గుండెపోటు లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కోవిడ్ అనంతరం గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. తన క్యాంపు కార్యాలయం నుంచి క్షేత్ర స్థాయి అధికారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. గుండె జబ్బులు, వాటి లక్షణాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. స్టెమి వైద్య సేవలపై మరింత చర్చ జరగాలన్నారు. గుండెపోటు లక్షణాలున్న వారికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, మొదటి గంటలోనే రూ.45 వేల విలువైన టెనెక్టిప్లెస్ ఇంజక్షన్ ఉచితంగా అందించి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. గుండెపోటుకు గురైనవారి బంధువులు 108కి ఫోన్ చేస్తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్లి, చికిత్స అందిస్తారని తెలిపారు.
మార్చి నెలాఖరుకు స్పెషలిస్టు
వైద్యుల నియామకం
డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ రమేష్ కిషోర్
కొవ్వూరు: ఎన్నికల కోడ్ కారణంగా స్పెషలిస్టు వైద్యుల పోస్టుల భర్తీలో జాప్యం జరిగిందని, మార్చి నెలాఖరుకు 297 స్పెషలిస్టు పోస్టులు భర్తీ చేస్తామని జాయింట్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సి.రమేష్ కిషోర్ తెలిపారు. స్థానిక సామాజిక ఆసుపత్రిని శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, స్పెషలిస్టు వైద్యుల భర్తీకి 2,600 దరఖాస్తులందాయన్నారు. వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా అర్హత ఉన్న ఏ ఒక్కరి సదరం సర్టిఫికెట్‌ను తొలగించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 వేల మంది పింఛన్‌దార్లను వైద్యుల బృందం ఇంటింటికీ వెళ్లి పరీక్షిస్తోందన్నారు. ఈ ప్రక్రియ వారం పది రోజుల్లో ముగుస్తుందన్నారు. సదరం సర్టిఫికెట్ల జారీకి సంబంధించి కొత్తగా 6 వేల మందిపై సమగ్ర విచారణ చేపడుతున్నామని తెలిపారు. రాత్రి డ్యూటీలో ఉన్న వైద్యులు.. రోగులకు అందుబాటులో ఉండేలా క్యూఆర్ కోడ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. డాక్టర్లు, నర్సులు సకాలంలో విధులకు హాజరవుతున్నారా, లేదా, నర్సుల ప్రవర్తన, ఆసుపత్రిలో పారిశుధ్యం, వైద్య పరీక్షలు జరుగుతున్న తీరు, ఓపీ నిర్వహణపై తాడేపల్లిలోని కంట్రోల్ రూమ్ ద్వారా రోగుల అభిప్రాయాలు సేకరిస్తున్నామని రమేష్ కిషోర్ తెలిపారు. అంతకు ముందు ఆసుపత్రి ప్రాంగణంలోని డీసీహెచ్‌ఎస్ కార్యాలయంతో పాటు వార్డులను పరిశీలించారు. రికార్డులు పరిశీలించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ ఒ.పద్మశ్రీరాణి, ఆసుపత్రి సూపరింటెండెండ్ కె.సాయి కిరణ్, అడిషనల్ డైరెక్టర్ టి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గుండెపోటు లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
Comments
Please login to add a commentAdd a comment