ఎకో సెన్సిటివ్ ప్రణాళిక సిద్ధం చేయండి
అమలాపురం రూరల్: కోరంగి వైల్డ్ లైఫ్ అభయారణ్యం పరిధిలో వివిధ శాఖల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎకో–సెన్సిటివ్ జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీకి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అటవీ శాఖ అధికారి ఎంవీ ప్రసాద రావు, కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారి డి.రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి కోరంగి వైల్డ్ లైఫ్ అభయారణ్యం జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కోనసీమ జిల్లా పరిధిలో ఎకో సెన్సిటివ్ జోన్ సరిహద్దు 50 మీటర్ల నుంచి సముద్రం లోపల ఐదు కిలోమీటర్ల పరిధి 12 కిలో మీటర్ల పొడవునా ఉందని తెలిపారు. అక్కడి సామాజిక ఆర్థిక పరిస్థితులు, జీవన శైలి, కార్యకలాపాలపై సైంటిఫిక్ మ్యాపులను రూపొందించి మార్చి 15 నాటికి డ్రాప్ జోనల్ మాస్టర్ ప్లాన్ సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ రవీంద్రనాథ్ రెడ్డి కోరంగి వైల్డ్ లైఫ్ అభయారణ్యం జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీని సభ్యులకు వివరించారు. సమావేశంలో హైదరాబాద్ పర్యావరణ అభివృద్ధి కేంద్రం ఆర్‌డీ డాక్టర్ కె.జయచంద్రజీ, పశు సంవర్ధక శాఖ జేడీ ఎస్.వెంకట్రావు డీఆరీఏ పీడీ శివశంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment