
నష్ట పరిహారం అందించండి
ఆక్వా రైతుల డిమాండ్
ఉప్పలగుప్తం: అధికారుల తీరు కారణంగానే ఆక్వా రైతు నష్టపోతున్నారంటూ, నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు తిరిగి ఆందోళనకు దిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి గ్రామంలో రూప్ చందువా సాగు చేస్తున్న నిమ్మకాయల వెంకటేశ్వరరావు చెరువు వద్ద విద్యుత్ కనెక్షన్ తొలగించడంతో శుక్రవారం రైతులు ఉప్పలగుప్తం సబ్ స్టేషన్ వద్ద చనిపోయిన చేపలతో నిరసన చేపట్టిన విషయం విదితమే. రైతును అధికారులు ఆదుకుని నష్ట పరిహారం చెల్లించాలంటూ స్థానిక రైతులంతా విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఎస్.రాజబాబు ఎదుట శనివారం తిరిగి ఆందోళనకు దిగారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విద్యుత్ కనెక్షన్ తొలగించడంతో చేపలు చనిపోయాయని వారు అన్నారు. దీనికి తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూస్తానని ఏఈ శ్రీహరి సమాధానమిచ్చారు. నష్ట పరిహారం కావాలంటే వినియోగదారుల కోర్టుకు వెళ్లి పోరాడి తెచ్చుకోవాలని ఎస్‌ఈ రాజబాబు సలహా ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వాడిన లోడులకు ప్రసుత్తం ట్రాన్స్‌ఫార్మర్లను మార్చాలంటే రైతు తట్టుకునే పరిస్థితిలో లేరని విద్యుత్ అధికారుల వద్ద రైతులు వాపోయారు. ఈ చర్చ దాదాపు మూడు గంటల పాటు జరగ్గా నష్ట పరిహారం విషయమై సరైన సమాధానం రాలేదు. చివరకు విద్యుత్ అధికారులు తిరిగి కనెక్షన్లు తొలగించాలంటే ముందస్తు నోటీసులు ఇవ్వాలని ఆక్వా రైతులు కోరారు. కార్యక్రమంలో టెక్నికల్ డీఈఈ విజయానంద్, విజిలెన్స్ అధికారి గౌతమ్, ఏఈఈ శ్రీహరి, ఎస్‌ఐ సీహెచ్ రాజేష్, ఆక్వా రైతులు అల్లూరి రమేష్‌రాజు, గుర్రాల బుజ్జి, వీరా దుర్గారావు, మోటూరి సత్యంకాపు, గుత్తుల శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, నూకల స్వామి నాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment