
నిబంధనల అమలుతో ప్రమాదాల నివారణ
ఫ హైవేపై దీపాల ఏర్పాటుకు
3 నెలలెందుకు?
ఫ రహదారి భద్రత సంఘ సమావేశంలో కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం సిటీ: రహదారి భద్రత, వాహన చోదక నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం ద్వారా ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యాన తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి రహదారి భద్రత సంఘ సమావేశంలో ఆమె మాట్లాడారు. జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలు, మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. దీనిపై జాతీయ, రాష్ట్ర, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులు దృష్టి సారించాలని, ప్రమాదాల సంఖ్యను, తీవ్రతను తగ్గించడానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు కాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై లైటింగ్ ఏర్పాటుకు మూడు నెలల సమయం ఎందుకని ప్రశ్నించారు. టెండర్లతో సంబంధం లేకుండా అత్యవసరంగా పనులు పూర్తి చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలన్నారు. ప్రమాదాల తీవ్రతను జాతీయ రహదారుల ఉన్నతాధికారులకు తెలియజేయడంతో పాటు ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై బుధవారం సాయంత్రంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఐరాడ్ యాప్‌పై సంబంధిత శాఖల అధికారులందరూ అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్ర రహదారుల టోల్ ధరలు జాతీయ రహదారులతో సమానంగా ఉన్నప్పటికీ, భద్రతా ప్రమాణాలు ఆ స్థాయిలో లేవని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రహదారి అభివృద్ధి సంస్థ అధికారులు తనిఖీలు చేయాలని, ఆదాయం మాత్రమే లక్ష్యంగా పని చేస్తున్న ఏజెన్సీలు సరైన ప్రమాణాలు పాటించకుంటే నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. సమర్థ నిర్వహణ, మరమ్మతులపై జవాబుదారీగా ఉండాలని, అలా లేకుంటే సంబంధిత కాంట్రాక్టర్లపై జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. నగరంలో వేగ పరిమితి పెట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలని, హెల్మెట్ లేని వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు. హెచ్చరిక బోర్డుల ఏర్పాటుతో ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని కలెక్టర్ ప్రశాంతి అన్నారు.
ఎిస్పీ డి.నరసింహ కిశోర్ మాట్లాడుతూ, గడచిన మూడు నెలల్లో ప్రమాదాలు, మరణాలు రెట్టింపయ్యాయని చెప్పారు. ఆర్టీసీ బస్సుల వల్ల ప్రమాదాలు తగ్గాయని, కానీ నాలుగు చక్రాల వాహనాల వల్ల పెరిగాయని తెలిపారు. త్రీటౌన్ పరిధిలో ప్రమాద మరణాలు అధికమయ్యాయని, గామన్ బ్రిడ్జి నుంచి జీరో పాయింట్ వరకూ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. జాతీయ రహదారిపై లైటింగ్ సమస్య ఉందన్నారు. రోడ్ల పనులు చేపట్టినప్పుడు తమ శాఖకు సమాచారం ఇవ్వాలని అన్నారు. రవాణా, పోలీసు, ఇతర సమన్వయ శాఖల అధికారులు మల్టీ డిసిప్లినరీ బృందాలుగా ఏర్పడి సంయుక్త తనిఖీలు చేపట్టాలని సూచించారు. నగర పరిధిలో హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఎస్‌బీవీ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.