కొల్లేరు సమస్యలపై గళం
ఏలూరు (టూటౌన్): కొల్లేరును 5 నుంచి 3వ కాంటూరుకు కుదించాలంటూ కొల్లేరు ప్రజలు గళమెత్తారు. తమకు ఉపాధి కల్పించాలని, సొసై టీలు, జిరాయితీ భూములను పునరుద్ధరించాలని, మిగులు భూములు కొల్లేరు పేదలకు పంచాలని, కొల్లేరు గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలంటూ శనివారం ఏలూరులో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ కొల్లేరు ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, జీఓ 120ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పర్యావరణం పేరుతో కొల్లేరు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.లింగరాజు, కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కొల్లేరుపై అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని, ప్రధాని మోదీ ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డీఎన్‌వీడీ ప్రసాద్, జిల్లా నాయకులు కె.లెనిన్, పలు కొల్లేరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.


