తీరు మారలేదు..!
అన్నవరం: అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం సత్యదేవుని నిత్య కల్యాణం సుమారు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఎల్‌ఐసీ సంస్థకు చెందిన కొంతమంది భక్తులు నిత్య కల్యాణ మండపంలో వ్రతాలాచరించడంతో ఈ కార్యక్రమం ఆలస్యమైంది. వాస్తవానికి కార్తిక మాసంలోనూ స్వామివారి నిత్య కల్యాణ మండపంలో వ్రతాలు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో కల్యాణ భక్తులకు ఇబ్బంది లేకుండా పాత కల్యాణ మండపంలో యథావిధిగా కల్యాణం చేస్తుంటారు. అయితే శుక్రవారం అటువంటి ఏర్పాట్లు చేయలేదు. ముందుగా ప్రకటించలేదు. సత్యదేవుని నిత్యకల్యాణం ఆచరించే భక్తులు ఉపవాసంతో ఉంటారు. ఉదయం 9–30 కి నిత్యకల్యాణం ప్రారంభించి 11 గంటలకల్లా పూర్తి చేస్తారు. అటువంటిది నిత్యకల్యాణ మండపంలో వ్రతాలు నిర్వహించినందున శుక్రవారం ఉదయం 10.40 గంటలకు కల్యాణం ప్రారంభించి, మధ్యాహ్నం 12–20 గంటలకు పూర్తి చేశారు. కల్యాణం ఆచరించేందుకు టిక్కెట్లు తీసుకున్న భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వారు కల్యాణం అయ్యాక సత్యదేవుని దర్శనానికి ఆలయానికి వెళ్లగా మధ్యాహ్నం నివేదన కారణంగా ఆలయ తలుపులు అరగంట మూసేశారు. ఒంటి గంటకు ఆలయ తలుపులు తీశాక స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేటప్పటికీ మధ్యాహ్నం 1–30 గంటలు అయ్యింది. కల్యాణం ఆలస్యం కావడానికి గల కారణాలపై సంబంధిత విభాగ అధికారులను వివరణ కోరతానని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు అన్నారు. ఎల్‌ఐసీ వారు నిత్యకల్యాణ మండపంలో వ్రతాలాచరించడానికి పర్మిషన్ అడిగితే ఇచ్చామన్నారు.
ఫ గంట ఆలస్యంగా సత్యదేవుని నిత్య కల్యాణం
ఫ అధికారులను వివరణ కోరతానన్న ఈఓ
Comments
Please login to add a commentAdd a comment