
చమురు సంస్థలపై పోరాటానికి సిద్ధం
అమలాపురం టౌన్: కేజీ బేసిన్ పేరిట గత 30 ఏళ్లుగా ఈ ప్రాంత భూముల్లోకి వేలాది అడుగుల లోతు కెమికల్స్ పంపిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న చమురు సంస్థలపై యాంటీ పొల్యూషన్ సొసైటీ ద్వారా అనేక పోరాటాలు చేస్తూనే ఉన్నామని సొసైటీ కన్వీనర్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు స్పష్టం చేశారు. తాను స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అయిన క్రమంలో వైఎస్సార్ సీపీ శ్రేణులను, ప్రజా సంఘాలు, రాజకీయాలకు అతీతంగా పార్టీలను కలుపుకుని చమురు సంస్థలపై ఇక నుంచి పోరాటాలు చేసేందుకు ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నానని చెప్పారు. అమలాపురం హైస్కూలు సెంటరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓఎన్జీసీ, గెయిల్, రిలయన్స్, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్, వేదాంత తదితర చమురు సంస్థలు తమ కార్యకలాపాలతో ఇక్కడి భూమిని గుల్ల చూస్తూ తిరిగి ఆ ప్రాంత అభివృద్ధికి అరకొర నిధులు విదుపుతున్నాయని ఆరోపించారు. తమ ఉత్పత్తులు, భారీ వాహనాల రాకపోకల వల్ల కేజీ బేసిన్‌లో రోడ్లు, వంతెనల జీవిత కాలాన్ని చమురు సంస్థలు హరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐకి చెందిన రాష్ట్ర, జిల్లా నాయకులు కాకినాడలో ఆదివారం చమురు సంస్థల విధ్వంసకర ఘటనలపై పార్టీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ప్రకటించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. వచ్చే ఆదివారం కాకినాడలో సీపీఐ ఇదే డిమాండ్‌పై చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి అన్ని పార్టీల, ప్రజా సంఘాల నుంచి మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ లీగల్ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్, బాబి గ్రాబియేల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment