రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వం
● మిర్చికి గిట్టుబాటు ధర
కల్పించడంలో విఫలం
● మాజీ సీఎం వైఎస్ జగన్ మిర్చి
యార్డుకు వెళితే కంగారెందుకో..?
● జగన్‌తో ఓ చిన్నారి సెల్ఫీ తీసుకుంటే దారుణంగా ట్రోల్ చేస్తారా?
● మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఫైర్
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం రైతులు, రైతు కూలీలను నట్టేట ముంచుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు మిర్చి రైతుల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతారహితంగా వ్యహరిస్తున్నారన్నారు. ఇప్పటి వరకూ గిట్టుబాటు ధర ప్రకటించ లేదని మంత్రి చెప్పడమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోందన్నారు. రైతు నష్టపోతున్నా గిట్టుబాటు ధర ప్రకటించకపోవడం దారుణమన్నారు. క్వింటాల్ మిర్చి ధర రూ.11,600 చొప్పున మార్కెట్ జోక్యంతో 25 శాతం పంట కొనుగోలు చేయాలని, అందుకు రూ.3,480 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరమంటూ ఉద్యాన శాఖ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం పక్కన పడేసిందని ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మిర్చి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు గుంటూరుకు వెళ్లడంతో ప్రభుత్వంలో వణుకు మొదలైందన్నారు. నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయ మంత్రికి దానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. నాఫెడ్ ద్వారా ఎప్పుడైనా మిర్చి కొందా అని ప్రశ్నించారు. కేవలం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన వల్లే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారన్నారు. ఇది రైతులను మోసగించేందుకు రాసినది కాదా అని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు మాజీ సీఎం జగన్ గుంటూరుకు వెళితే మాజీ సీఎంకు కనీస భద్రత ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జగన్‌తో ఓ చిన్నారి సెల్ఫీ తీయించుకునేందుకు ప్రయత్నిస్తే.. ఐటీడీపీ దారుణంగా ట్రోల్ చేసిందని మండిపడ్డారు. 20 క్వింటాళ్లు పండాల్సిన మిర్చి 10 క్వింటాళ్లకు పడిపోయిందని, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షం నోరు నొక్కి పాలన సాగించాలనుకోవడం దారుణమన్నారు. కష్టాల్లో ఉన్న వారిని పరామర్శించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత జగన్‌పై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యామా అని నిలదీశారు. కనీస మద్దతు ధర ప్రకటించకపోవడంతో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, సమస్యలు పరిష్కరించకపోతే ప్రతిపక్షం ఎత్తి చూపుతూనే ఉంటుందని మంత్రి వేణు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment