రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య
రాయవరం: వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం 11 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్యను తీసుకు వచ్చిందని జిల్లా వ్యవసాయాధికారి ఓలేటి బోసుబాబు తెలిపారు. పసలపూడిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు విశిష్ట సంఖ్య నమోదు (ఫార్మర్ రిజిస్ట్రీ) కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ కార్డు తరహాలో రైతులకు కేంద్ర ప్రభుత్వం రైతు విశిష్ట సంఖ్యను ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ నమోదు చేయించుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాల లబ్ధి పొందడానికి ఈ విశిష్ట సంఖ్య తప్పనిసరిగా ఉపకరిస్తుందన్నారు. పీఎం కిసాన్ లబ్ధి పొందుతున్న రైతులు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలన్నారు. జిల్లాలో పీఎం కిసాన్ పథకంలో 1.27 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 80,089 మంది విశిష్ట సంఖ్య కోసం నమోదు చేయించుకున్నారని అన్నారు. ఇది పొందాలంటే రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ జెరాక్స్, ఆధార్ నంబరు లింకు అయి ఉన్న ఫోన్ తీసుకుని రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్లి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల మధ్యలో నమోదు చేయించుకోవాలన్నారు. మండల వ్యవసాయాధికారి కొప్పిశెట్టి ప్రభాకర్, ఏడీఏ కాకి నాగేశ్వరరావు, వ్యవసాయ విస్తరణాధికారి శివశంకర్, వ్యవసాయ సహాయకులు షారుని, పీఏసీఎస్ సీఈఓ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment