కౌలు రైతుపై కరుణేదీ!
● అన్నదాత సుఖీభవలో అన్యాయం
● నయా పైసా జమ చేయని
చంద్రబాబు ప్రభుత్వం
● దరఖాస్తు ఆప్షన్ సైతం ఇవ్వని వైనం
● జిల్లావ్యాప్తంగా లక్ష మందికి అన్యాయం
సాక్షి, రాజమహేంద్రవరం: పథకం ఏదైనా కోతలు, ఆంక్షలే కూటమి ప్రభుత్వం అజెండాగా కనిపిస్తోంది. ఉచిత గ్యాస్ కొంత మందికే ఇచ్చి మమ అనిపించారు. తల్లికి వందనంలో నిబంధనలు పెట్టి నిధులు అందకుండా తల్లులను వంచించారు. రైతుల విషయంలో కూడా అందే పంథా అవలంబిస్తున్నారు. సూపర్–6లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో ఊరూవాడా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం ఈ నిధులు ఇవ్వలేదు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతుల ఆందోళనలతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో నిధులు జమ చేయాల్సి ఉండగా కోతలు పెట్టింది. ముఖ్యంగా కౌలు రైతులకు నయా పైసా కూడా ఇవ్వలేదు.
18,511 మంది రైతులకు మొండిచెయ్యి
పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఇటీవల జిల్లావ్యాప్తంగా 1,14,991 మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.76.99 కోట్లు జమ చేసింది. ఇందులో కేంద్రం వాటా రూ.19.50 కోట్లు, రాష్ట్రం వాటా రూ.57.49 కోట్లు ఉన్నాయి. ఈ పథకం లబ్ధిదారుల్లో ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. గతంతో పోలిస్తే.. ఈసారి 18,511 మందికి ఈ పథకాన్ని దూరం చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏటా సగటున 1,33,502 మందికి రైతుభరోసా నిధులు అందించేది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఆ సంఖ్యను 1,14,991కి కుదించింది.
కౌలు రైతుల ఆగ్రహం
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా 57,328 మంది కౌలు రైతులకు క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డులు (సీసీఆర్‌సీ) మంజూరు చేశారు. వీరిలో ఏ ఒక్కరికీ ఇటీవల విడుదల చేసిన రూ.7 వేల సుఖీభవ నిధులు అందలేదు. అసలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కౌలు రైతులకు ఆప్షన్ కూడా ఇవ్వలేదని, దీంతో, తాము ఏవిధంగా దరఖాస్తు చేసుకోవా లని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కౌలు రైతులను ఆదుకుంటానని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక తమను పక్కన పెట్టేయడంపై కౌలు రైతులు మండిపడుతున్నారు. వరుస ప్రకృతి విపత్తులతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని, సాయం చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీసీఆర్‌సీ జారీలోనూ నిర్లక్ష్యమే..
కౌలు రైతులకు సీసీఆర్ కార్డుల జారీలోనూ అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల మంది కౌలు రైతులున్నట్లు సమాచారం. వీరికి ఏటా భూ యజమాని సమ్మతితో సీసీఆర్ కార్డులు జారీ చేస్తారు. 2025–26లో జిల్లావ్యాప్తంగా 1,10,000 మంది కౌలు రైతులకు ఈ కార్డులు మంజూరు చేయాలని వ్యవసాయ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆగస్టు నెలాఖరుకు 57,328 మందికి మాత్రమే జారీ చేసి, 52.12 శాతం లక్ష్యాన్ని మాత్రమే సాధించారు. నల్లజర్ల, రంగంపేట, రాజానగరం మండలాల్లో లక్ష్యం 30 శాతానికి మించలేదు. సీసీఆర్ కార్డు జారీ కావాలంటే రూ.10 స్టాంపు పేపర్‌పై రాసుకున్న అగ్రిమెంట్‌పై భూ యజమాని, కౌలుదారు ఇద్దరూ సంతకాలు చేయాలి. వీఆర్‌ఓలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలి. ఈ ప్రక్రియలో అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. వీఆర్‌ఓల నాన్చివేత ధోరణితో కౌలు రైతులకు సకాలంలో సీసీఆర్ కార్డులు అందలేదన్న ఆరోపణలున్నాయి.
క్రమం తప్పకుండా అందించిన వైఎస్సార్ సీపీ
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో రైతుభరోసా సాయం జమ చేసేవారు. వైఎస్సార్ సీపీ 2019 ఎన్నికల మెనిఫెస్టోలో రైతులకు రూ.12,500 అందజేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత పీఎం కిసాన్‌తో కలిపి దీనిని రూ.13,500కు పెంచింది. కేవలం రైతులకే కాకుండా కౌలు రైతులకు సైతం ఈ సాయం అందించింది. దీర్ఘకాలంగా దేవస్థానం భూ ములు కౌలుకు తీసుకున్న రైతులకు సైతం లబ్ధి చేకూర్చింది. జిల్లావ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలోని నాలుగేళ్లలో 1,33,502 మంది రైతులకు రూ.584.64 కోట్ల మేర రైతుభరోసా సాయం అందజేశారు.
మండలాల వారీగా
కౌలు రైతుల వివరాలు
నల్లజర్ల 6,693
రంగంపేట 6,081
రాజానగరం 9,845
బిక్కవోలు 6,624
కోరుకొండ 9,981
గోపాలపురం 5,395
రాజమహేంద్రవరం రూరల్ 1,701
అనపర్తి 6,108
సీతానగరం 5,994
చాగల్లు 5,872
కొవ్వూరు 5,994
దేవరపల్లి 6,292
గోకవరం 6,052
పెరవలి 6,108
కడియం 4,252
తాళ్లపూడి 4,452
నిడదవోలు 6,692
ఉండ్రాజవరం 5,862
కార్డున్నా ‘సుఖీభవ’ అందలేదు
బిక్కవోలులో ఐదెకరాల పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేపట్టాను. కౌలు రైతు కార్డు కూడా ఉంది. అయినప్పటికీ అన్నదాత సుఖీభవ నిధులు అందలేదు. పంట సాగుకు అప్పులు చేసి పెట్టుబడి పెట్టాను. తుపాను, భారీ ఈదురు గాలులకు పంట దెబ్బ తింది. ఆశించిన మేరకు దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో అన్నదాత సుఖీభవ నిధులైనా అందుతాయని అనుకుంటే రాలేదు. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.
– పచ్చిపాల బాబూరావు, కౌలు రైతు బిక్కవోలు
ఇస్తామన్నదెంత? ఇచ్చిందెంత?
అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు అందజేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతల ప్రకటించారు. ప్రస్తుతం రూ.14 వేలు మాత్రమే ఇచ్చారు. అందులో మూడో వంతు నిధులు కేంద్ర ప్రభుత్వానివే. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందేముంది? రైతులను మోసం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం తర్వాతే ఎవరైనా. హామీ మేరకు రైతులకు పూర్తి నగదు ఇవ్వాలి.
– సాలి వేణు,
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు
కౌలు రైతుపై కరుణేదీ!
కౌలు రైతుపై కరుణేదీ!


