
ఆలమూరులో దాడి ఘటనపై విచారణ జరుపుతున్న అధికారులు
ఆలమూరు: ఆలమూరుకు చెందిన మహిళా ఉద్యోగి జి.యమునపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక ఎస్సీపేటలో నివాసం ఉంటున్న యమునను పెళ్లి చేసుకుంటానంటూ కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన తాళ్ల గోయల్ సుఖిరాజు వేధిస్తున్నాడు. ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన యమునపై కక్ష పెంచుకున్నాడు. దీంతో ఈ నెల 19వ తేదీ రాత్రి యమున నివాసముంటున్న ప్రాంతానికి వచ్చి దాడి చేశాడు. ఈ దాడిలో శరీరానికి, ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యుల సహకారంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అత్యవసర చికిత్స తీసుకుంది. అనంతరం గ్రామానికి వచ్చి ఆలమూరు పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన ఎస్సై శివప్రసాద్ తాను రూపొందించిన తుది నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందించారు. దీనిపై కలెక్టర్ హిమాన్షుశుక్లా సత్వరమే స్పందించి ఆర్‌డీఓ ఎం.ముక్కంటి, పీడీ జి.సత్యవేణి, సీడీపీఓ ఎ.గజలక్ష్మి, ఎస్సై ఎస్.శివప్రసాద్‌తో కూడిన బృందాన్ని పంపి శుక్రవారం పూర్తి స్థాయి విచారణ జరిపించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమెకు చికిత్సను చేయిస్తున్నారు. బాధితురాలు ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామ సచివాలయం–2లోని విలేజ్ క్లీనిక్‌లో సీహెచ్‌ఓగా పనిచేస్తుండగా, సుఖిరాజు ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఎస్సై శివప్రసాద్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దాడి ఘటన దురదృష్టకరం
సీహెచ్‌ఓగా పనిచేస్తున్న యమునపై దాడి దురదృష్టకరమని పెదపళ్ల పీహెచ్‌సీ వైద్యాధికారి పి.భవానీశంకర్ వ్యాఖ్యానించారు. ఆలమూరులోని ఆమె నివాసంలో శుక్రవారం పరామర్శించి ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకుని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఒక మహిళ ఉద్యోగిపై దాడి చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment