
డెబ్బై ఏళ్ల క్రితం సంగతి. చిన్నారి లోకేశ్వర్‌కు పుట్టు వెంట్రుకలు తీయాలి. ఇంటి ఇలవేల్పు చిల్పూరు ‘బుగులు వెంకటేశ్వర స్వామి’. ఈ చిల్పూరు స్టేషన్ ఘన్‌పూర్ నుంచి పదీ పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్‌లోని షాలిబండలో ఉండే ఆ దిగువ మధ్యతరగతి కుటుంబం ఆ కార్యక్రమం కోసం తెల్లవారుజామున లేచి నాంపల్లి స్టేషన్ చేరుకుని, వరంగల్ చేరి, అక్కడ నుంచి ఎడ్లబండ్లు కట్టుకుని చిల్పూరు చేరడం కథ. మరి మలుపు ఏమిటి? తిరుగు ప్రయాణంలో బండి తోలేవాడితో సహా అందరూ నిద్రపోతే కారుచీకట్లో ఎద్దులు గుడ్డెత్తుగా వెళ్లి సరాసరి దిగుడుబావి అంచున ఆగిపోవడం. అవి అడుగు ముందుకేస్తే అంతే సంగతులు. రచయిత అంటాడు– ఇలా బుగులు పుట్టించి మళ్లీ కాపాడటమే బుగులు వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత... ఇలా భక్తులతో పరాచికం ఆడుతాడు కాబట్టే అందరూ ఆయనను బుగులెంకటేశ్వర్లు అంటారు. ఈ కథ చదివినవారు ఈ మొత్తం ప్రయాణంలోని ప్రతి తావునూ గుర్తు పెట్టుకుంటారు. బుగులెంకటేశ్వర్లును కూడా!
‘వేసవి కాలం. నిండుపున్నమి కాలం. మా గల్లీలో ప్రతి ఇంటి ముందు జాజురంగుతో పెద్ద పెద్ద అరుగులు. అందరూ అన్నాలు తినంగనే ఇండ్లల్ల గ్యాసు దీపాలు ఆర్పేసి నులక మంచాలు, నవారు మంచాలు, చినిగిన ఈత చాపలు, అతుకుల బొంతల పక్కబట్టలు, షత్రంజీలు తీసుకుని మరచెంబులలో మంచినీళ్ల సౌకర్యం ఏర్పాటు గావించుకుని మా గల్లీల జమయ్యేవారు. పిల్లలం అరుగుల మీద పెద్దలు ముసలోళ్లు మంచాలల్ల, ఎవరింటి ముందు వారు కాళ్లు చాపుకుని, నడుం వాల్చి సెటిల్ అయ్యేవారు’... చదివితే ఏమనిపిస్తుంది? ఆ కాలానికి ఆ తావుకూ వెళ్లాలనిపించదూ?
‘బండ అంటే శాలిబండ. చార్మినార్ నుండి ఆలియాబాద్‌కు పొయ్యే తొవ్వల మొగల్‌పుర దాటంగనే నట్టనడుమల నిటారుగ ఉండేదే శాలిబండ. ఇది చాలా ఎత్తు కావున బండ అని ఈ ప్రాంతాన్ని అంటారు. పాత నగరంల చాలా బస్తీల పేర్లు బండతో ముడిపడి ఉన్నవి. గాజీ బండ, పిసల్ బండ, రాంబక్షి బండ, మేకల బండ లాంటివి. వీటి దగ్గరికి పొయ్యేటప్పుడు అంతా చడావ్. వచ్చేటప్పుడు అంతా ఉతార్. జీవితంలోని ఎత్తుపల్లాల్లాగ’!
ఎంత బాగుంది. ఈ ఎత్తుపల్లాల చోటుకి వెళ్లి ఆ మనుషుల కథల్లో తల దూర్చాలనిపించదూ?
తెలుగులో ‘క్షేత్ర కథానికల’ పరంపర ఉంది. ఆ పరంపరలో వచ్చిన తాజా పుస్తకం ‘చార్‌మినార్ కథలు’లోని ఉటంకింపులివి. రాసింది పరవస్తు లోకేశ్వర్. డెబ్బయి ఏళ్ల క్రితంనాటి జీవితం ఇప్పుడు ఎందుకు రాసినట్టు? డెబ్బయి ఏళ్ల క్రితం జ్ఞాపకాలు ఈ తరానికి ఎలా వర్తమానమైనట్టు? ఎలా అంటే మట్టి ఎప్పటికీ అదే. మనుషులు ఎప్పటికీ వారే. నడుమ ప్రయాణంలో నేర్చుకోవలిసిన పాఠాలను గతం నుంచి పునశ్చరణ చేసుకోవడానికే ఇలాంటి కథల అవసరం.
శ్రేష్టమైన సాహిత్యం స్థల, కాలాల నిర్దిష్టత పాటిస్తుంది. ఏ కాలంలో ఏ చోటులో ఏ కథ నడుస్తున్నదో తెలియడం పాఠకుడికి అవసరం. కథ పాదాలు ఊనుకుంటే పాఠకుడి పాదాలు కూడా ఊనుకుంటాయి. తెలుగులో కృష్ణ ఒడ్డు కథలను ప్రభావవంతంగా చిత్రించినవాడు సత్యం శంకరమంచి ‘అమరావతి కథల్లో’. ప్రవహించి ఆరిపోయే పెన్న ఒడ్డు ఆశ నిరాశలకు సిరా చుక్కలు పోసినవాడు పి.రామకృష్ణారెడ్డి ‘పెన్నేటి కథల్లో’. తిరుపతి దాపున ‘మిట్టూరు’ను క్షేత్రంగా చేసుకుని ‘పచ్చనాకు సాక్షిగా’, ‘మిట్టూరు కతలు’ రాశాడు నామిని. ఆలమండ ప్రాంతాన్ని రంగస్థలం చేసుకుని ‘వీరబొబ్బిలి’, ‘గోపాత్రుడు’, ‘పిలకతిరుగుడు పువ్వు’ మహా కావ్యాలు సృష్టించాడు పతంజలి. నెల్లూరు జిల్లా కావలిని క్షేత్రంగా చేసుకుని ‘దర్గామిట్ట కతలు’ రాశాడు ఖదీర్‌బాబు. సరస్సు జీవితం మొదటిసారి ‘ప్రళయ కావేరి కతలు’గా మలిచాడు స.వెం.రమేశ్. నక్కా విజయరామరాజు ‘భట్టిప్రోలు కథలు’ ఆ ఊరికి గొడుగు పట్టాయి. గుంటూరు జిల్లాలోని చిన్న ఊళ్ల మాలపల్లెల్నే క్షేత్రంగా తీసుకుని ‘కటికపూలు’ రాశాడు ఇండస్ మార్టిన్. అమలాపురంలోని ఒకనాటి బ్రాహ్మణ అగ్రహారపు అటక జాడీలను నేలకు దించాడు ముక్కామల చక్రధర్ ‘కేరాఫ్ కూచిమంచి’ కథల్లో.
ఇప్పుడు ‘చార్మినార్ కథలు’. నిజానికి నాలుగు వందల ఏళ్ల చార్మినార్ చుట్టూ ఎన్ని వేల కథలు దాగి ఉండాలి. ఎన్ని అనుభవాలు ఉడికి ఉండాలి. ఎన్ని అశ్రువులు మరిగి ఉండాలి. ఎన్ని జీవన సౌందర్యాలు అత్తరు బుడ్డీలకు మల్లే ఎగజిమ్మి ఉండాలి. ఈ క్షేత్రం నుంచి వెలువడిన తెలుగు కథలు తక్కువ. ఇప్పుడైనా ఇవి వచ్చాయంటే ‘నా జిమ్మేదారి’ అని రచయిత భావించడమే! ఈ పుస్తకం నిండా మనుషులూ స్థలాలూ స్థలాలలో జీవించిన మనుషులూ. ఇటీవలే శాలిబండలోని ‘ఆశా టాకీసు’ను కూల్చివేస్తే రచయిత అక్కడకు వెళ్లి చూసి చేసే తలపోతలతో ఒక కథ ఉంటుంది. కూల్చితే ఏదైనా కూలిపోతుంది. కథ రాస్తే నిలిచి ఉంటుంది. మరి ఈ కథల్లో పాన్‌సుపారీలా కలగలసిన తెలుగు–ఉర్దూల భాష సుందర ‘చార్మినార్ మాండలికం’.
పాఠకుడా... నీవున్న క్షేత్రం నుంచి ఒక రచయిత వచ్చి గత కాలాన్ని నమోదు చేశాడా? నీ తావులోని ఆనవాళ్ల ఊసులు చెప్పాడా? పదిలమైన అమాయకత్వాన్ని మూటగట్టాడా? నీ క్షేత్రాన్ని తిరిగి నీకు చూపించాడా? ఈ మోటార్లు, వాహనాలు, మిద్దెలు, మేడలకు పూర్వం మనుషులు చిన్న చిర్నవ్వుల ఐశ్వర్యంతో ఎలా జీవించారో బోధపరిచాడా? ఈ బాహాబాహీ కాలంలో కలిసి బతకడం అంటే ఏమిటో అరుగు మీద కూచోబెట్టి ముద్ద కలిపి రుచి చూపించాడా? క్షేత్ర కథానికలు చదువు! రచయితా... క్షేత్ర కథానికలు రాయి!
దేశమంటే మనుషులూ వారికి సంస్కారం నేర్పే మట్టేననే ఎరుకకు మరో మార్గం లేదు.
Comments
Please login to add a commentAdd a comment