కామవరపుకోట: ఒక మోటార్ సైకిల్ నిప్పంటించి కాల్చి వేసి, వేరొక మోటార్ సైకిల్ దొంగిలించిన ఘటన ఈస్ట్ యడవెల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని కొణతం స్వామి ఇంటి ఆవరణలో గురువారం రాత్రి పెట్టిన హోండా షైన్ మోటార్ సైకిల్ శుక్రవారం ఉదయానికి పూర్తిగా కాలిపోయి కనిపించింది. అదే రోజు రాత్రి ముక్కు కృపారాజు ఇంటి ఆవరణలో ఉన్న హోండా షైన్ మోటార్ సైకిల్ దొంగలు దొంగలించిపోయారు. ఈ ఘటనపై బాధితులు తడికలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాలువలో స్నానానికి దిగి విద్యార్థి గల్లంతు
పెంటపాడు: మండలంలోని పరిమెళ్ల చినకాపవరం కాలువలో డ్యాం వద్ద స్నానానికి దిగి ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. పెంటపాడు ఎస్సై స్వామి తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న 8 మంది విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం పరిమెళ్ల గ్రామ శివారు చినకాపవరం కాలువలోకి స్నానాలు చేసేందుకు వెళ్లారు. కొంతసేపు వారంతా కాలువలో ఆటలాడారు. ఉన్నట్టుండి ఒక విద్యార్థి అయిన గుంటూరు జిల్లా మండేపూడి గ్రామానికి చెందిన పల్లెపోగు వరప్రసాద్ (20) ప్రమాదవశాత్తూ కాలువ లోతు తెలియక కొట్టుకుని పోయాడు. వెంటనే సహచర విద్యార్థులు, స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కాగా రెస్క్యూ సిబ్బంది సాయంతో పరిసర ప్రాంతమంతా రాత్రి పొద్దుపోయే వరకు వెతికినా ప్రసాద్ ఆచూకీ లభించలేదు. ఫైర్ అధికారి జీవీ సుబ్బారావు, ఎస్సై స్వామి సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పరిశీలించారు.
కాపర్ వైరు చోరీ కేసులో 8 మంది అరెస్ట్
ఎంవీపీకాలనీ: విశాఖపట్నంలోని ఎంవీపీకాలనీలో పలు చోట్ల డ్రిల్లింగ్ చేసి కాపర్ దొంగతనానికి పాల్పడిన కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు ద్వారకా క్రైమ్ సీఐ చక్రధరరావు తెలిపారు. నగరంలో ఎనిమిదేళ్ల క్రితం కాపర్‌వైరుతో బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ పనులు చేశారు. ప్రస్తుతం ల్యాండ్ లైన్ సేవలు నిలిచిపోవడంతో ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతో కాపర్ వైర్ దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎంవీపీకాలనీలో రాత్రి పూట అండర్ గ్రౌండ్ డ్రిల్లింగ్ చేసి 800 మీటర్ల కాపర్ వైరు చోరీ చేశారు. దీనిపై బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి చుట్టురి మురళీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంపై బయటపడింది. ఈ కేసులో పెందుర్తికి చెందిన ఆసనాల పిట్టోడు(ఏ1), ఏలూరుకు చెందిన బి.శ్రీను, జి.గోవర్ధన్, బి.ఏడుకొండలు, బి.రాజు, సీహెచ్ దుర్గాప్రసాద్, డి.రాజేష్, బి.ప్రసాద్ అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. నిందుతుల నుంచి 300 కిలోల కాపర్ వైరుతో పాటు టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


