
బాలబాలాజీ స్వామివారి దర్శనానికి బారులు దీరిన భక్తులు
రాయవరం: పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం జారీ చేసిన సూచనలకు అనుగుణంగా వాతావరణ నివేదికను దృష్టిలో ఉంచుకుని, ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకూ హాఫ్ డే స్కూల్స్ అమలు చేయనున్నారు. జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్, గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్ పాఠశాలలన్నీ ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నెల రెండో శనివారాన్ని కూడా పనిదినంగానే పాటించాల్సి ఉంది. పాఠశాల ముగిసిన అనంతరం మధ్యాహ్న భోజనం అందజేసిన తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపించాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలు హాఫ్ డే స్కూల్స్‌ను కచ్చితంగా పాటించాలని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ విద్యా సంచాలకులు జి.నాగమణి సూచించారు.
కిక్కిరిసిన అప్పనపల్లి ఆలయం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుంచే అనేకమంది పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఉభయ దేవేరులతో కొలువు దీరిన స్వామివారిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.2.81 లక్షల ఆదాయం సమకూరింది. లడ్డూ ప్రసాదం, దర్శనం టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.1.91 లక్షల ఆదాయం వచ్చింది. ఆలయంలో నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.90,495 విరాళంగా సమర్పించారు. స్వామివారిని 3,975 మంది దర్శించుకోగా 3,561 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ ఏర్పాట్లను దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంకేటీ నాగవరప్రసాద్, ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ చిట్టూరి రామకృష్ణ, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఉద్యోగులు పర్యవేక్షించారు.
పన్నుల చెల్లింపునకు మరో రాయితీ
అమలాపురం టౌన్: గడిచిన ఆర్థిక సంవత్సరంలో పట్టణాల్లో పన్ను బకాయి వసూళ్లను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మాఫీ చేసింది. ఇప్పుడు 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండు దఫాల పన్నులను ఈ నెలాఖరు లోపు ఒకేసారి స్వచ్ఛందంగా చెల్లిస్తే ఆ పన్నుల మొత్తంలో ఐదు శాతం రాయితీని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అలాగే ఒకేసారి మొత్తం ఏడాది పన్నులు చెల్లించలేని వారికి మరో అవకాశం కూడా ఇచ్చింది. మొదటి దఫా పన్నులను ఈ నెలాఖరులోగా స్వచ్ఛందంగా ఒకేసారి చెల్లిస్తే వడ్డీ అనేది ఉండదు. ఈ రెండు అవకాశాలను పన్నుల చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీల కమిషనర్లు విజ్ఞప్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment