ఆక్వాకు విద్యుత్ షాక్
సాక్షి, అమలాపురం/ ఉప్పలగుప్తం: ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం కోలుకోలేని విధంగా షాక్ ఇచ్చింది. రాయితీ విద్యుత్ ఇస్తున్నామంటూ ఒకవైపు గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం.. మరోవైపు అదనపు విద్యుత్ వినియోగానికి అపరాధ రుసుం.. కొత్త విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు వేసుకోవాలని మోయలేని భారం మోపుతోంది. విద్యుత్ సరఫరాను నిలుపుదల చేస్తోంది. దీనితో రొయ్యలు, చేపలు చనిపోతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తమ చెరువుల్లో రూప్‌చందువా మృత్యువాత పడిందని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన రైతులతోపాటు చుట్టుపక్కల రైతులు శుక్రవారం రాత్రి విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. చనిపోయిన చేపలను పెద్ద ఎత్తున తీసుకువచ్చి కార్యాలయం ఎదుట వేసి నిరసన తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చేపలు చనిపోయాయని వారు ఆరోపించారు. చెరువుల్లో చేపలను పెద్ద సంఖ్యలో సాగు చేస్తున్నామని, ఏరియేటర్ల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నామని వారు తెలిపారు. సరఫరా నిలిచిపోవడంతో చెరువులో డెడ్ ఆక్సిజన్ (డీవో) ఏర్పడి చేపలు చనిపోయాయని వారు వాపోయారు. తాము 18 ఎకరాల్లో సాగు చేస్తున్నామని, అధికారుల తీరుతో రూ.20 లక్షల వరకూ నష్టపోయామని ఆరోపించారు. రైతులు వస్తున్న సమాచారం తెలుసుకుని విద్యుత్ శాఖ సిబ్బంది కార్యాలయం వదిలి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యేకు సఖినేటిపల్లి రైతుల మొర
రాజోలు దీవిలో సఖినేటిపల్లి మండలం అంతర్వేది, గొందికి చెందిన రైతులు సైతం విద్యుత్ సరఫరా నిలుపుదలపై మండిపడుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ వద్దకు సుమారు 200 మంది రైతులు వెళ్లి వినతిప్రతం అందజేశారు. అదనపు వినియోగం, పాత బకాయిల పేరుతో ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కట్ చేస్తున్నారని వారు ఆరోపించారు. ‘సీఎండీ ఆర్డర్లు అంటూ మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలా రైతుల నడ్డివిరిచే చర్యలు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ప్రభుత్వం ఏదైనా ప్రయోజనం చేకూర్చే పనులు చేయాలని’ అని సొంత పార్టీ ఎమ్మెల్యే వద్ద ఆ పార్టీ అనుకూల ఆక్వా రైతులు వాపోవడం విశేషం. ప్రస్తుతం ఆక్వా ధరలు బాగున్నాయని, చెరువుల్లో పెద్ద ఎత్తున రొయ్యల పిల్లలు వదిలామని, విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ఏరియేటర్లు పనిచేయక చేపలు చనిపోయే ప్రమాదముందని వాపోయారు.
రూ.13.62 లక్షలకు నోటీసులు
జిల్లాలో కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడి తీర ప్రాంత గ్రామాల్లో వెనామీ, చేపల సాగు అధికం. ఇందులో రొయ్యల చెరువుకు ప్రభుత్వం రాయితీ విద్యుత్ అందిస్తోంది. కానీ అదనపు వినియోగం పేరుతో ఇటీవల భారీగా బిల్లులు భారం మోపుతున్నారు. సవరప్పాలేనికి చెందిన రైతుకు అదనపు విద్యుత్ వినియోగం పేరుతో ఒక సర్వీసుకు రూ.60 వేలు, మరో సర్వీసుకు రూ.25 వేల బిల్లు పంపించారు. ఈ రెండు సర్వీసులకు సంబంధించి చెరువుల వద్ద రెండు ట్రాన్మ్‌ఫార్మర్లు వేయాలని తాజాగా నోటీసులు పంపారు. ఇందుకు ఒక్కదానికి రూ.6,95,900 లక్షలు, మరోదానికి రూ.6,66,981 చొప్పున మొత్తం రూ. 13,62,881 చెల్లించి కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు వేయించుకోవాలని చెప్పారు. వెంటనే స్పందించనందున విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు.
ఫ ఇప్పటికే అదనపు
లోడ్ పేరుతో వాతలు
ఫ చెప్పా పెట్టకుండా కరెంట్ కట్
ఫ ఉప్పలగుప్తం సబ్ స్టేషన్ వద్ద
చనిపోయిన చేపలు వదిలి నిరసన
రూ.20 లక్షలు నష్టపోయా..
నేను 18 ఎకరాల్లో రూప్ చందువా సాగు చేస్తున్నాను. సిబ్బంది వచ్చి మా విద్యుత్ కనెక్షన్లు తొలగించారు. దీనివల్లే రూ.20 లక్షల విలువ చేసే మా చేపలు చనిపోయాయి. కనెక్షన్ తొలగించడానికి కారణం ఏంటని అడిగితే అదనపు లోడ్ బిల్లు చెల్లించాలని సమాధానం ఇచ్చారు. దీనిపై నాకు ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు.
– నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ఆక్వా రైతు, ఎన్.కొత్తపల్లి, ఉప్పలగుప్తం మండలం
ఆక్వాకు విద్యుత్ షాక్
ఆక్వాకు విద్యుత్ షాక్
Comments
Please login to add a commentAdd a comment