కల కానకనే దివికేగిన దిగ్గజం | - | Sakshi
Sakshi News home page

కల కానకనే దివికేగిన దిగ్గజం

Published Fri, Feb 21 2025 12:22 AM | Last Updated on Fri, Feb 21 2025 12:20 AM

కల కా

కల కానకనే దివికేగిన దిగ్గజం

జాతీయ బ్యాడ్మింటన్‌ రిఫరీ విశ్వనాథం మృతి

తనయుడు సాత్విక్‌ ఖేల్‌రత్న పురస్కార

స్వీకారానికి వెళ్తుండగా హఠాన్మరణం

ఉమ్మడి తూర్పులో క్రీడలపై చెరగని ముద్ర

పీడీగా, శిక్షకునిగా ఎంతోమందికి తర్ఫీదు

క్రీడల్లో ఆయన ఓ ఎవరెస్టు. ఎందరో క్రీడాకారులకు ఆయనో ద్రోణాచార్యుడు. ఎందరో గురువులకు ఆయన ఓ లక్ష్యం. అటువంటి వారెందరినో చూసి మురిసిపోయే ఆయన.. తన కలల పంట.. కుమారుడు సాత్విక్‌ సాయిరాజ్‌ ఇంతింతై వటుడింతయై అని అంతకంతకూ ఆయన ప్రవీణుడైన బ్యాడ్మింటన్‌ క్రీడనే అందిపుచ్చుకుని ఎదిగిపోతుంటే.. ఆ ఘనతలను కళ్లారా చూస్తూ.. వారూ వీరూ మెచ్చుకుంటుంటే.. సంబరపడిపోయారు. ప్రభుత్వం సైతం అత్యున్నత పురస్కారం ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న ప్రకటించడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. ఆ గౌరవాన్ని కుమారుడు అందుకునే ఉద్విగ్న క్షణాలను కళ్లారా చూడాలని ఆశపడ్డారు. ఆ కార్యక్రమానికి బయలుదేరారు. ఉన్న ఊరు దాటారో లేదో విధి అమాంతం ఆయనను అందని తీరాలకు తీసుకుపోయింది. బ్యాడ్మింటన్‌ క్రీడలో ఆయన తీర్చిదిద్దిన ఎందరో ఆణిముత్యాలు ఈ హఠాత్పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

సాక్షి, అమలాపురం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రీడారంగంలో ‘కాశీ’ అంటే తెలియని వారు ఉండరు. క్రీడాకారునిగా, క్రీడా శిక్షకునిగా, వ్యాయామోపాధ్యాయునిగా, న్యాయ నిర్ణేతగా, అంతర్జాతీయ షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుని తండ్రిగా ఇలా క్రీడలకు సంబంధించి అన్ని రంగాల్లోనూ అరితేరిన వ్యక్తిగా రంకిరెడ్డి కాశీ విశ్వనాథం చెరగని ముద్ర వేశారు. అటువంటి కాశీ గురువారం మృతి చెందడం ఉమ్మడి తూర్పు క్రీడాకారులు.. క్రీడాభిమానులలో విషాదాన్ని నింపింది. అంతర్జాతీయ షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ తండ్రి, జాతీయ బ్యాడ్మింటన్‌ రిఫరీ రంకిరెడ్డి కాశీ విశ్వనాథం (66) మృతి చెందారు. న్యూఢిల్లీలో జరిగే ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డును సాత్విక్‌ అందుకోవాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటి నుంచి ఢిల్లీ బయలుదేరిన కాశీకి సొంత ప్రాంతమైన అమలాపురం పట్టణం దాటిన వెంటనే గుండెపోటుకు గురై మృతి చెందారు. కాశీకి భార్య, ఇద్దరు కుమారులు

క్రీడాకారులు, క్రీడాభిమానులకు ‘కాశీ’ సుపరిచితులు. క్రికెట్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారునిగా రాష్ట్రస్థాయిలో పలు పోటీల్లో పాల్గొన్న కాశీ షటిల్‌ బ్యాడ్మింటన్‌ జాతీయ రిఫరీగా పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీలకు సేవలందించారు. కాశీ ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా, ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన పనిచేసిన ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయస్థాయి వాలీబాల్‌, అంబాజీపేట ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి క్రికెట్‌, అమలాపురం ఆఫీసర్స్‌ క్లబ్‌లో రాష్ట్ర స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. కోనసీమ షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ (కేఎస్‌బీఏ) కార్యదర్శిగా, అమలాపురం ఆఫీసర్స్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ కార్యదర్శిగా సైతం సేవలందించారు. గత ప్రభుత్వ హయాంలో తన కుమారుడు సాత్విక్‌ పేరు మీద రూ.ఐదు లక్షలు, కలెక్టర్‌ నిధులతో కలిపి ఆఫీసర్స్‌ రిక్రియేషన్‌ క్లబ్‌లో వుడెన్‌ కోర్టు నిర్మాణం చేయించారు. కాశీ వద్ద వ్యాయామోపాధ్యాయ విద్యలో సలహాలు, సహకారం పొందిన సుమారు 18 మంది ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీలుగా, పీడీలుగా పనిచేస్తుండడం విశేషం.

బ్యాడ్మింటన్‌పై మక్కువతో సాత్విక్‌ను అంతర్జాతీయ క్రీడాకారునిగా తీర్చిదిద్దడంలో తండ్రిగా, తొలి శిక్షకునిగా కాశీ సఫలీకృతులయ్యారు. సాత్విక్‌ కామన్‌వెల్త్‌, థామస్‌ కప్‌, ఆసియా కప్‌లో స్వర్ణ, రజిత పథకాలు పొందిన విషయం తెలిసిందే. సాత్విక్‌కు 2022–23 సంవత్సరానికి ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. అ అవార్డును కొన్ని అనివార్య కారణాల వల్ల అందుకోవడం ఆలస్యమైంది. తాజాగా సాత్విక్‌ న్యూ ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు బయలుదేరిన విశ్వనాథం అకస్మాత్తుగా మృతి చెందడంతో ఉమ్మడి జిల్లాలోని క్రీడాభిమానుల్లో విషాదాన్ని నింపింది. వెటరన్‌ క్రీడాకారుడు, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కాశికి ఘన నివాళి అర్పించారు. వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు వంటెద్దు వెంకన్నాయుడు, డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ తదితరులు కాశీ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కల కానకనే దివికేగిన దిగ్గజం 1
1/1

కల కానకనే దివికేగిన దిగ్గజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement