గోదావరి తీరాన పంచమవేద పరిమళాలు | - | Sakshi
Sakshi News home page

గోదావరి తీరాన పంచమవేద పరిమళాలు

Nov 22 2025 7:32 AM | Updated on Nov 22 2025 7:34 AM

వేదనాదం వినబోతున్నాం

మహాభారతం విశ్వచరిత్ర. విశ్వేశ్వరుని చరిత్ర. మానవుని మాధవునిగా తీర్చిదిద్దే శక్తి భారతానికి ఉంది. సమస్త విశ్వాన్ని పట్టి నిలిపేది ధర్మమే. ఆ ధర్మాన్ని పట్టి నిలిపిన పరమాత్మయే శ్రీకృష్ణుడు. భారతంలో భారతంలో భగవద్గీత తత్తుల్యమైన మరో 8 గీతలున్నాయి. అవతారిక, యక్ష ప్రశ్నలు, విదుర నీతి, సనత్సుజాతీయం, భీష్మస్తవరాజం, శివ సహస్రం, విష్ణు సహస్రం, అను గీత భగవద్గీత పంక్తిలో నిలిచే గీతల వంటివి. ఇవి మన నుదుటి రాతను మార్చగల మహోద్ధారకమైన మంత్రాలు. మహాభారత విశ్వరూపాన్ని జిజ్ఞాసువులకు తెలియజేయడానికి మన ముందుకు ఆరు ముఖాలతో (షణ్ముఖ శర్మ) వస్తున్న వేదనాదం మనం వినబోతున్నాం.

– మహామహోపాధ్యాయ,

భారత భారతి శలాక రఘునాథశర్మ

నన్నయ నడయాడిన గడ్డపై భారత వాణి

27 నుంచి జనవరి 25 వరకూ

వ్యాస భారత ప్రవచనాలు

60 రోజుల పాటు ప్రవచించనున్న

సామవేదం షణ్ముఖశర్మ

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆదికవి నన్నయ నడయాడిన గడ్డపై.. ఆంధ్ర మహాభారతం అవతరించిన రాజమహేంద్రవరంలో.. వ్యాస భారతంపై సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ప్రవచన సుధను అందించనున్నారు. ఈ నెల 27 నుంచి జనవరి 25వ తేదీ వరకూ రాజమహేంద్రవరం హిందూ సమాజంలో ప్రతి రోజూ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకూ ఈ ప్రవచనాలు జరగనున్నాయి. దీని కోసం లబ్ధప్రతిష్ఠులయిన పండితులతో పాటు, ఉద్యోగులు, మహిళలు, ప్రవాస భారతీయులు సైతం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ ప్రవచనాల నేపథ్యంలో రాజమహేంద్రవరంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు.

ఋషి రుణం

తీర్చుకుందాం

మానవుడు దేవ, పితృ,ఋషి రుణాలతో జన్మిస్తాడు. వ్యాస భగవానుడు అందించిన మహాభారతాన్ని శ్రవణం చేసి, ఆయన సూచించిన ధర్మమార్గంలో నడవడమే ఋషి రుణ విమోచనానికి మార్గం. భారతానికి జయమనే మరో పేరుంది. ఎక్కడ మహాభారతం వినబడుతుందో, అక్కడ జయం సిద్ధిస్తుందన్నది పెద్దల మాట. వేద స్వరూపులు, ప్రాచీన మహర్షుల కోవకు చెందిన సామవేదం షణ్ముఖశర్మ వ్యాస భారతాన్ని శ్రవణం చేసి, జీవితాలను సార్థకం చేసుకుందాం.

– వి.అన్నపూర్ణ, ప్రిన్సిపాల్‌,

ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల

మరో చరిత్ర నిర్మాణం

నవరస సమ్మిళితమై, ధర్మాధర్మ వివరణాత్మకమైన భారతం ఈ జాతి చేసుకున్న పుణ్యఫలం. సమస్త వేద రహస్యాలు, ఉపనిషత్తుల సారాంశం, సకల పురాణాల ఆశయాలను తనలో నిలుపుకొన్న భారతం మహాకావ్యం, మహేతిహాసం, మహాశాస్త్రం. పురుషార్థాలకు సంబంధించి ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉందని.. ఇందులో లేనిది ఎక్కడా లేదని వ్యాస భగవానుడు ఆత్మవిశ్వాసంతో ప్రకటించిన పంచమ వేదం భారతం. సనత్సుజాతీయం, భగవద్గీత, విష్ణు, శివ సహస్ర నామాలను అందించిన జ్ఞానగంగ భారతం. సామవేదం షణ్ముఖశర్మ మన ముందుకు వచ్చి దీక్షగా అందిస్తున్న ఈ మహాభారతాన్ని ఆస్వాదించడానికి ప్రతి ఒక్కరికీ ఆదరంగా స్వాగతం పలుకుతున్నాం. గోదావరి తీరాన మరో చరిత్ర నిర్మాణం కానున్నది.

– భాగవత విరించి డాక్టర్‌ టీవీ నారాయణరావు,

ఋషిపీఠం చారిటబుల్‌ ట్రస్టు

సామవేదం షణ్ముఖశర్మ

మన పురాకృత సుకృతి

ఆదికవి నన్నయ నడయాడిన రాజమహేంద్రవరంలో ఏకంగా రెండు నెలల పాటు మహాభారత జ్ఞానగంగ భగీరథ ప్రయత్నంగా త్వరలో ప్రవహించనున్న వార్త మన పురాకృత సుకృతి. విశ్వమానవాళికి సామవేదం పంచిపెట్టబోతున్న పంచమవేద సారం ఇది. వ్యాస హృదయాన్ని అనేక కోణాల్లో, ఉపాసనా రీతుల్లో సామవేదం ఆవిష్కరిస్తారనడంలో సందేహం లేదు.

– జోస్యుల రామచంద్రశర్మ (జోరాశర్మ),

విశ్రాంత బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారి

మానవాళిని పునీతం చేసే గంగ

సామవేదం నోట పంచమ వేదం వినాలనే మాట ప్రతి నోటా వినబడుతోంది. పవిత్ర భారత గాథను గోదావరి తీరాన వినిపించడానికి, వ్యాస హృదయాన్ని యథాతథంగా ఆవిష్కరించే సద్గురువులు ముందుకు రావడం మన భాగ్య విశేషం.

– రాజనాల రాజేశ్వరి, సంస్కృత ఉపన్యాస

కురాలు, ఎస్‌కేఆర్‌ ప్రభుత్వ మహిళా కళాశాల

తెలుగులో భారతాంధ్రీకరణే తొలి కావ్యం

తెలుగువారికి అత్యంత ప్రియమైన గ్రంథం మహాభారతం. ఇందులోని పాత్రలన్నీ తెలుగువారి మనసులకు అతి సన్నిహితమైనవి. మహాభారత ఘట్టాలు ఇప్పటికీ నిత్యనూతనంగా, మన సంభాషణల్లో, సామెతల్లో చర్చనీయాంశాలుగా ఉంటున్నాయి. ఇది ఒక ధర్మశాస్త్రం, వేదాంత గ్రంథం, నీతిశాస్త్రం, అద్భుత కావ్యం, ఇతిహాసం, పురాణం. తెలుగు భాషలో వెలువడిన తొలి కావ్యం భారతాంధ్రీకరణే. వ్యాస హృదయాన్ని ఆవిష్కరించడానికి మన ముందుకు వస్తున్న సామవేదం వారికి హార్దిక స్వాగతం పలుకుదాం.

– వలివేటి వేంకట సుబ్రహ్మణ్యం, ఇతిహాస సంకలన సమితి వ్యవస్థాపకుడు

కామితార్థాలను ప్రసాదించే కల్పతరువు

తత్త్వజ్ఞులకు, కవివృషభులకు, సకల శాస్త్రజ్ఞులకు, వైయాకరుణలకు, నీతికోవిదులకు, పురాణమర్మజ్ఞులకు, అధ్యయన శీలురకు కామితార్థాలను ప్రసాదించే కల్పతరువు మహాభారతం. వేదశాస్త్ర, పురాణ, ఉపనిషత్‌, కావ్య సంబంధిత సర్వస్వాన్నీ సమన్వయపరుస్తూ, సామాన్య మానవునికి సైతం ఽఅర్థమయ్యే రీతిలో వ్యాస హృదయావిష్కరణకు సామవేదం షణ్ముఖశర్మ నగరానికి వస్తున్న ఈ తరుణం మనకు జీవితకాలంలో ఒకసారే వచ్చే సువర్ణావకాశం. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్‌ సీఎస్‌వీ రమణీకుమారి,

విశ్రాంత తెలుగు పండితురాలు, కౌలాలంపూర్‌, మలేషియా

గోదావరి తీరాన పంచమవేద పరిమళాలు1
1/7

గోదావరి తీరాన పంచమవేద పరిమళాలు

గోదావరి తీరాన పంచమవేద పరిమళాలు2
2/7

గోదావరి తీరాన పంచమవేద పరిమళాలు

గోదావరి తీరాన పంచమవేద పరిమళాలు3
3/7

గోదావరి తీరాన పంచమవేద పరిమళాలు

గోదావరి తీరాన పంచమవేద పరిమళాలు4
4/7

గోదావరి తీరాన పంచమవేద పరిమళాలు

గోదావరి తీరాన పంచమవేద పరిమళాలు5
5/7

గోదావరి తీరాన పంచమవేద పరిమళాలు

గోదావరి తీరాన పంచమవేద పరిమళాలు6
6/7

గోదావరి తీరాన పంచమవేద పరిమళాలు

గోదావరి తీరాన పంచమవేద పరిమళాలు7
7/7

గోదావరి తీరాన పంచమవేద పరిమళాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement