కోటిపల్లి – నరసాపురం రైల్వే పనులపై స్టే
అమలాపురం రూరల్: అమలాపురం మండలం భట్నవిల్లిలో కోటిపల్లి– నరసాపురం రైల్వే లైన్ భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. ఈ విషయాన్ని న్యాయవాది రమేశ్‌చంద్ర వర్మ శనివారం తెలిపారు. కోటిపల్లి– నరసాపురం రైల్వే భూసేకరణకు ససంబంధించి 25 ఏళ్ల కిందట సేకరించిన భూమికి తమకు పరిహారం ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం ఇవ్వాలని భట్నవిల్లి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. భట్నవిల్లికి చెందిన పేరూరు వైద్యనాథంతోపాటు 24 మంది రైతులు 40 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఉన్న ధర ఇప్పించాలని, లేకుంటే తమ భూములను తిరిగి ఇచ్చేయాలని రైతులు పిటీషన్ దాఖలు చేశారు. దీంతో రైల్వే పనులు నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే ఇచ్చిందని వర్మ తెలిపారు. ఈ కేసును మార్చి 13వ తేదీకి వాయిదా వేశారన్నారు.
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం రద్దీగా మారింది. సత్యదేవుని సన్నిధిలోను, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోను శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు కూడా తరలి రావడంతో రత్నగిరి కిటకిటలాడింది. స్వామివారి ఆలయం, ఆలయ ప్రాంగణం, విశ్రాంతి మండపాలు, క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారిని సుమారు 30 వేల మంది దర్శించారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఘనంగా ప్రాకార సేవ
సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవార్ల ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లను తిరుచ్చి వాహనం మీదకు వేంచేయించి, ఊరేగింపుగా తూర్పు రాజగోపురం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పండితులు పూజలు చేసిన అనంతరం, దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కొబ్బరికాయ కొట్టి సేవను ప్రారంభించారు. పండితుల మంత్రోచ్చారణలు, బాజాభజంత్రీల ఘోష నడుమ స్వామి, అమ్మవార్లను ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయించారు. పునఃపూజల అనంతరం స్వామి, అమ్మవార్లను ప్రధానాలయానికి చేర్చారు.
నేడు సూర్య నమస్కారాలు
రత్నగిరి కళావేదిక మీద ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సూర్య నమస్కారాలు నిర్వహిస్తా రు. ఈ సందర్భంగా రుత్విక్కులు సూర్య భగవానుడికి పూజలు చేస్తారు. 11 గంటలకు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు. అలాగే, ఉదయం పది గంటలకు ఆలయ ప్రాంగణంలో సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment