కోకో సాగు లాభదాయకం
అమలాపురం రూరల్: కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకో సాగు లాభదాయకమని, ఆ దిశగా సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో కోకో సాగు విలువ ఆధారిత ఉత్పత్తులపై రైతులకు అవగాహన సదస్సును ఉద్యాన శాస్త్రవేత్తలతో నిర్వహించారు. సాగులో యాజమాన్య పద్ధతులు, దిగుబడులపై అవగాహన పెంపొందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొబ్బరి తోటలో కోకో అంతర పంటగా 50 శాతం పాక్షిక నీడలో పెరుగుతుందన్నారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యధిక డిమాండ్ ఉందన్నారు. రానున్న ఏడాది వెయ్యి ఎకరాలు, రెండో ఏడాది రెండు వేల ఎకరాలు, మూడో ఏడాది మూడు వేల ఎకరాల విస్తీర్ణాల్లో దశల వారీగా సాగును పెంచనున్నట్లు వివరించారు. ఉద్యాన శాఖ ఎకరాకు మొదటి ఏడాది మొక్కలు ఉచితంగా ఇవ్వడంతో పాటు రూ.4,800, రెండో ఏడాది రూ.1,600 నిర్వహణ, ఎరువులకు, మూడో ఏడాది నిర్వహణకు రూ.1,600 రాయితీగా అందిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో కొబ్బరి సాగు ఉందని, ఇందులో దశల వారీగా కోకో సాగును విస్తరించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 2,400 ఎకరాల విస్తీర్ణంలో కోకో సాగు ఉందని, తొలుత 10 వేలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొబ్బరి సాగుతో గరిష్టంగా రూ.60 వేల ఆదాయం వస్తుందని, కోకోతో అదనపు ఆదాయం రూ. 1.20 లక్షలు సమకూరుతుందన్నారు. రైతు రుద్రరాజు ప్రసాదరాజు మాట్లాడుతూ కోకో చెట్ల ఆకులు రాలి దుక్కి ద్వారా భూమిలో కలిసి భూసారాన్ని పెంచుతాయని, తద్వారా కొబ్బరిలో దిగుబడి పెరుగుతుందన్నారు. రైతు అడ్డాల గోపాలకృష్ణ మాట్లాడుతూ గతంలో కోకో సాగు కొన్ని ఒడిదొడుకులకు గురైందని, ప్రస్తుతం అంతర్జాతీయంగా దిగుబడులు తగ్గినందున స్థానికంగా డిమాండ్ పెరిగిందన్నారు. తాను 18 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేపట్టానన్నారు. శాస్త్రవేత్తలు ఎస్‌బీవీ చలపతిరావు, మమత వెంకయ్యలు శాసీ్త్రయంగా సాగు విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి, రైతులు, రైతు ఉత్పత్తుదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment