ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని కూటమి ప్రభు త్వం భవన నిర్మాణ కార్మికులను దగా చేస్తోందని ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్య దర్శి బద్దా వెంకట్రావు విమర్శించారు. హేలాపురి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ 15వ వార్షిక సమావేశం అధ్యక్షుడు లింగమల్లు శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతి థిగా వెంకట్రావు మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పాలకులు మళ్లించిన బోర్డు నిధులను తిరిగి జమ చేసి కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని కోరారు. రాష్ట్రంలో 38 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఉన్నారని వీరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలన్నారు. అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భవన నిర్మా ణ కార్మికుల సంక్షేమానికి రూ.కోటి నిధులు జమ చేస్తాననే హామీ ఇచ్చారని, ఆ హామీ నెరవేర్చిందీ లేనిదీ తెలియడం లేదన్నారు. ఏలూరులో తమ సంఘ భవనానికి స్థలం, నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మాచర్ల శంకర్రావు, అధ్యక్షుడిగా లింగమల్లు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఉప్పు సత్యనారాయణ, నెమలి కృష్ణ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా బత్తిన శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉమా విజయ సాయి, సహాయ కార్యదర్శిగా వస్తాది జనార్దన, కోశాధికారిగా తరుణ్ సాయికుమార్, ఏడుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.


