ప్రశాంతంగా ఈడీఎం రాత పరీక్ష
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్‌లో ఈ–గవర్నెన్స్ జిల్లా మేనేజర్ (ఈడీఎం) పోస్టును కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు కలెక్టరేట్‌లో మంగళవారం రాత పరీక్ష నిర్వహించారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని, మొత్తం 93 మంది హాజరయ్యారని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. పరీక్షను కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎండీ ఆలీ, సెక్షన్ సూపరింటెండెంట్ మహేశ్వరి పర్యవేక్షించారు. ఈ పోస్టుకు మొత్తం 115 మంది దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు.
వచ్చే నెల 8 వరకూ 144 సెక్షన్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులో ఉన్నందున వచ్చే నెల 8వ తేదీ వరకూ జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని జిల్లా అడ్మిన్ ఏఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ, కాకినాడ జిల్లా తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లా నుంచి ఎవరూ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లడానికి అనుమతులు లేవన్నారు. జిల్లావ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఎవ్వరినీ గృహనిర్బంధం చేయలేదని చెప్పారు. జిల్లాలో ఎవరిని హౌస్ అరెస్టులు, ముందస్తు అరెస్టులు చెయ్యలేదన్నారు.
1,556 మంది
అంగన్‌వాడీలకు శిక్షణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): దేశంలోనే తొలిసారిగా అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్యపై అంగన్‌వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి సర్టిఫికెట్ కోర్స్ మొదటి విడత శిక్షణను ఆర్యాపురంలోని నన్నయ మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఆయన మంగళవారం ప్రారంభించారు. తొలి విడతలో జిల్లాలోని 19 మండలాల్లోని 21 కేంద్రాల్లో 1,556 మందికి ఈ శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రతి మండలానికి పాఠశాల విద్యా శాఖ నుంచి ముగ్గురు, మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి ముగ్గురు చొప్పున విషయ నిపుణులు శిక్షణ ఇస్తున్నారన్నారు. జిల్లా సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఎస్.సుభాషిణి మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాలు, ఆరోగ్యంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని, పిల్లల నమోదు పెంచాలని, అభ్యసన ఫలితాల సాధనకు కృత్యాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అర్బన్ రేంజ్ డీఐ బి.దిలీప్ కుమార్, ప్రధానోపాధ్యాయుడు బి.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పెన్షన్, జీపీఎఫ్ అదాలత్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో పెండింగ్ పెన్షన్, జీపీఎఫ్ కేసులను సమీక్షించేందుకు అకౌంటెంట్ జనరల్ ఆధ్వర్యంలో బుధవారం అదాలత్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతిప్రియ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఉదయం 10 గంటలకు జిల్లా పరిధిలోని పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా, డ్రాయింగ్ అండ్ పంపిణీ అధికారులు వారి కార్యాలయాల్లో, శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పెన్షన్ కేసులు, పెన్షన్ అనుబంధ సమస్యల వివరాలతో హాజరు కావాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ కేసులను సమీక్షించి అక్కడికక్కడే పరిష్కరిస్తామన్నారు. వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు పదవీ విరమణ తేదీకి ముందే సంబంధిత జిల్లా డ్రాయింగ్ అండ్ పంపిణీ అధికారులు వారి పెన్షన్ పత్రాలను సమర్పించే విధంగా అవగాహన కల్పిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకూ విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, కడప, పాడేరు, తిరుపతి, ఏపీ సెక్రటేరియట్ వెలగపూడి, మంగళగిరిలోని డీజీపీ కార్యాలయాల్లో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని శాంతిప్రియ వెల్లడించారు.
ప్రశాంతంగా ఈడీఎం రాత పరీక్ష
ప్రశాంతంగా ఈడీఎం రాత పరీక్ష
Comments
Please login to add a commentAdd a comment