ప్రతి మండలంలో రీసర్వేకు పైలట్ గ్రామం
దేవరపల్లి: జిల్లాలోని ప్రతి మండలంలోనూ ఒక గ్రామాన్ని పైలట్‌గా ఎంపిక చేసి భూముల రీసర్వే చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తెలిపారు. మండలంలో పైలట్ గ్రామంగా ఎంపిక చేసిన చిన్నాయగూడెంలో భూముల రీసర్వే పనులను కొవ్వూరు ఆర్‌డీవో రాణి సుస్మితతో కలసి ఆయన మంగళవారం పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సర్వే బృందానికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేసీ చిన్నరాముడు మాట్లాడుతూ, రీసర్వే సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అభ్యంతరాలుంటే పూర్తి వివరాలు తీసుకుని పరిష్కరిస్తున్నామని చెప్పారు. స్టాండర్డ్ ఆఫ్ ప్రాసెస్ (ఎస్‌ఓపీ) ప్రకారం సర్వే నంబరులోని ప్రతి రైతుకూ ముందుగా ఫామ్–19 అందజేస్తున్నామన్నారు. ముందుగా గ్రామ సరిహద్దులు ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూములను నమోదు చేశామని తెలిపారు. బ్లాక్‌లు ఏర్పాటు చేసి, ఆ బ్లాక్‌లోని రైతులందరికీ నోటీసులిచ్చి అందరి సమక్షంలో వారి అనుభవంలో ఉన్న భూముల విస్తీర్ణం వివరాలు నమోదు చేస్తున్నామని వివరించారు. రైతుల వద్ద ఉన్న కొత్త రికార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలను పరిశీలిస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.రాజ్యలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ ఎం.శ్రీనివాస్, మండల సర్వేయర్ దిల్లేష్, వీఆర్వోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment