ప్రలోభాల్లోనూ మోసాలేనా? | - | Sakshi
Sakshi News home page

ప్రలోభాల్లోనూ మోసాలేనా?

Apr 5 2025 12:22 AM | Updated on Apr 5 2025 12:22 AM

ప్రలోభపెట్టే ఎంపీపీ ఎన్నికలో గెలిచారు

కూటమి నేతల తీరుపై అనపర్తి

మాజీ ఎమ్మెల్యే ధ్వజం

పెదపూడి: ఇటీవల జరిగిన బిక్కవోలు ఎంపీపీ ఎన్నికల్లో కూటమి నాయకులు తమ ఎంపీటీసీ సభ్యులను ప్రలోభపెట్టడమే కాకుండా, ఆ సమయంలో వారికి ఇచ్చిన హామీల అమలులోనూ మోసాలకు పాల్పడ్డారని వైఎస్సార్‌ సీపీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆరోపించారు. అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కొంత మంది ఎంపీటీసీ సభ్యులను కూటమి నాయకులు ఏవిధంగా ప్రలోభపెట్టారో, మోసాలు, బెదిరింపులకు పాల్పడ్డారో వివరించారు. దీనిపై ఆ ఎంపీటీసీ సభ్యుల్లో కొందరు ఇటీవల వారి సన్నిహితుల వద్ద వాపోయారన్నారు. వైఎస్సార్‌ సీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే రూ.1.50 లక్షలు ఇస్తామని ఒక ఎంపీటీసీ సభ్యుడిని ఆశ చూపించి, రూ.1.25 లక్షలు మాత్రమే చేతిలో పెట్టారని సూర్యనారాయణరెడ్డి అన్నారు. మరో ఎంపీటీసీ సభ్యుడు తమ గ్రామంలో సుమారు 30 ఏళ్లుగా ఒక దేవస్థానం భూమిలో పశువుల పాక వేసుకుని, పశుపోషణ చేసుకుంటూంటే.. వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా ఓటు వేస్తే ఆ పాకను తొలగిస్తామంటూ బెదిరించారని తెలిపారు. స్వగ్రామంలో ఎరువుల వ్యాపారం చేసుకుంటున్న మరో ఎంపీటీసీ సభ్యుడిని వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా ఓటు వేస్తే ఆ షాపుపై విజిలెన్స్‌, వ్యవసాయ అధికారులతో దాడులు చేయిస్తామంటూ బెదిరించారని ఆరోపించారు. మరో ఎంపీటీసీ సభ్యుడు తన గ్రామంలో సప్లయి కంపెనీ నిర్వహించుకుంటున్నారని, వైఎస్సార్‌ సీపీకి ఓటు వేస్తే ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాలకు ఆ సప్లయి కంపెనీకి ఆర్డర్‌ ఇవ్వబోమంటూ బెదిరించారని చెప్పారు. అలాగే, వాహనంలో గంజాయి పెట్టి కేసులు బుక్‌ చేస్తామంటూ మరో ఎంపీటీసీ సభ్యుడిని బెదిరించారంటూ తెలిపారు. మరో ఎంపీటీసీ సభ్యుడు ఎంపీడీఓ కార్యాలయం నుంచి వైఎస్సార్‌ సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుల గుర్తింపు కార్డులను అధికారుల అంగీకారంతో తీసుకుంటే, ఆయనపై కూడా అధికారులను ఉపయోగించి తప్పుడు కేసు పెట్టి, ఓటింగ్‌కు వెళ్లకుండా చేస్తామంటూ స్థానిక పోలీస్‌ అధికారులను ఉపయోగించి భయపెట్టారని చెప్పారు. ఇలా ప్రలోభాలు, బెదిరింపులు, మోసాలతో ఎంపీపీ పదవి గెలిచారని దుయ్యబట్టారు. ఈ గెలుపును ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన గొప్పగా చెప్పుకుంటున్నారని, ఇది వైఎస్సార్‌ సీపీ కక్కిన కూడుకు కూటమి నాయకులు కక్కుర్తి పడినట్లు కాదా అంటూ విమర్శించారు. వైఎస్సార్‌ సీపీకి పుట్టిన బిడ్డను బీజేపీ బిడ్డగా చెప్పుకోడానికి సిగ్గనిపించడం లేదా అని మండిపడ్డారు. తాను సామెత కూడా సరిగా పలకలేకపోయానంటూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విమర్శించారని, అవసరమైతే తాను మాట్లాడిన ఆ వీడియో మరోసారి చూసి, వినాలని అన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డను మీ బిడ్డగా చెప్పుకున్నట్లు కాదా అనే సామెతను తాను స్పష్టంగానే పలికానని, గతంలో రామకృష్ణారెడ్డి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరును కూడా సరిగ్గా పలకలేకపోయిన విషయం మరచి, తనపై వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదని సూర్యనారాయణరెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement