12 మంది ఉద్యోగులపై వేటు
కాకినాడ క్రైం: జీజీహెచ్‌లో ఒకే రోజు 12 మంది ఉద్యోగులను తొలగించడం తీవ్ర కలకలం రేపింది. వీరిలో ఇద్దరు రెగ్యులర్, ఇద్దరు కాంట్రాక్టు ఫార్మసిస్టులు, ఇద్దరు ఫిజియోథెరపిస్టులు, నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక థియేటర్ అసిస్టెంట్, ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలివీ.. 2020–21లో నిర్వహించిన నర్సింగ్ పోస్టుల విక్రయాలు, లేని పోస్టుల్ని సృష్టించి మరీ భర్తీ చేయడం వంటి ఆరోపణలతో అప్పటి జీజీహెచ్ మేనేజర్ నరసింగరావు కొద్ది నెలల కిందట సస్పెండయ్యారు. అప్పట్లో ఆయన ద్వారా ఉద్యోగాలు పొందిన 12 మంది జీజీహెచ్ సిబ్బందిని గురువారం ఉద్యోగాల నుంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని కలెక్టర్ షణ్మోహన్‌కు లిఖితపూర్వకంగా నివేదించారు. వేటు పడిన ఉద్యోగులకు మరెక్కడైనా పోస్టింగులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి కలెక్టర్ సూచించారు. కాగా, ఉద్యోగుల తొలగింపు అంశంపై ట్రెజరీ, జీజీహెచ్ అధికారులతో కలెక్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. వీరికి మళ్లీ ఉద్యోగాలు ఇచ్చేంత వరకూ జీతం ఇచ్చే అవకాశం లేదని జిల్లా ఖజానా శాఖ స్పష్టం చేసింది.
అవినీతి ఆరోపణలపై విచారణేదీ!
జీజీహెచ్ మేనేజర్‌గా పని చేస్తూ సస్పెండైన నరసింగరావుపై ప్రధానంగా నర్సింగ్ పోస్టుల విక్రయాలు, లేని పోస్టుల్ని సృష్టించి మరీ భర్తీ చేశారనే ఆరోపణలున్నాయి. నర్సింగ్ పోస్టుల విక్రయాల అవినీతిపై పక్కా ఆధారాలు లభించడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు నరసింగరావును అధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లోనే కొనసాగుతున్నారు. జీవోలో లేని పోస్టుల సృష్టించి మరీ భర్తీ చేసిన అంశానికి సంబంధించి నరసింగరావుపై వైద్య, ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ పద్మా శశిధర్ ఛార్జెస్ ఫ్రేమ్ చేయాల్సి ఉంది. ఆయన సస్పెండై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కనీసం షోకాజ్ నోటీసు కూడా పంపించలేదు. కనీస విచారణ కూడా జరగకపోవడంతో లేని పోస్టులు సృష్టించడంలో నరసింగరావు ఉద్దేశం ఏమిటనే విషయం తేలలేదు. దీనిపై స్పష్టత వస్తే ఇప్పుడు తొలగించిన ఉద్యోగులు నరసింగరావు అవినీతిలో భాగస్వాములా, పావులా అనే విషయంపై స్పష్టత వచ్చేదనే అభిప్రాయం వినిపిస్తోంది. దీనినిబట్టి వారికి మరెక్కడైనా ఉద్యోగాలు ఇవ్వాలా, లేక పూర్తిగా తొలగించాలా అనే విషయం కూడా స్పష్టమయ్యేది. నరసింగరావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఛార్జెస్ ఫ్రేమ్ చేయడంలో మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో నెల గడిస్తే నరసింగరావు సస్పెండై నాలుగు నెలలు పూర్తవుతాయి. తాజా నిబంధనల ప్రకారం నాలుగు నెలలు దాటితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిపై ఎటువంటి ఛార్జెస్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉండదు. ఇదే కనుక జరిగితే సస్పెన్షన్ తర్వాత ఎటు వంటి కఠిన చర్యలూ తీసుకోకుండానే మళ్లీ పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. దీనిపై ఉద్యోగ వర్గాల్లో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
జీజీహెచ్‌లో లేని ఉద్యోగాల భర్తీపై చర్యలు
కలెక్టర్‌కు అధికారుల నివేదిక
Comments
Please login to add a commentAdd a comment