ఆర్యవైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలిగా సీతామహాలక్ష్మి
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్య వైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలిగా అమలాపురానికి చెందిన యెండూరి సీతామహాలక్ష్మి రెండో సారి ఎన్నికయ్యారు. కాకినాడ జిల్లా అన్నవరంలో బుధవారం జరిగిన జిల్లా ఆర్య వైశ్య మహాసభ సమావేశంలో సీతామహాలక్ష్మి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్య వైశ్య సంఘాలకు సంబంధించి పలు అనుబంధ కమిటీల్లో కీలక పదవులు నిర్వహిస్తున్న సీతామహాలక్ష్మి జిల్లా మహిళా విభాగం ద్వారా ఆర్యవైశ్య మహిళలకు సేవలందిన్నందుకు ఆమెను ఈ పదవి రెండో సారి వరించిందని మహాసభ అధ్యక్షుడు కంచర్ల బాబి అన్నారు. తనతో పాటు కార్యదర్శిగా గ్రంధి సుజాత, కోశాధికారిగా కాసు భవాని కూడా ప్రమాణ స్వీకారం చేశారని సీతామహాలక్ష్మి తెలిపారు. ఈ మేరకు అమలాపురం ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు నంబూరి సత్యనారాయణమూర్తి, యెండూరి నాగేశ్వరరావు, వరదా సూరిబాబు, అప్పన వీరన్న, వంకాయల కాశీ తదితరులు సీతామహాలక్ష్మి ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అదనపు కార్యదర్శి యెండూరి రాఘవ ఆమెను అభినందించారు.
పశుగ్రాసానికి వెళ్లి..
అసువులు బాసి..
గండేపల్లి: పశుగ్రాసానికి పొలానికి వెళ్లిన వ్యక్తి అసువులు బాసిన వైనమిది. ఉదయాన్నే పొలానికి వెళ్లిన అతడు తిరిగి వస్తాడని ఎదురు చూసిన కుటుంబ సభ్యులకు చివరికి కన్నీళ్లే మిగిలాయి. రంగంపేట మండలం పెదరాయవరం గ్రామానికి చెందిన కాకర్ల నాగేంద్ర (34) గండేపల్లి మండలం యల్లమిల్లిలో గారపాటి కామరాజుకు చెందిన పొలాన్ని కొంత కాలంగా కౌలుకు చేస్తున్నాడు. రోజులానే గురువారం ఉదయాన్నే పొలానికి వెళ్లి, పశువుల కోసం చొప్ప కోసుకుని, మోపు కట్టుకుని తల పైకి ఎత్తుకునే సమయంలో పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు చొప్ప వెన్నులు తగిలాయి. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురైన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య నాగు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతడి పైనే కుటుంబం ఆధారపడి ఉందని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సోషల్ మీడియాలో
హద్దులు దాటితే చర్యలు
కాకినాడ క్రైం: సోషల్ మీడియాలో హద్దులు దాటి వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు, మా ర్ఫింగ్ వీడియోలు, సున్నిత అంశాలపై అసంబద్ధ ప్రస్తావనలు, కులమతాలు, ఓ వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కూడిన పోస్టులు, వ్యక్తిగత దూషణలకు దిగితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నెటిజన్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఆక్టోపస్ శిక్షణ పూర్తి
కాకినాడ క్రైం: ఉగ్ర చర్యల నిరోధక సంస్థ ఆక్టోపస్ ప్రత్యేక శిక్షణ తరగతులు పూర్తయ్యాయి. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల(ఆర్‌ఎంసీ)లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణలో 40 మంది కమాండోలు శిక్షణ పొందారు. ఆక్టోపస్ అదనపు ఎస్పీ సి.రాజారెడ్డి పర్యవేక్షణలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు ఎస్.మురళీకృష్ణ, కె.మహేష్‌ల ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్, రెక్కీలపై శిక్షణ నిర్వహించారు. ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం ఆదేశాలతో వైస్ ప్రిన్సిపాల్ శశి, ఫోరెన్సిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫణికిరణ్, లైబ్రేరియన్ లక్ష్మణరెడ్డి నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.
ఆర్యవైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలిగా సీతామహాలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment