గంజాయి రవాణాపై ఉక్కుపాదం
అంబాజీపేట: గంజాయి రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు జిల్లాలో ఏర్పాటైన ఈగల్ టీమ్‌లతో సత్ఫలితాలు సాధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు చెప్పారు. అంబాజీపేటలో ఉన్న పి.గన్నవరం సర్కిల్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం యువత పెడదోవ పడుతోందన్నారు. నేరాల నిరోధానికి ప్రత్యేక చర్యలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, మార్చి నుంచి కొత్త భారీగా చలానాలు విధిస్తామన్నారు. అవసరమైతే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమలాపురంలోని ఈదరపల్లి, నల్ల, ఎర్ర వంతెనల వద్ద ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటోందని, దాని పరిష్కారానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలో ట్రాఫిక్, సైబర్, మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. చోరీలు అరికట్టడంలో భాగంగా జిల్లాలోని ప్రధాన కూడళ్లలో 2,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లక్ష్యం కాగా, ప్రస్తుతానికి 850 మాత్రమే ఏర్పాటు చేశామన్నారు. దాతల సహాయంతో త్వరలో మిగిలిన సెంటర్లలో పెడతామన్నారు. పి.గన్నవరం సర్కిల్‌లోని అంబాజీపేట, అయినవిల్లి, పి.గన్నవరం, నగరం పోలీస్ స్టేషన్ల పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, పి.గన్నవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రుద్రరాజు భీమరాజు, ఎస్సైలు కె.చిరంజీవి, కోనాల మనోహరజోషి, బి.శివకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment