ప్రతి క్షణం పదిలమే సుమా!
అమలాపురం టౌన్: పదో తరగతి పరీక్షల సమయంలో ప్రతి నిమిషమూ విలువైనదే. ప్రతీ విద్యార్థికీ సమయ స్పృహ ఉండాలి. పరీక్షలను ఓ భూతంలా కాకుండా భవిష్యత్ భూతద్దంలో చూసినప్పుడే ఉత్తమ ఫలితాలతో ఉత్తీర్ణులవుతారని కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు, పలు పాఠ్య పుస్తకాల రచయిత డాక్టర్ సీవీ సర్వేశ్వశర్మ సూచించారు. పదో తరగతి పరీక్షలకు సన్నద్ధవుతున్న విద్యార్థులు పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, ఉత్తమ మార్కులు పట్టేందుకు ఆయన పలు చిట్కాలను ‘సాక్షి’కి ఇలా వివరిస్తున్నారు.
● చదువుకునేందుకు ఏకాగ్రతతో కూడిన వాతావరణాన్ని ఎంచుకోవాలి. టీవీ, సెల్‌ఫోన్ చప్పళ్లు, ఇతర రణగొణ ధ్వనులకు దూరంగా ఉండాలి.
● ఎంత ఎక్కువ సేపు చదివామన్నది ముఖ్యం కాదు. చదివింది మెదడులో ఎంత మేర నిక్షిప్తం చేశామన్నదే ముఖ్యం.
● అన్నీ వచ్చు. ప్రతీది చదివాను. పరీక్షల్లో రాయగలననే మితి మీరిన ఆత్మ విశ్వాసం పనికిరాదు. ప్రతి ప్రశ్న, జవాబును అన్వేషణ కోణంలోనే చదవాలి.
● ప్రశ్న అడిగిన తీరును బట్టి, ఆ ప్రశ్నకు ఎన్ని మార్కులో అంచనా వేసుకుని జవాబు పరిమితిని నిర్ణయించుకుని రాయాలి.
● జవాబులు చిన్న చిన్న వ్యాక్యాలతో పాయింట్స్ వారీగా రాస్తే పేపరు దిద్దే వారికి రాసే విద్యార్థిపై మంచి అభిప్రాయం కలుగుతుంది.
● దస్తూరి బాగుండే విద్యార్థుల సంగతి పక్కన పెడితే, మిగిలిన వారు కంగారు పడకుంగా సాధ్యమైనంత వరకూ జవాబు పత్రాల్లో దస్తూరి గుండ్రంగా ఉండేడట్లు జాగ్రత్త పడాలి. దస్తూరీ సైతం కొన్ని మార్కులు తెచ్చిపెడుతుందనే విషయాన్ని మరచిపోకూడదు.
● పరీక్షల్లో ర్యాంక్‌లు సాధించాలంటే మేధావి కానవసరం లేదు. ప్రణాళిక బద్ధంగా, సమయ స్పృహతో చదివితే సగటు విద్యార్థికి సైతం మంచి ర్యాంకులు వస్తాయి.
● చదువుకు సంబంధించిన విషయాలను తోటి విద్యార్థులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉండాలి. సందేహాలను ఉపాధ్యాయలతో చర్చించి నివృత్తి చేసుకోవాలి. ఆందోళన అనిపించినా, అందుకు కారణాలను తెలుసుకుని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి.
● పరీక్ష రాసేడప్పుడు సమయం దగ్గర పడుతున్న క్రమంలో జవాబులు రాసేందుకు వేగం పెంచాలే తప్ప ఏకాగ్రత, సమర్ధత తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
● ప్రశ్నకు జవాబుగా మీ తెలిసిన సమాచారం అంతా రాస్తే ఎక్కువ మార్కులు పడకపోగా సమయం కూడా వృధా అవుతుంది. ఎంత అవసరమో అంతే జవాబు రాయాలి.
● రాసే జవాబులో కొట్టివేతలు లేకుండా ముఖ్యమైన అంశాలను హైలెట్ చేస్తే ఎక్కువ మార్కుల సాధనకు అవకాశం ఉంటుంది.
● ప్రశ్నా పత్రం ఇవ్వగానే ఓ సారి ఆద్యంతం చదవాలి. ముందు మనకు సునాయసంగా అనిపించిన, తెలిసిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. పరీక్ష రాయడం మొదలు పెట్టకుండానే సంక్లిష్టంగా ఉన్న ప్రశ్నల గురించి ఆలోచించి సమయం వృథా చేయకూడదు.
● ప్రతి పరీక్షను ఓ సవాలుగా తీసుకోవాలి. అదో సమస్యగా ఎంచుకుని మధన పడకూడదు. చదువును ఓ తపస్సులా భావించాలి, పరీక్షలను ఉషస్సుల్లా మలుచుకోవాలి.
● ప్రశ్నా పత్రంలో ఏ ఒక్క ప్రశ్నను తెలీదు అని వదిలేయకూడదు. ఆ ప్రశ్నకు రిలేటెట్‌గా ఉన్న సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం వల్ల కొన్ని మార్కులైనా సాధించే వీలుంటుంది.
సమయాన్ని సద్వినియోగం
చేసుకోవడం అత్యంత ముఖ్యం
పరీక్షగా చూడొద్దు..
భవితకు తొలి మెట్టుగా చూడాలి
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలకు
చక్కనైన, సులువైన చిట్కాలివిగో..
Comments
Please login to add a commentAdd a comment