గంజాయి కేసులో ఎమ్మెల్యే అనుచరుడు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తాము అధికారంలో వస్తే గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామనే కూటమి నేతల ఊకదంపుడు ప్రసంగాలు ఆచరణలోకి రాలేదు. దాదాపు పది నెలల ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసినా గంజాయి కేసులే కనిపిస్తున్నాయి. కూటమి నేతల అనుచరులు ఈ కేసులో పట్టుబడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాతో పాటు కాకినాడ, రాజమహేంద్రవరం వంటి నగరాలతో పాటు పట్టణాలు, పల్లెల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నా అడ్డుకట్ట మాత్రం పడడం లేదు. అనపర్తి నియోజకవర్గ పరిధిలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడు దాసి గణేష్ గంజాయి కేసులో పోలీసులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల దాడి
పెదపూడిలో గంజాయిని విక్రయిస్తున్న పది మందిని అరెస్ట్ చేసినట్టు పెదపూడి ఎస్సై కె.రామారావు బుధవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల ఒకటో తేదీన పెదపూడిలోని కై కవోలు సెంటర్‌లో ఉన్న ఒక షెడ్డు వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చింది. కాకినాడ రూరల్ సీఐ డీఎస్ చైతన్య కృష్ణ, కాకినాడ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ వి.కృష్ణ, ఎస్సైలు వినయ్ ప్రతాప్, కె.రామారావు, సిబ్బంది సహకారంతో దాడి చేశారు. ఈ దాడిలో గంజాయి విక్రయిస్తున్న 10 మంది ముఠా సభ్యులను పట్టుకున్నారు. వారి నుంచి 5.265 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పది మందిలో ఒకడు మైనర్. మిగిలిన వారిలో గండ్రేడుకు చెందిన అయినవిల్లి అశోక్, ఎన్.వెంకట సురేష్, కై కవోలుకు చెందిన ఎస్.రాహుల్, దాసి గణేష్, ఎల్లే ఎం.కుమార్, కరకుదురుకు చెందిన పిల్లి ప్రశాంత్, పెదపూడికి చెందిన కేవీ రాఘవేంద్ర, జి.మామిడాడకు చెందిన వి.విజయకుమార్, యు.శ్రీనివాస్‌కుమార్ తదితరులు ఉన్నారు. నిందితుల్లో నలుగురి నుంచి తుని, నక్కపల్లి, కోరుకొండ, బొమ్మూరు, ధవళేశ్వరం, పెనుగొండ, ద్రాక్షారామ, తణుకు తదితర ప్రాంతాల్లో దొంగలించిన పది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేయగా సీఐ దర్యాప్తు చేసినట్లు తెలిపారు. అలాగా వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని ఎస్సై తెలిపారు.
పెదపూడిలో 10 మంది అరెస్ట్
5.265 కేజీల గంజాయి స్వాధీనం


