అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వేల్పూరులో మద్యం దుకాణం వెనుక మృతదేహం గుర్తింపు
తణుకు అర్బన్: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో మద్యం దుకాణం వద్ద శనివారం సాయంత్రం వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. శ్మశాన వాటిక రోడ్డులోని సూర్య వైన్స్ వెనుక శనివారం సాయంత్రం గాయాలతో పడి ఉన్న వ్యక్తిని స్థానికులు గమనించారు. అతన్ని వేల్పూరు సంతమార్కెట్ ప్రాంతానికి చెందిన కుడుపూడి శ్రీనివాసరావు (55)గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చిన మృతుడి తల్లి, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఆటోలో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్లారు. అనంతరం తణుకు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సమాచారం అందజేశారు. మృతుడికి భార్య లక్ష్మితోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాసరావు గాయాలతో పడి ఉన్న తీరు పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ముఖం, శరీరంపైనా గాయాలు ఉండడంతో ఎవరైనా కొట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హత్య కేసులో నిందితుడి అరెస్టు?
ఏలూరు టౌన్: ఏలూరు వన్‌టౌన్ సత్యనారాయణ పేట ప్రాంతంలో గురువారం అర్థరాత్రి వృద్ధురాలు చానాపతి రమణమ్మ (65) హత్య ఘటన ఏలూరులో సంచలనంగా మారింది. శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు హత్య కేసు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం రాత్రికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ హత్యను సత్యనారాయణ పేటకు చెందిన ఒక యువకుడు చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు పర్యవేక్షణలో డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ సీఐ జీ.సత్యనారాయణ దర్యాప్తు వేగవంతం చేశారు. హత్యకు కేవలం చిట్టీ పాటల డబ్బులే కారణమా ? ఇంకా వేరే కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత మృతికి కారణమైన యువకుడి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: వివాహిత మృతికి కారణమైన యువకుడిని జంగారెడ్డిగూడెం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం మండలం యర్రంపేటకు చెందిన హేమదుర్గ అనంత ప్రసన్న అనే వివాహితను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి ఆమె మృతికి కారణమైన కొయ్యలగూడెం మండలం గంగన్నగూడానికి చెందిన మోదుగ పెద్దసాయిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఆటోడ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు
ఏలూరు టౌన్: తల్లిదండ్రులు మందలించారనే కోపంతో శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి వచ్చి ఏలూరు ఆర్‌టీసీ బస్టాండ్‌లో కూర్చున్న బాలికను ఆటోడ్రైవర్ ఇంటి వద్ద దించుతానని నమ్మించి ఆటో ఎక్కించుకున్నాడు. పోణంగి రోడ్డులోని తన ఇంటికి తీసుకువెళ్ళి బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో భయంతో బాలిక అతడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి కేకలు వేసింది. ఆ ప్రాంతంలోని హిజ్రాలు విషయాన్ని గమనించి బాలికను రక్షించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. శనివారం బాలిక తల్లిదండ్రులు ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఆటోడ్రైవర్ ఆర్.ప్రభాకరరాజుపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
300 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
చాట్రాయి : నాటు సారా తయారీ కేంద్రాలపై దాడి చేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అజయ్‌కుమార్ సింగ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మండలంలోని చీపురుగూడెంలో జరిపిన దాడుల్లో 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన భూక్యా మహేంద్రపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.


