ప్రకృతి సాగు అనుసరణీయం
కొవ్వూరు: ఆరోగ్యకరమైన పంటల కోసం రైతులు ప్రకృతి సాగు పద్ధతులను అనుసరించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సూచించారు. దొమ్మేరు గ్రామంలో ప్రకృతి సాగు పంటలను ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 42 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు జరుగుతోందని అన్నారు. 12 డ్రోన్ల సాయంతో 3,800 మంది రైతులు 4,200 ఎకరాల్లో కషాయాలు వాడుతూ ప్రకృతి సేద్యం చేస్తున్నారని తెలిపారు. కషాయాలు వాడుతూ పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం శుభ పరిణామమని అన్నారు. జిల్లావ్యాప్తంగా 7,300 మంది రైతులు పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ప్రకృతి సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. దొమ్మేరుకు చెందిన రైతు నీరుకొండ సత్యనారాయణ తన 12 ఎకరాల్లో చెరకు, బొప్పాయి, మొక్కజొన్న, నువ్వులు, అరటి, కోకో, కొబ్బరి, కంద, డ్రాగన్ ఫ్రూట్, జామ తదితర పంటలు పండించడం హర్షణీయమని అన్నారు. వరిలో డ్రోన్‌తో కషాయాల పిచికారీని కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, ఆర్‌డీఓ రాణి సుస్మిత, ఏపీసీఎన్‌ఎఫ్ డీపీఎం బి.తాతారావు, అదనపు డీపీఎం మహబూబ్ వలీ, వ్యవసాయ శాఖ ఏడీ పి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment