నిరుపయోగంగా నివేదన శాల
● రెండు నెలలైనా అమలు కాని
ఈఓ నిర్ణయం
● దాత అసంతృప్తి
అన్నవరం: స్థానిక వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో తుని పట్టణానికి చెందిన దాత చెక్కా సూర్యనారాయణ (తాతబాబు) రూ.30 లక్షలతో నిర్మించిన నివేదన శాల పునః ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించి రెండు నెలలైనా అమలు కాలేదు. దీంతో అధికారుల తీరుపై దాత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దేవస్థానంలో స్వామివారి నివేదన శాల నిర్మించాలని తాతబాబును 2023 జూన్‌లో అప్పటి ఈఓ ఎస్‌ఎస్ చంద్రశేఖర్ అజాద్ కోరారు. ఆయన రూ.30 లక్షల వ్యయంతో సర్క్యులర్ మండపంపై నివేదనశాల నిర్మించారు. ఈ నిర్మాణానికి దేవస్థానం పండితులు కూడా ఆమోదం తెలిపారు. దీనిని 2023 ఆగస్టులో దాత చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ తరువాత సత్యదేవుని నివేదనలన్నీ ఈ షెడ్డులోనే తయారు చేసి నివేదించేవారు. 2023 నవంబర్‌లో ఈఓ చంద్రశేఖర్ అజాద్ బదిలీ కాగా ఆయన స్థానంలో ప్రస్తుతం దేవదాయశాఖ ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న కె.రామచంద్రమోహన్ ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. నివేదన శాల భూస్పర్శతో భూమి మీదనే ఉండాలని పండితులు సూచించడంతో పాత నివేదనశాల లోనే మళ్లీ నివేదనలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. దీంతో 2023 నవంబర్ నుంచి పాత నివేదనశాలను ఉపయోగిస్తున్నారు.
‘సాక్షి’ కథనంతో ఈఓ ప్రకటన
ఫిబ్రవరి 21న ‘సాక్షి’ దినపత్రికలో నిరుపయోగంగా ఉన్న నివేదనశాలపై ‘దాతల ఆశయాలకు తూట్లు ’ శీర్షికన వార్త ప్రచురితమవడంతో ఈఓ వీర్ల సుబ్బారావు స్పందిస్తూ దాత చెక్కా తాతబాబు నిర్మించిన నివేదన షెడ్డు ను కూడా వినియోగంలోకి తేవాలని నిర్ణయించామని, పులిహోర, ఇతర ప్రసాదాలు తయారు చేయించి భక్తులకు పంపిణీ చేయిస్తామని చెప్పారు. ఇవి తయారు చేయడానికి ఒక కుక్, మరో సహాయకుడు అవసరం. వారిని నియమించడానికి ఎంఎల్‌సీ ఎన్నికల కోడ్ అడ్డుగా ఉందని తెలిపారు. ఇది జరిగి రెండు నెలలు దాటినా ఆచరణకు నోచుకోకపోవడంపై దాత సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే ఏడో తేదీ నుంచి సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు జరుగనున్నాయి. కనీసం ఆ ఉత్సవాల నాటికై నా ఈ నివేదనశాలను వినియోగంలోకి తేవాలని దాత కోరుతున్నారు.
నిరుపయోగంగా నివేదన శాల


