతో తాలిబన్లు కనిపిస్తారు. అమెరికా ఇదే మా సందేశం అంటూ ఓ వ్యక్తి చెబుతున్నాడు. ఆ వెంటనే కింద ఉన్న వ్యక్తికి ఉన్న ముసుగు తొలగించగానే.. చిరునవ్వుతో Welcome to Afghanistan అంటూ ఆహ్వానిస్తాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అఫ్గన్‌ నేలపై ఉన్న ప్రకృతి సుందర దృశ్యాలు, అక్కడి ఆహారం.. ఇలా అన్నింటినీ అందులో చూపించారు. పాశ్చాత్య టూరిస్టులు అక్కడి సంప్రదాయ పఠాన్‌ దుస్తులను ధరించి.. స్థానిక వంటలు ఆస్వాదిస్తూ, జలపాతాల్లో ఈతలు కొడుతూ, స్థానికులతో నవ్వుతూ కనిపిస్తారు. ఇవన్నీ మాంచి ఫన్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగుతాయి. ఈ వీడియోను తాలిబన్‌ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదు. కానీ, తాలిబన్లకు సంబంధించిన పేజీల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. సాధారణంగా.. ఉగ్రవాదులు విదేశీయులను అపహరించి.. వాళ్ల పీకలు కోస్తూ వీడియోలు తీసి బయటకు వదలడం గతంలో జరిగేది. ఆ ఫార్ములానే ఇప్పుడు టూరిజం ప్రమోషన్‌ కోసం తాలిబన్లు వాడుకుంటున్నారు. మీ నుంచి(అమెరికా) మేం స్వేచ్ఛను దక్కించుకున్నాం. ఇప్పుడు మీరు మా దేశానికి అతిథులుగా రండి అంటూ ఆ వీడియోలో చెప్పడం ఉంది.ప్రశాంతమైన వాతావరణం, అందులో విదేశీ పర్యాటకులతో స్థానికుల సందడి.. పైగా డమ్మీ తుపాకులపై Property of US Government అని రాసి ఉండడం వాళ్ల వెటకారాన్ని బయటపెట్టంది. వెరసి అఫ్గనిస్తాన్‌ను ఆతిథ్యభరిత దేశంగా చూపించే ప్రయత్నమిదనే విషయం ఈ వీడియోతో స్పష్టమవుతోంది. అయితే..అఫ్గనిస్తాన్‌ను అమెరికా బలగాలు వీడాక.. 2021 అగష్టులో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇది తాత్కాలికమే అయినప్పటికీ అంతర్జాతీయంగా ఆ ప్రభుత్వానికి గుర్తింపు దక్కకపోవడంతో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. పైగా ఈ దేశం ఇంకా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల జాబితాలోనే ఉండడంతో.. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పటికీ అఫ్ఘానిస్థాన్‌కి ప్రయాణించవద్దని హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఆ దేశం.ప్రపంచానికి తాము మారిపోయామని తాలిబన్లు చూపించిన ఈ ప్రయత్నం ఒకవైపు ఆశ్చర్యంతో పాటు వీడియోపై విమర్శలు అదే స్థాయిలో వెల్లువెత్తాయి. తుపాకులతో యుద్ధ నేరాల తరహాలో పర్యాటకాన్ని ప్రమోట్‌ చేయడంపై మండిపడుతున్నారు. పైగా వీడియోలలో ఎక్కడా ఒక మహిళను చూపించకపోవడమూ విమర్శలు తావిస్తోంది. ఇది అడ్వైర్‌టైజ్‌మెంటా? లేదంటే పర్యాటకులకు హెచ్చరికనా? అని గొణుక్కునేవారు లేకపోలేదు. The Taliban has released a tourism appeal video aimed at attracting American visitorsTheir message to Americans:"Now that we've liberated our homeland from you, you're welcome to come back as tourists or guests"Would you go? #Afganistan pic.twitter.com/iLRYXFAJjn— Nabila Jamal (@nabilajamal_) July 9, 2025‘‘తాలిబాన్లు ప్రపంచంపై ఓ ముద్ర వేసుకుని ఉన్నారు. అది చెరిపేసుకునేందుకు గత నాలుగేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, బాహ్య ప్రపంచానికి ఏం ఆకర్షణీయంగా కనిపిస్తుందో అంచనా వేయడంలో వాళ్లు తప్పటడుగే వేస్తున్నారు’’ అని ఓ విశ్లేషకుడు ఈ వీడియోపై అభిప్రాయపడ్డారు. ఇంతకీ అఫ్గన్‌ నేలపై ఏమున్నాయి.. కాబూల్ (Kabul) అఫ్గన్‌ రాజధాని నగరం. గార్డెన్స్‌ ఆఫ్‌ బాబర్‌, దారుల్‌ అమల్‌ ప్యాలెస్‌, నేషనల్‌ మ్యూజియం వంటి ప్రాచీన, సాంస్కృతిక స్థలాలు ఉన్నాయి. దారుల్‌ అమల్‌ ప్యాలెస్‌హెరాత్ (Herat)లో సుప్రసిద్ధ మసీదు, హెరాత్‌ సిటాడెల్‌ వంటి ఇస్లామిక్ శిల్పకళకు ప్రసిద్ధి చెందిన కట్టాడాలున్నాయి.మజార్-ఇ-షరీఫ్ (Mazar-e-Sharif) – Blue Mosque అనే అద్భుతమైన మసీదు ఇక్కడ ఉంది.బామియాన్ (Bamiyan) – బౌద్ధ విగ్రహాల అవశేషాలు, UNESCO వారసత్వ ప్రదేశం.కాందహార్ (Kandahar) – Mosque of the Sacred Cloak, అఫ్గాన్ చరిత్రకు కేంద్రం.జలాలాబాద్ (Jalalabad) – పచ్చని ఉద్యానవనాలు, ఆకర్షనీయమైన వాతావరణం.ఫైజాబాద్ (Faizabad) – హిందూ కుష్ పర్వతాల మధ్య ఉన్న ప్రకృతి అందాలు.బాండ్-ఎ-అమీర్ నేషనల్ పార్క్ (Band-e Amir National Park) – నీలి సరస్సులు, పర్వతాలు; అఫ్గాన్‌లో మొట్టమొదటి నేషనల్ పార్క్.పంజ్‌షీర్ లోయ (Panjshir Valley) – మంచుతో కప్పబడిన పర్వతాలు, నదులు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గం.బాల్క్ (Balkh) – పురాతన నగరం; రూమీ జన్మస్థలం, బౌద్ధ మరియు జరోస్త్రియన్ చరిత్రకు కేంద్రం.బిజినెస్‌ ఇన్‌సైడర్‌ గణాంకాల ప్రకారం.. 2021 చివరి నుంచి ఇప్పటిదాకా 14,500 మంది విదేశీయులు అఫ్గనిస్తాన్‌లో పర్యటించారు. అందులో రష్యా, చైనా, టర్కీ, మిడిల్‌ ఈస్ట్‌కు చెందిన వాళ్లు న్నారు. వీళ్లలో చాలామంది వ్లోగర్స్‌ ఉండడం గమనార్హం. వీళ్లు అక్కడి టూరిజాన్ని, ఆహారపు అలవాట్లను ప్రమోట్‌ చేసే వీడియోలనే ఎక్కువగా వదిలారు.

Aashada Masam warangal bhadrakali temple significance and importance10
జయహో శాకంబరీ మాత!

అమ్మవారంటే సాక్షాత్తూ అమ్మే. ఈ సృష్టిలోని జీవరాసులన్నింటికీ అమ్మ అయిన జగన్మాత అందరి ఆకలిని తీర్చడానికి శాకంబరి దేవి అవతారంలో ఉద్భవించింది. ఈ దేవిని పూజించటం వల్ల కరువు కాటకాల నుంచి విముక్తి లభిస్తుందనీ, ఆకలి బాధ ఉండదనీ భక్తులు విశ్వసిస్తారు. వరంగల్‌లోని భద్రకాళీ అమ్మవారికి శాకంబరీ దేవి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరిస్తారు. ఇందుకు సంబంధించిన పురాణ గాధ తెలుసుకుందాం...∙ఆషాఢ ఉత్సవాలువేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు. దానితో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్ని మర్చిపోయారు. తత్ఫలితంగా దేవతలకు హవిస్సులు అందక శక్తి హీనులై΄ోయారు. నదీ నదాలు ఎండిపోయాయి. వర్షాలు లేక వృక్ష జాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించసాగింది.ఋషులు, దేవతలు సర్వ శక్తిస్వరూపిణి అయిన పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు ఆ దేవి కరుణతో ‘శతాక్షి’గా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది. బీటలు వారిన భూమిని, కరవు కాటకాలను, లోకంలో వున్న దుస్థితి ని చూసి అమ్మవారి ఒక కన్నులోంచి నీరు రాగా, ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకం అంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించటానికి కొంచెం వ్యవధి పడుతుందని, ప్రజల ఆకలి వెంటనే తీర్చటానికి, అమ్మవారు అమితమైన దయతో శాకంబరి అవతారం దాల్చి వివిధమైన కాయగూరలు, పళ్ళతో సహా ఒక పెద్దచెట్టు లాగా దర్శనమిచ్చింది. ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్న ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు. ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకంబరి అవతారం.పార్వతీదేవి దుర్గగా, తన నుంచి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన 32 శక్తులతో దుర్గమాసురునితో, రాక్షస సైన్యాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుని సంహరించింది. అలనాటి ఈ ఘటనకు ప్రతీకగా విజయవాడ ఇంద్రకీలాద్రితోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవీ ఆలయాల్లో ఆషాఢ మాసం లో శాకంబరీ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. శుక్లపక్ష త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మూడు రోజులు ఈ ఉత్సవాలు సాగుతాయి.వరంగల్‌లోని భద్రకాళీ ఆలయంలో మొదటిసారిగా ఆషాడ శుద్ధ సౌర్ణమి నాడు శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. క్రమంగా ఇవి కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో కూడా ప్రారంభించారు. దేవీ భాగవతంతో పాటు మార్కడేయ పురాణంలోని చండీసప్తశతిలో శాకంబరీ దేవి గురించిన ప్రస్తావన ఉంది. నీటి చుక్క కూడా లేకుండా వందేళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు... అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులు నన్ను స్తుతిస్తారు... వారి కోరిక మేరకు నేను అయోనిజనై అవతరిస్తాను.. నా శత నయనాలతో చూస్తూ లోకాలను కాపాడుతాను.. అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షీదేవిగా కీర్తిస్తారు. ఆ తర్వాత నా దేహం నుండి శాకములను పుట్టించి, మళ్లీ వర్షాలు పడేంత వరకు జనుల ఆకలి తీర్చి, ప్రాణాలను రక్షిస్తాను. అందువల్లనే నేను శాకంబరీదేవిగా ప్రసిద్ధి పొందుతానని’ అమ్మవారు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది.కనకదుర్గ గుడిలో కూరగాయలతో అలంకరణఈ సమయంలోనే దుర్గముడనే రాక్షసుని సంహరించిన జగన్మాత దుర్గాదేవిగా కీర్తి పొందింది. శాకంబరీ దేవి నీలవర్ణంలో సుందరంగా ఉన్న కమలాసనంపై కూర్చుని ఉంటుంది. తన పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకొని ఉంటుంది. మిగిలిన చేతులతో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలైన కూరగాయల సముదాయాన్ని ధరించి ఉంటుంది. ఈ శాకాల సముదాయం అంతులేని కోర్కెలను తీర్చే రసాలు కలిగి ఉంటాయి. జీవులకు కలిగే ఆకలి, దప్పిక, మృత్యువు, ముసలితనం, జ్వరం మొదలైనవి పోగొడతాయి. కాంతులను ప్రసరించే ధనుస్సును ధరించే పరమేశ్వరిని శాకంబరీ, శతాక్షి, దుర్గ అనే పేర్లతో కీర్తింపబడుతుంది. ఈ దేవి శోకాలను దూరం చేసి, దుష్టులను శిక్షించి శాంతిని కలుగజేయడమే కాదు పాపాలను పోగొడుతుంది. ఉమాగౌరీ సతీ చండీ కాళికా పార్వతి అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి పొందింది. ఈ శాకంబరీ దేవిని భక్తితో స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు. నమస్కరించేవారు, జపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారు. శుక్లపక్ష చంద్రుడు ప్రతిరోజు వృద్ధి చెందుతూ పౌర్ణమినాడు షోడశకళా ప్రపూర్ణుడవుతాడు.చదవండి: తొమ్మిది వారాల సాయిబాబా వ్రతం చేస్తున్నా: ఉపాసన కొణిదెల ఆషాఢమాసంలో ఆలయానికి వెళ్లే అవకాశం లేని భక్తులు కనీసం అమ్మవారి ముందు రకరకాల పండ్లు, కూరగాయలను ఉంచి, వీలయితే వాటితో అమ్మవారిని అలంకరించి, ముందుగా కొన్ని మనం స్వీకరించి ఆ తర్వాత వాటిని పేదలకు పంచిపెడితే చాలా మంచిది. అందుకు కూడా వీలు లేనివారు కనీసం శాకంబరీ ఉత్సవాలు జరిగే రోజుల్లో అమ్మవారిని తలచుకుని పేదలకు పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు దానం చేయడం ఫలదాయకం.వరంగల్‌ శ్రీభద్రకాళి దేవాలయంలో గత నెల జూన్‌ 26న సహస్ర కలశాభిషేకంతో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 15రోజుల పాటు అమ్మవారికి వివిధ క్రమాలలో పూజలు నిర్వహించారు. నేడు గురువారం పౌర్ణమి సందర్భంగా మహాశాకంబరీ అమ్మవారిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!– అడ్లూరి సునందాశివప్రసాద్‌ సాక్షి, హన్మకొండ కల్చరల్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement