
కార్డ్ 2.0తో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్
జిల్లా రిజిస్ట్రార్ నాగ లింగేశ్వరరావు
అమలాపురం టౌన్: తమ శాఖలో అమలవుతున్న కార్డ్ 2.0 విధానం వల్ల కేవలం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆస్తుల క్రయ విక్రయదారులను పంపిస్తున్నామని జిల్లా రిజిస్ట్రార్ సీహెచ్. నాగ లింగేశ్వరరావు స్పష్టం చేశారు. అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. అమలాపురం రిజిస్ట్రార్ –1 శ్రీలక్ష్మి, రిజిస్ట్రార్ –2 లక్ష్మణరాజుతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై చర్చించారు. కార్డ్ 2.0 విధానం అమలవుతున్న తీరుపై ఆరా తీశారు. అనంతరం పట్టణం, పరిసర గ్రామాల్లో రియల్ ఎస్టేట్‌లు నిర్వహిస్తున్న బిల్డర్లతో సమావేశం ఏర్పాటుచేసి చర్చించారు. కార్డ్ 2.0 విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన బిల్డర్లకు సూచించారు.
కన్వర్షన్ సమస్యలపై జిల్లా అధికారికి ఏకరువు
ఎకరా భూమిలో 10 సెంట్లు కన్వర్షన్ అయితే ఆ భూమి మొత్తం గజాల్లో పరిగణించడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని బిల్డర్లు జిల్లా అధికారి నాగ లింగేశ్వరరావుకు వివరించారు. భూమిని కన్వర్షన్ చేయడంలో కూడా రెవెన్యూ అధికారులు పెడుతున్న ఆంక్షలు, చేస్తున్న ఆలస్యం వల్ల తాము నష్టపోతున్నామని బిల్డర్లు పేర్కొన్నారు. ఆరు నెలలకు కూడా కన్వర్షన్ చేయడం లేదని వివరించారు. కన్వర్షన్ పరంగా బిల్డర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి పెట్టి, వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని నాగ లింగేశ్వరరావు స్పప్టం చేశారు. నిర్మాణం పూర్తయిన ప్లాట్లకు పన్ను విధించే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా జిల్లా అధికారుల దృష్టికి బిల్డర్లు తీసుకుని వచ్చారు. రెవెన్యూ ఉన్నతాధికారులతో మీ ఇబ్బందులు, సమస్యలపై చర్చిస్తామని నాగ లింగేశ్వరరావు స్పష్టం చేశారు. బిల్డర్లు చిక్కాల గణేష్, కల్వకొలను తాతాజీ, సుంకర నాయుడు, అరిగెల బుజ్జి, చింతపల్లి చిన్నా, మండేల బాబి, ఆశెట్టి ఆదిబాబు, ముద్రగడ తాసు, ఎరుబండి నాని జిల్లా రిజిస్ట్రార్‌తో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment