
ష్... రక్షణ లేదిక్కడ!
ఫ నిలిచిన పిచ్చింగ్ ప్లాట్‌ఫామ్ నిర్మాణం
ఫ ఎదుర్లంక వద్ద నదీ కోత
నివారణకు గ్రహణం
ఫ గత ప్రభుత్వంలో
రూ.78 కోట్లు మంజూరు
ఫ కూటమి ప్రభుత్వం వచ్చాక పనులకు బ్రేక్
సాక్షి, అమలాపురం/ ఐ.పోలవరం: ఒకవైపు నదీ కోతతో వందలాది ఎకరాలు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. మరోవైపు బలహీనమవుతున్న ఏటిగట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. వరదలకు గండ్లు పడితే ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతాయనే భయం వెంటాడుతుంది. ఈ రెండు విపత్కర పరిస్థితుల నుంచి రక్షణ కోసం పిచ్చింగ్ ప్లాట్‌ఫామ్ నిర్మించాలని ఈ ప్రాంత రైతులు.. ఐలెండ్ వాసులు గొంతెత్తి కోరినా 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వానికి ఐలెండ్ (ఐ.పోలవరం మండలం) వాసుల గోస పట్టలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పిచ్చింగ్ ప్లాట్‌ఫామ్ నిర్మాణాలకు రూ.కోట్ల నిధులు మంజూరు చేసి పనులు మొదలు పెట్టించింది. కూటమి ప్రభుత్వం రావడంతో ఈ నిర్మాణాలకు గ్రహణం పట్టింది. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వద్ద పిచ్చింగ్ ప్లాట్‌ఫామ్ నిర్మాణానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.78 కోట్లు మంజూరు చేసింది. దీంతో సుమారు 1200 మీటర్ల పిచ్చింగ్ ప్లాట్‌ఫామ్ నిర్మించాల్సి ఉంది. చివరి పాయింట్లతో కలిపి మొత్తం 1,400 మీటర్లు ఉంటోంది. ఈ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పిచ్చింగ్ ప్లాట్‌ఫామ్ నిర్మాణ పనులకు సంబంధించి ప్రత్యేకమైన రాళ్లను తుని, ఏలేశ్వరం పరిసర ప్రాంతాల్లోని క్వారీల నుంచి సేకరించాల్సి ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) జోక్యం, తీర్పుతో ఇక్కడ నుంచి రాళ్ల సేకరణ ఇబ్బందిగా మారింది. దీనికితోడు ప్రభుత్వం మారడం, కొత్త ప్రభుత్వంలో ఇటువంటి పనులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయి. నిర్మాణం కోసం కొంత వరకూ సేకరించిన రాళ్లను ఆ ప్రాంతంలోనే వదిలేశారు. గత కొన్ని నెలలుగా నిర్మాణ ప్రాంతంలో ఎటువంటి అలికిడి లేకపోవడంతో పనులు నిలిచిపోయాయనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది.
గతంలో అలా... ఇప్పుడు ఇలా
నదీ కోత నివారణకు గ్రోయిన్లు నిర్మిస్తామని 2014–19 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) నిధులు మంజూరు చేయిస్తానని హామీలు గుప్పించారు. 2015లోనే ఆయన ఈ హామీ ఇచ్చారు. ఆ తరువాత నాలుగేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా నిధులు మంజూరు చేయించలేకపోయారు. 2016 మే నెలలో కేంద్ర బృందం పర్యటించి గ్రోయిన్ల నిర్మాణాలకు ఇచ్చిన నివేదిక సైతం బుట్టదాఖలైంది. కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశాన్ని చేజేతులా వదులుకుంది. దీంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచే నిధులు ఇచ్చింది. రూ.78 కోట్లను మంజూరు చేసింది. సాంకేతిక అనుమతులు వచ్చిన తరువాత పనులు మొదలు పెట్టించింది. కూటమి ప్రభుత్వం రావడంతో ఇప్పుడు మరోసారి పనులు నిలిచిపోయాయి.
త్వరలోనే పనులు ప్రారంభం
ఎన్‌జీటీ తీర్పుల వల్ల పిచ్చింగ్ ప్లాట్‌ఫామ్ నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించి త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పనులు వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తాం. నదీ కోత నివారణకు చర్యలు చేపట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.
–ఈశ్వరమణ్యం,
హెడ్‌వర్క్స్ ఏఈ
30 సెంట్లు మిగిలింది
ఐ.పోలవరం మండలం ఎదుర్లంకలో నాకు గౌతమీ నదీపాయను ఆనుకుని సుమారు 66 సెంట్ల భూమి ఉంది. ఇందులో ఇప్పుడు కేవలం 30 సెంట్లు మాత్రమే మిగిలింది. మిగిలిందంతా నదీలో కలిసిపోయింది. నదీ కోత వల్ల ఇప్పటి వరకూ సుమారు 20 కొబ్బరి చెట్లు కొట్టుకుపోయాయి. మరో రెండు, మూడు వరదలు వస్తే మిగిలిన భూమి కూడా లేకుండా పోతోంది.
–ముదునూరి వెంకటేశ్వర్లరాజు, ఎదుర్లంక
కుడివైపు పరిస్థితి వేరు..
గౌతమీ నదికి కుడివైపు పరిస్థితి వేరుగా ఉంది. పుదుచ్చేరి యానం, తాళ్లరేవు మండలాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. యానం, తాళ్లరేవు మండలంలో లంక గ్రామాలు కోతకు గురికాకుండా గతంలోనే గ్రోయిన్లు, రివిట్‌మెంట్‌ల నిర్మాణాలు చేశారు.
యానాం పట్టణం పొడవునా, అలాగే తాళ్లరేవు మండలం పిల్లలంక, గోవలంకల్లో నిర్మాణాలు చేయడంతో నదీ కోత దాదాపు లేకుండా పోయింది. కానీ ఐలెండ్ కోతకు మాత్రం అడ్డుకట్ట పడలేదు.
ఆగని నదీ కోత
గౌతమీ, వృద్ధ గౌతమీ నదీపాయల మధ్య ఉన్న ఐలెండ్‌కు వరదలతో కలిగే నష్టం ఇంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా వందలాది ఎకరాల విలువైన కొబ్బరి తోటలు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. ఐ.పోలవరం మండల పరిధిలో పాత ఇంజరం, ఎదుర్లంక, మురమళ్ల, గుత్తెనదీవి, జి.మూలపాలెం, పశువుల్లంక వంటి ప్రాంతాల్లో నదీ కోత అధికంగా ఉంది. గౌతమీ ఎడమ గట్టును ఆనుకుని గడిచిన ఎనిమిదేళ్లలో ఈ ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల భూమి నదీ గర్భంలో కలిసిపోయిందని అంచనా. ఎదుర్లంక రాధమ్మ రేవు వద్ద నదీ కోత తీవ్రత అధికంగా ఉండడంతో ఏటా వచ్చే వరదలకు ఇక్కడ కొబ్బరి చెట్లు నదీలో కొట్టుకుపోతున్నాయి. దీనికితోడు నదీ కోత తీవ్రతతో ఐలెండ్ చుట్టూ రక్షణగా ఏర్పాటు చేసిన ఏటిగట్లు సైతం బలహీనమవుతున్నాయి. భారీ వరదలు వస్తే గండ్లు పడే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ష్... రక్షణ లేదిక్కడ!

ష్... రక్షణ లేదిక్కడ!
Comments
Please login to add a commentAdd a comment