అనపర్తిలో దౌర్జన్యకాండపై సమగ్ర విచారణ
ఫ వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్
ఫ ఎస్పీని కలసిన మాజీ మంత్రి వేణు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సూర్యనారాయణరెడ్డి
రాజమహేంద్రవరం రూరల్: అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆయన అనుయాయులు దౌర్జన్యకాండ, దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్‌కు వైఎస్సార్ సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఏఎంసీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డిలు ఎస్పీని సోమవారం ఆయన కార్యాలయంలో కలిశారు. అనపర్తి నియోజకవర్గంలో కూటమి నేతల దౌర్జన్యకాండపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరగకుండా, పౌర జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు.
అనంతరం మాజీ మంత్రి వేణు విలేకర్లతో మాట్లాడుతూ, అనపర్తి నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే, ఆయన అనుయాయులు దౌర్జన్య కాండలు, దుశ్చర్యలకు పాల్పడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇటీవల వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులను ఎస్పీకి వివరించామని చెప్పారు. దాడి జరిగినా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి భయపడే పరిస్థితి నెలకొందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మృదుస్వభావి, హింసకు తావు లేకుండా పరిపాలించిన నేత అని, ప్రభుత్వానికి, శాంతిభద్రతలకు సహకరించే వ్యక్తి అని అన్నారు. దీనిని ఎమ్మెల్యే, ఆయన అనుయాయులు చేతకానితనంగా తీసుకోరాదని హితవు పలికారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, వాటి నిరూపణ కోసం రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి సృష్టించడం దారుణమని అన్నారు.
దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆయన అనుయాయుల దుశ్చర్యలు, కక్షసాధింపు చర్యలు, దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని అన్నారు. ఎన్నికల ముందు, తరువాత చిన్నచిన్న వివాదాలుంటాయని సర్దుకుపోతూంటే వారి ఆగడాలు శృతి మించుతున్నాయని చెప్పారు. ఏఎంసీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి, శ్రీచేసిన ఆరోపణలు నిరూపించడానికి నువ్వు మా ఇంటికి వస్తావా.. లేక నేను మీ ఇంటికి రానా?శ్రీ అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారన్నారు. తాత్కాలికంగా కొంత మందికి పార్టీ కండువాలు వేసినప్పటికీ, నియోజకవర్గంలోను, రాష్ట్రంలోను వైఎస్సార్ సీపీ అభిమానులకు కొదవ లేదని చెప్పారు. మీ హనీమూన్ పిరియడ్ అయిపోయిందని, కార్యకర్తలు, నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని, ప్రజల నుంచి తిరుగుబాటు ఏవిధంగా తీసుకొస్తామో చూడటానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు. సబ్బెళ్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు మనోజ్‌రెడ్డి, వారి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశామని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా కోరామని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీయూసీ నాయకులు అడపా వెంకట రమణ, అడపా అనిల్, తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


