వనరులను దోచుకుంటున్న కూటమి
ప్రభుత్వ మాజీ విప్ చిర్ల జగ్గిరెడ్డి
మలికిపురం: ప్రస్తుత కూటమి ప్రభుత్వం అక్రమాలకు నిలయంగా మారిందని, ఆ పార్టీ నేతలంతా వనరులను దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. శనివారం మలికిపురంలో రాజోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎనిమిది నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక ధరలు ఆకాశాన్నంటాయని, విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డివిరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం విళయ తాండవం చేస్తుందని, నిరుద్యోగ భృతి మాత్రం ఇవ్వడం లేదని అన్నారు. ఉచిత బస్ కానరావడం లేదన్నారు. ఇలా సూపర్‌సిక్స్ అంటూ పథకాల పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ప్రస్తుత కూటమి పాలనను చూసి విస్తుపోతున్నారన్నారు. ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల జోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు మాజీ సీఎం జగన్ సన్నద్ధం అయ్యారన్నారు. ఓటమి పాలైన మరుసటి రోజు నుంచే పార్టీ బలోపేతానికి శ్రమిస్తూ, జిల్లాలో తమ లాంటి నాయకులకు ఉత్సాహమిచ్చిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును ప్రతి కార్యకర్త స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. మాజీ మంత్రి సూర్యారావు మాట్లాడుతూ అన్ని వర్గాలకూ తమ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు. అనంతరం పార్టీ నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. పార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్, సీనియర్ నాయకులు కేఎస్‌ఎన్ రాజు, కటకంశెట్టి ఆదిత్య, దొంగ నాగ సత్యనారాయణ, సూరిశెట్టి బాబి, పాటి శివకుమార్, జంపన బుజ్జీరాజు, కేవీ చంటిరాజు, జెడ్పీటీసీ సభ్యులు దొండపాటి అన్నపూర్ణ, మట్టా శైలజ, ఎంపీపీ కుసుమ వనజకుమారి, రాజోలు నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు కె.ఎస్తేరు రాణి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment