తగిన పరిహారం ఇవ్వకుండా కూల్చేస్తారా?
గండేపల్లి: ఏడీబీ రోడ్డు విస్తరణకు సంబంధించి తమకు జరుగుతున్న నష్టానికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం పెంచి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ విషయం తేల్చకుండా అధికారులు తమ ఇళ్లు, షాపులు కూల్చివేయడంపై మండిపడ్డారు. వివరాలివీ.. రాజానగరం – కాకినాడ ఏడీబీ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తుతో మండలంలోని సూరంపాలెం పరిధి రామేశంపేటలో 18 ఇళ్లు, షాపుల కూల్చివేత ప్రారంభించారు. దీనిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నం చేశారు. 64 గజాల స్థలం కోల్పోతున్న వారికి రూ.8 లక్షల పరిహారం ఇచ్చారని, 130 గజాలు కోల్పోతున్న వారికి కూడా అంతే పరిహారం ఇవ్వడం ఎంతవరకూ న్యాయమని అధికారులను ప్రశ్నించారు. తమకు తగిన నష్ట పరిహారం ఇవ్వకుండా ఏవిధంగా కూలగొడతారని నిలదీశారు. ఎక్కువ, తక్కువ తేడాలు గమనించకుండా అందరికీ ఒకేలా నష్టపరిహారం ఇవ్వడమేమిటని తహసీల్దార్ శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. దుకాణాలు, ఇళ్లల్లో విలువైన సామగ్రితో పాటు గృహోపకరణాలు కూడా ఉన్నాయని, కనీసం వాటిని తీసుకునేందుకై నా సమయం ఇవ్వాలని కొందరు విజ్ఞప్తి చేశారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు రామేశంపేటలో తమ సమస్య చెప్పుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, దీంతో పిఠాపురం వెళ్లి వివరించామని బాధితులు చెప్పారు. దీనిపై ఆయన అధికారులతో మాట్లాడతానన్నారని, ఇంతలోనే కూల్చివేతలు మొదలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
కనికరించని అధికారులు
తమ ఇల్లు, దుకాణం కోల్పోతున్నామనే ఆందోళనతో స్థానిక మహిళ వరలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు కుటుంబ సభ్యులు ఇంట్లో వైద్యం చేయిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరించి కూల్చివేత కొనసాగించారని వరలక్ష్మి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు ఇంట్లో సిలైన్లు పెట్టినప్పటికీ అధికారులు బలవంతంగా బయటకు తీసుకువచ్చారని వాపోయారు. అధికారులు అంత నిర్దయగా వ్యవహరిస్తే తామెలా బతకాలని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment