కామనగరువులో రోడ్డు ప్రమాదం
ఒకరి మృతి, మరొకరి గాయాలు
అమలాపురం రూరల్: కామనగరువులో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తిని స్థానికులు రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపేట మండలం ఆర్లపల్లి గ్రామం కండ్రిగపాలేనికి చెందిన తాపీమేస్త్రి గోలకోటి రమేష్ (45), మోడేకుర్రు గొలకోటివారిపాలేనికి చెందిన గునిశెట్టి సోమసుందర్ శేఖర్‌లు తోడల్లుళ్లు. ఇద్దరూ కలిసి మోటార్ సైకిల్ పై రాజోలు మండలం తాటిపాకకు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లారు. పెళ్లి తెల్లవారుజామున కావడంతో భోజనం చేసిన ఇద్దరూ మోటార్ సైకిల్ పై అత్తారిల్లు ఉప్పలగుప్తం మండలం చీకట్లవారిపాలేనికి బయలుదేరారు. కామనగరువు వద్దకు వచ్చేసరికి పంట బోదెకు రక్షణ గోడ లేకపోవడంతో అదుపుతప్పి సరాసరి మోటార్ సైకిల్‌తో సహా బోదెలోకి వెళ్లిపోయారు. అర్ధరాత్రి కావడంతో ఎవరూ గమనించలేదు. కానీ కుక్కలు పదేపదే అరవడంతో దొంగల బెడద కారణంగా ఆ పక్కనే ఉన్న రాజులపూడి భాస్కరరావు కుటుంబ సభ్యులు లేచారు. పంట బోదె వద్దే కుక్కలు అరవడంతో అక్కడకు వెళ/్ల చూసేసరికి మోటార్ సైకిల్, ఇద్దరు బోదెలో పడిపోయి ఉన్నారు. వెంటనే స్పందించి 108కు, పోలీసులకు సమాచారం అందించారు. గొలకోటి రమేష్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న సోమసుందర్ శేఖర్‌ను స్థానికులు బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. శేఖర్‌ను అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పంట బోదెకు కల్వర్టు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదంటూ మండి పడుతున్నారు. మృతుని సోదరుడు గొలకోటి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు.
వ్యక్తి అదృశ్యం
అంబాజీపేట: మాచవరం శివారు పోతాయిలంకకు చెందిన ఓ వ్యక్తి అదృశ్యంపై అంబాజీపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మట్టపర్తి వెంకటేశ్వరరావు ఈ నెల 18 నుంచి కనిపించడం లేదు. వెంకటేశ్వరరావు ఇంటి నుంచి వెళ్లే సమయంలో గులాచీ కలర్ షర్టు, నేవీ బ్లూ ఫ్యాంటును ధరించి 5 అడుగుల ఎత్తు ఉంటాడన్నారు. వెంకటేశ్వరరావు కుమారుడు శ్రీరామమూర్తి దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.చిరంజీవి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment