సేకరించిన భూములు స్వాధీనం చేసుకోండి
ఫ ఎమ్మెల్సీ కుడుపూడి
సూర్యనారాయణరావు
ఫ రియల్ ఎస్టేట్ మాయలో రైతులు పడవద్దు
అల్లవరం: కోటిపల్లి – నరసాపురం రైల్వేలైన్ నిర్మాణానికి 25 ఏళ్ల కిందట రైతుల నుంచి సేకరించిన భూమిని కలెక్టర్ స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. వైనతేయ నదిపై బోడసకుర్రు వద్ద నిర్మాణ దశలో ఉన్న రైల్వేలైన్ పనులను కోనసీమ రైల్వే సాధన సమితితో కలసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఇరవై ఐదేళ్ల క్రితం కోటిపల్లి నుంచి అమలాపురం వరకూ భూసేకరణ పూర్తి చేసి 80 శాతం పరిహారాన్ని రైల్వే బోర్డు ఇచ్చి రైతుల నుంచి భూ రిజిస్ట్రేషన్ చేసిందన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు బాగా పెరిగాయని అప్పట్లో ఇచ్చిన పరిహారం సరిపోదని కొంత మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారని పలు దినపత్రికల్లో వచ్చిందని ఎమ్మెల్సీ అన్నారు. రైల్వే చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందించిన తర్వాత కోర్టును ఆశ్రయించి పనులు నిలుపుదల చేయడం సాధ్యం కాదన్నారు. అమలాపురానికి చెందిన కొంత మంది రియల్ ఎస్టేట్‌దారులు విశ్రాంతి రెవెన్యూ అధికారుల సహకారంతో కోర్టుల ద్వారా పనులను అడ్డుకుంటున్నారని తెలిపారు. వీరి మాయలో రైతులు పడవద్దని హితవు పలికారు. ఇప్పటికే అన్ని నదుల ఫిల్లర్లు పూర్తి చేసుకుని ట్రాక్ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. రైల్వే బోర్డుకు భూములు ఇచ్చిన రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. కోనసీమ రైల్వే సాధన సమితి సభ్యులు కల్వకొలను తాతాజీ మాట్లాడుతూ కోనసీమ ప్రజల చిరకాల కోరిక తీరనున్న తరుణంలో హైకోర్టుని ఆశ్రయించి స్టే తేవడం దురదృష్టకరమన్నారు. కోనసీమ రైల్వేలైన్ కోసం ఇరవై ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. గతంలో భూమికి పరిహారం పొందుతూ నేటికి ఆ భూముల్లో పంటలు పండించుకుంటూ ఆదాయం పొందుతున్నారని, ఇటీవల కాలంలో భూమి రెట్లు పెరిగాయని, ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇవ్వాలని అడగడం భావ్యం కాదన్నారు. రైల్వే లైన్‌పై కోర్డుకు వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కోనసీమకు రైలును తీసుకొస్తానని, బాలయోగి చిరకాల కోరికను తాను తీరుస్తానని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాధుర్ చెప్పారని అన్నారు. ఇలాంటి తరుణంలో అడ్డంకులు రావడం చాలా బాధాకరమని, కోనసీమ రైలు వచ్చేంత వరకు జిల్లా ప్రజలు కృషి చేయాలని తాతాజీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోనసీమ సాధన సమితి కన్వీనర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, సభ్యులు పోలిశెట్టి శివాజీ, ఉప్పుగంటి భాస్కరరావు, బాబీ గాబ్రియేల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment