భూమికి మేలు–రైతుకు వీలు | - | Sakshi
Sakshi News home page

భూమికి మేలు–రైతుకు వీలు

Mar 31 2025 7:03 AM | Updated on Mar 31 2025 7:03 AM

జిల్లాలో సాగు విస్తీర్ణం ఇలా

గత సార్వాలో 30 వేల ఎకరాల సాగు

రైతులు 28 వేలు

ప్రస్తుత లక్ష్యం 40 వేల ఎకరాలు

రైతులు 39 వేలు

కిట్టు ధర రూ.800 నుంచి రూ.900

సిద్ధం చేసిన కిట్లు 3వేలు

జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలు 102

మొత్తం డ్వాక్రా రుణం రూ.1.30 కోట్లు

నవధాన్యాల పంటలతో ఉపయోగం

పెట్టుబడి తక్కువ – ఆదాయం ఎక్కువ

మూడవ పంటగా వేసేందుకు 102 గ్రామాల ఎంపిక

జిల్లాలో 40 వేల ఎకరాల్లో సాగుకి సిద్ధం

పెరవలి: జిల్లాలో సేంద్రియ సాగు పెంచే దిశగా జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రబీ తరువాత నవధాన్యాల సాగుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా గత ఏడాది 30 వేల ఎకరాల్లో నవధాన్యాల పంటలను వేస్తే ఈ ఏడాది 40 వేల ఎకరాల్లో, 39 వేల మంది రైతులతో సాగు చేయించటానికి సిద్ధపడుతున్నారు. అందుకు 30 రకాల నవరత్న ధాన్యాలను కిట్లను తయారు చేసి రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో కిట్టు రూ.800 నుంచి రూ.900 విలువ ఉంటుంది. ఈ ధాన్యాలను రైతులకు అందించి సాగు చేయటానికి జిల్లాలో 102 గ్రామాలను ఎంపిక చేశారు. డ్వాక్రా ద్వారా రూ.1.30 కోట్ల రుణం తీసుకుని కిట్లు తయారు చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 3 వేల కిట్లు తయారు చేశారు. రైతులకు 500 కిట్లు అందజేశారు. దీనివల్ల భూసారం పెరగటంతో పాటు రైతులకు పంటల ద్వారా లాభాలు రానున్నాయి.

లక్ష్యం ఇలా..

జిల్లాలో నవధాన్యాల పంటలను 40 వేల ఎకరాల్లో 39 వేలమంది రైతులతో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వ్యవసాయ అనుబంధ శాఖలతో పాటు వెలుగు అధికారులు, వ్యవసాయాధికారులు, క్షేత్ర స్థాయిలో సేంద్రియ సిబ్బందితో కలసి పర్యటించి రైతులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నేలను సారవంతం చేసి, పెట్టుబడి ఖర్చు తగ్గించి, పంట దిగుబడి పెంచేలా దృష్టి సారించారు. ఈ లక్ష్య సాధనలో ఎంపిక చేసిన గ్రామానికి డ్వాక్రా ద్వారా రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలు రుణం ఇప్పించి నవధాన్యాలను కొనుగోలు చేసి కిట్లను తయారు చేసి రైతులకు ఇప్పించేలా పథకం రూపొందించారు. ఈ నవధాన్యాల్లో ముఖ్యంగా పెసలు, పిల్లిపెసర, మినుము, జీలుగ, జనుము, కొర్రలు, సాములు, బొబ్బర్లు, కందులు, సజ్జలు, నువ్వులు ఇలా 30 రకాల నవఽనాధాన్యాల పంటలు వేసి రైతులకు లాభం చేకూరేలా చేసి, తద్వారా పంట భూములకు సారం అందించేలా ప్రణాళిక రచించారు. ఈ నవధాన్యాల పంటల వలన పశువులకు మేత, రైతులకు పంట లాభాలు, భూసారం పెంచేలా చర్యలు చేపట్టారు.

ఇవీ లాభాలు..

● జీవ వైవిధ్యం పెరుగుదల

● 365 రోజులు బహుళ పంటలతో నేల సారవంతం

● నేలలో సేంద్రియ కర్బన్‌ శాతం పెరుగుదల

● వివిధ పంటల సాగు వల్ల భూమిలో సూక్ష్మ జీవులకు ఆశ్రయం. తద్వారా ప్రధాన పంటకు పోషకాలు లభ్యం

● బహుల పంటల వల్ల కలుపు ఉండదు, నేల కోతకు గురి కాదు

● నేల గుల్లబారి, వానపాముల వృద్ధి

● ప్రధాన పంటలను ఆశించే చీడ, పీడలను తట్టుకునే సామర్థ్యం

● నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుదల

● నవధాన్యాల పంటల వల్ల పశువులకు మేత లభ్యం

● బహుళ పంటల వలన అదనపు ఆదాయం

● రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గుదల

● భూసారంతో మేలైన పంట దిగుబడులు

● నేల స్వభావంలో మార్పు, స్థూల, సూక్ష్మ పోషకాల వృద్ధి

లాభాలు బాగు

నవధాన్యాల పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ఉదాహరణకు ఒక రైతు ఎకరం పొలంలో నవ్వులు సాగు చేపడితే ఎకరానికి దిగుబడి 250 నుంచి 300 కిలోలు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్టులో ధర ప్రకారం కిలో రూ.250 చొప్పున 250 కిలోలకు రూ.62,500 వస్తుంది. ఇందులో ఖర్చులు, పెట్టుబడి పోను ఎకరానికి రూ.25వేలు మిగులు వస్తుంది. అదే మినుము సాగు చేపడితే ఎకరానికి దిగుబడి 400 నుంచి 700 కిలోలు వస్తుంది. మార్కెట్టులో ధర ప్రకారం క్వింటా ధర రూ.6వేలు చొప్పన 5 క్వింటాలకు రూ.30 వేల ఆదాయం వస్తుంది. పెసలు చూసుకుంటే ఎకరానికి దిగుబడి 500 నుంచి 600 కిలోలు వస్తుంది. మార్కెట్‌ రేటు ప్రకారం క్వింటాకి రూ.8వేలు చొప్పున రూ.40 వేలు వస్తుంది. ఇందులో ఖర్చులు పోగా సగం సొమ్ము రైతులకు మిగులుతుంది. ఈ పంటలు వల్ల ఎకరానికి పచ్చిరొట్ట రూపేణా 10 టన్నుల ఎరువు లభ్యం అవుతుంది.

రైతులకు అదనపు ఆదాయం

జిల్లాలో నవధాన్యాల సాగు విస్తీర్ణం 40 వేల ఎకరాలకు పెంచాలనే ఉద్దేశంతో వ్యవసాయ అనుబంధ శాఖల సహకారంతో ప్రణాళిక రూపొందించాం. ఇందులో భాగంగా జిల్లాలో 102 గ్రామాలు ఎంపిక చేశాం. ఆయా గ్రామాల్లో రైతులకు కిట్లు అందించి సాగు చేపడతాం. నవధాన్యాల సాగు వల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరడంతో పాటు పంట భూములకు ఎరువు లభ్యమవుతుంది. భూసారం పెరిగి ఖరీఫ్‌ సాగుకి భూమి అనుకూలంగా మారి దిగుబడి పెరుగుతుంది.

– తాతారావు, సేంద్రియ వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్‌, తూర్పుగోదావరి జిల్లా

భూమికి మేలు–రైతుకు వీలు 1
1/2

భూమికి మేలు–రైతుకు వీలు

భూమికి మేలు–రైతుకు వీలు 2
2/2

భూమికి మేలు–రైతుకు వీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement