వినియోగదారుల హక్కుల రక్షణకు ఆసరా
● తూర్పు గోదావరి, కోనసీమ ఇన్‌చార్జిగా శ్రీహరి ప్రసాద్
● ఫౌండర్ హబీబ్ సుల్తాన్ అలీ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వినియోగదారుల సంక్షేమం, హక్కుల రక్షణ కోసం ఆసరా పనిచేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు, సుప్రీంకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ చెప్పారు. భారతదేశం అంతటా 10కి పైగా రాష్ట్రాలలో ఒకే లక్ష్యంతో అంకితభావంతో ఆసరా పనిచేస్తోందన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఉదయం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం తమ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కసరత్తు చేస్తున్నామన్నారు. 2016లో ప్రారంభమైన తమ సంస్థ 2,500 అవగాహన సదస్సులు నిర్వహించిందని చెప్పారు. వినియోగదారుల తరఫున కోర్టుల్లో కేసులు దాఖలు చేసి ఉచితంగా సేవలు అందిస్తున్నామన్నారు. అయితే ఈ మధ్య స్టేషనరీ వంటి ఖర్చుల కోసం అతి తక్కువ ఫీజు తీసుకుని కేసులు దాఖలు చేస్తున్నామని చెప్పారు. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల ఆసరా ఇన్‌చార్జిగా శ్రీహరి రాజూను నియమించినట్లు సుల్తానా అలీ తెలియజేస్తూ, ఆయనకు నియామక పత్రం అందించి, ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీహరి రాజు మాట్లాడుతూ వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన కల్పించి, వారు మోసపోకుండా చూస్తామని చెప్పారు. అడ్వకేట్స్ కానివాళ్లను కూడా ఇందులో సభ్యులుగా వేసుకుని, కేసులు దాఖలు చేయిస్తున్నామని అలీ చెప్పారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసు, ఈశ్వరాచారి, రామలింగారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.


