
బేటీ బచావో– బేటీ పఢావోతో సత్ఫలితాలు
అమలాపురం రూరల్: బాలికలను రక్షించి బాలికా విద్యను ప్రోత్సహించడంతో పాటు లింగ వివక్షను రూపు మాపేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో– బేటీ పఢావో కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యా లయం వరకూ మహిళా సంక్షేమ శాఖ మహిళా పోలీస్ సిబ్బందితో నిర్వహించిన బైక్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ కార్యక్రమం బాలికలకు విద్య, వారి కలలను సాకారం చేసుకోవడానికి సరైన వాతావరణాన్ని సృష్టించిందన్నారు. ఐసీడీఎస్ పథక సంచాలకులు బి.శాంతకుమారి, డీఎస్పీ టీవీఆర్‌కే ప్రసాద్, సబ్ ఇన్‌స్పెక్టర్లు, సీడీపీఓలు, మహిళా ఉద్యోగులు, మహిళా కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
అంధత్వ లోపాల నివారణకు చర్యలు
అంధత్వ లోపాల నివారణకు చర్యలు చేపట్టాలని జేసీ నిషాంతి ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో కలెక్టరేట్ ఉద్యోగులకు కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి నెలా ఉద్యోగుల సంక్షేమం కోసం ఏదో ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నాల్గో శనివారం ఉద్యోగులకు కంటి వైద్య పరీక్షలు, బీపీ, మధుమేహం పరీక్షలను నిర్వహించారు. అంధత్వ నివారణ ప్రోగ్రామింగ్ అధికారి డాక్టర్ ఎ.హేమలత, జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్‌ఎన్ రాజకుమారి, పరిపాలనాధికారి కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.
జనసేన నాయకుడి అరెస్ట్
కాట్రేనికోన: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన జనసేన నాయకుడు త్సవటపల్లి నాగభూషణంను శనివారం అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా, బెయిల్ మంజూరైందని ఎస్సై అవినాష్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. గత సంక్రాంతికి చెయ్యేరులో ప్రభల తీర్థం సందర్భంగా ఆర్కెస్ట్రా వద్ద మెయిన్ రోడ్డు వెంబడి ట్రాఫిక్ క్లియరెన్స్ విషయంలో నాగభూషణం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో కేసు నమోదు చేశారు. నాగభూషణంను అరెస్టు చేసి ముమ్మిడివరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ను తిరస్కరించి బెయిల్ మంజూరు చేశారని ఎస్సై తెలిపారు. అయితే జనసేన నాయకుడి అరెస్ట్ విషయాన్ని ఎమెల్యే దాట్ల బుచ్చిబాబుకు తెలియజేసేందుకు జనసైనికులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని వారు చెబుతున్నారు.
9, 10 తరగతుల్లో
సిలబస్ తగ్గించండి
అమలాపురం టౌన్: ప్రభుత్వం కొత్తగా పాఠ్య పుస్తకాలు ముద్రిస్తున్న దృష్ట్యా సిలబస్ తగ్గింపుపై దృష్టి పెట్టాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) జిల్లా అధ్యక్షుడు నరాల కృష్ణకుమార్ డిమాండ్ చేశారు. ప్రధానంగా 9, 10 తరగతుల ఇంగ్లిషు, సోషల్ పాఠ్యాంశాల సిలబస్‌ను తగ్గించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ మేరకు అమలాపురంలో ఆ యూనియన్ జిల్లా శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ రెండు పాఠ్యాంశాల సిలబస్ సమయానికి పూర్తి కాదేమోనన్న కంగారులో వేగంగా పాఠ్యాంశాల బోధన చేయాల్సి వస్తోందన్నారు. దీంతో దిగువ అభ్యాసన స్థాయి విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఆయా పాఠ్యాంశాలపై ఆసక్తి చూపలేకపోతున్నారని ఆయన అన్నారు. ప్రస్తు తం సోషల్ పాఠ్యాంశానికి సంబంధించి నాలుగు పాఠ్య పుస్తకాలు ఉన్నాయన్నారు. చరిత్ర, భూగోళ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం ఈ నాలుగు పాఠ్యాంశాలకు సిలబస్‌లు తగ్గించి ఓ పాఠ్య పుస్తకంగా రూపొందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంగ్లిషు పాఠ్యాంశానికి సంబంధించి వర్క్ బుక్‌లోని అంశాలను రీడర్ (టెక్ట్స్ బుక్)లో చేర్చి సిలబస్‌ను తగ్గిస్తూ ఒకే పాఠ్య పుస్తకంగా రూపొందించాలన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దీపాటి సురేష్‌బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ మొంగం అమృతరావు ఇదే అంశాలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బేటీ బచావో– బేటీ పఢావోతో సత్ఫలితాలు
Comments
Please login to add a commentAdd a comment