కై కలూరు: పదోతరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని తండ్రి చెప్పడంతో మనస్తాపం చెంది కై కలూరు మండలం పందిరిపల్లిగూడెం సర్కారు కాల్వలోకి దూకిన ఏలూరుకు చెందిన పేడాడ పోలినాయుడు(16) మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. కై కలూరులో పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.
బదిలీపై వెళ్తున్న ఆర్డీఓలకు సత్కారం
ఏలూరు(మెట్రో): నిబద్ధత, జవాబుదారీతనంతో పనిచేస్తే ప్రతి ఉద్యోగికి మంచి గుర్తింపు వస్తుందని కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు, నూజివీడు డివిజన్ల ఆర్డీఓలుగా విధులు నిర్వహించి బదిలీపై వెళుతున్న ఎన్‌ఎస్‌కె ఖాజావలి, వై.భవానీశంకరిని సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సభలో సత్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆర్డీఓలు విధి నిర్వహణలో తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. మంచి అధికారులుగా ప్రజల నుంచి మెప్పు పొంది, ఐఎఎస్ అధికారులుగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డీఆర్‌ఓ డి.పుష్పమణి తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న స్పేస్ ఆన్ వీల్స్ ప్రదర్శన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సీఆర్‌ఆర్ పబ్లిక్ స్కూల్‌లో స్పేస్ ఆన్ వీల్స్ బస్సు ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. భారతీయ విజ్ఞాన మండలి, విజ్ఞాన భారతి, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9. 30 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ స్పేస్ ఆన్ వీల్స్ వాహనంలో చంద్రయాన్ 1, 2, 3 మిషన్, మంగళయాన్, ఆదిత్య 1 మిషన్, శాటిలైట్ లాంచ్ ప్యాడ్ మోడల్స్ విద్యార్థులు చూసి ప్రాథమిక అవగాహన పొందారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్పేస్ రంగోలి, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.
ఉత్పత్తి రంగంలో
జాతీయ అవార్డు
దెందులూరు : ఉత్పత్తి రంగంలో నాగ హనుమాన్ ఆగ్రో ఆయిల్స్ గ్రూపు సత్తా చాటింది. ఏలూరు జిల్లా దెందులూరులోని నాగ హనుమాన్ ఆగ్రో ఆయిల్ కంపెనీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానం సాధించింది. ఈ మేరకు కంపెనీస్ టెక్నికల్ డైరెక్టర్ భాస్కరరావు, వైస్ ప్రెసిడెంట్ ముంబైలో ది సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అజయ్ జుంజువాల, బీకే గోయంక నుంచి 2023–24 ఏడాదికి అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment