
వెంకన్న క్షేత్రం.. ఆధ్యాత్మిక శోభితం
ఫ వాడపల్లికి పోటెత్తిన భక్తజనం
ఫ ఒక్కరోజే రూ.46.97 లక్షల ఆదాయం
కొత్తపేట: దినదిన ప్రవర్ధమానంగా.. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న వాడపల్లి క్షేత్రం శనివారం భక్తజనంతో శోభిల్లింది. ఆ వేంకటేశ్వరుడిని దర్శించుకున్న భక్తుల మది పులకించింది.. కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి శనివారం తెల్లవారుజాము నుంచి భక్తుల రాక మొదలైంది. రాష్ట్రం నలుమూలల నుంచి సాధారణ భక్తులతో పాటు ఏడు వారాల నోము ఆచరిస్తున్న వారు తరలిరావడంతో అంతటా గోవింద నామస్మరణ మార్మోగింది. ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితుల బృందం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వివిధ పుష్పాలతో విశేష అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పూర్ణాలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు. మొక్కుబడులు తీర్చుకుని, అర్చకస్వాముల నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలోని క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకూ స్వామివారి ప్రత్యేక దర్శనం, అన్నప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ విక్రయం విరాళాలు, ఆన్‌లైన్ ద్వారా సుమారు రూ.46,97,535 ఆదాయం సమకూరిందని డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి వివిధ సాంస్కృతిక కళా రూపాలు ఆకట్టుకున్నాయి.

వెంకన్న క్షేత్రం.. ఆధ్యాత్మిక శోభితం
Comments
Please login to add a commentAdd a comment