పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ప్రభాకరరావు మనవలు
● మనవలతో సహా వచ్చిన అమెరికా వాసి
● తాను చదివిన పాఠశాలలో ఆటా పాటా
● విద్యార్థులతో భోజనాలు.. బహుమతులు
నల్లజర్ల: ముదిమిలో మనసును ముప్పిరిగొనే మునుపటి జ్ఞాపకాలు ఎన్నెన్నో.. అఆలు నేర్చిన నాటి నుంచి మునిమనవళ్ల మనువుల వరకు.. అన్నీ మధురాతిమధురాలే. నేటి తరాలకు సమయం వచ్చినపుడల్లా ఆనాటి సంగతులన్నీ చెప్తూ మురిసిపోయే తాతయ్యలు ఎందరో.. అంతటితో ఆగకుండా తనను కన్న నేలపై మమకారాన్ని.. ఆ నేల రుణాన్ని తీర్చుకోవాలని తాపత్రయపడేవారు ఎందరెందరో.. ఆ ఎందరిలోనో ఒకరు మన గద్దే ప్రభాకరరావు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో జన్మించి 1974లో ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. తరచూ మాతృ దేశానికి వచ్చే ఆయన ఈ సారి ఒక్కరే కాకుండా మనవులతో సహా వచ్చి ఇక్కడ తాను ఓనమాలు దిద్దిన అనంతపల్లి –1 పాఠశాల దగ్గర నుంచి తాను ఆడుకున్న ప్రాంతాలన్నీ తిప్పి పుట్టిన నేల గొప్పదనాన్ని వివరించారు. శుక్రవారం వచ్చిన ఆయన తన భార్య రమణి, ఇద్దరు కుమార్తెలు విజయ, కవిత, అల్లుడు రాంసీ (అమెరికా వాసి), మనవడు రుమి హోంసనీ, మనుమరాలు లీలా అన్నపూర్ణ అందరూ ఆయన చదువుకున్న పాఠశాలలోని విద్యార్థులతో కొద్దిసేపు ఆటలాడారు. అక్కడి 150 మంది విద్యార్థులకు వారు తీసుకువచ్చిన భోజనం ప్లేట్లు, వాటర్ ఫ్లాస్క్‌లు, మూడు నోట్ పుస్తకాలు, 3, 4, 5 తరగతుల విద్యార్థులకు జామెట్రీ బాక్స్‌లు అందజేశారు. స్వీటు, చికెన్ పలావు అందరికీ వడ్డించి సహ పంక్తి భోజనం చేశారు. వారివెంట మాజీ ఎంపీపీ జమ్ముల సతీష్, గెడ్డాపు సూర్యనారాయణ, కోళ్ళు సతీష్, దాసు రాజా, మరో ప్రవాస భారతీయుడు గన్నమని భానుకిరణ్, హెచ్‌ఎం ఎం.హనుమంతరావు ఉన్నారు.
కన్న ఊరి సేవకు సపరివారంగా..


