అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన
తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు
రాజమహేంద్రవరం రూరల్: కాతేరులో తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో గురువారం జరిగిన అవగాహన సదస్సుకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అనూహ్య స్పందన లభించిందని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. ఈ సదస్సుకు 18 వేలమంది హాజరయ్యారని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా దృఢంగా ఉండేలా సన్నద్ధం చేయాలని, అప్పుడే వారు వృద్దులోకి వస్తారన్నారు. జాతీయస్థాయి పరీక్షలైన జేఈఈ (మెయిన్), జేఈఈ (అడ్వాన్స్‌డ్) అండ్ నీట్‌లలో తరచుగా విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో పిల్లలు పుస్తకాలకన్నా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కి ఎక్కువగా అలవాటు పడ్డారని, మొబైల్‌తో ఎక్కువ సమయం గడిపితే జరిగే నష్టం గురించి తల్లిదండ్రులు వివరించాలని తెలిపారు. పిల్లలకు ఇచ్చే ఆస్తి కేవలం విద్య మాత్రమేనని, తల్లిదండ్రులు ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో దేశవ్యాప్తంగా జరిగే ఇంజినీరింగ్ (జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్)పరీక్షలలో 25మంది పరీక్ష రాస్తే కేవలం ఒక్కరికి మాత్రమే సీటు దొరుకుతుందని అదే తిరుమలలో ప్రతి నలుగురిలో ఒకరికి సీటు లభిస్తోందని చెప్పారు. మెడికల్‌లో దేశవ్యాప్తంగా జరిగే నీట్ పరీక్షల ప్రకారం 16మంది పరీక్ష రాస్తే కేవలం ఒకరికి సీటు లభిస్తుందని, అదే తిరుమలలో ప్రతి ముగ్గురిలో ఒకరికి మెడికల్ సీటు వస్తుందన్నారు. తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సరోజినిదేవి మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులని వారిని చూసే ఎక్కువగా నేర్చుకుంటారని, కాబట్టి పిల్లల నడవడికను చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని అన్నారు. విజ్ఞానభారతి నేషనల్ సెక్రటరీ కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి మాట్లాడుతూ పిల్లలు పుస్తకాలను ఎక్కువగా చదవాలని అప్పుడే వారికి జ్ఞాన సముపార్జన లభిస్తుందని అన్నారు. అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి పాల్గొన్నారు.


