భీమడోలు : దాళ్వా ధాన్యం రోడ్లపైకి చేరుతోంది. యంత్రాలతో కోసిన ధాన్యాన్ని రైతులు జాతీయ రహదారిపై ఆరబెడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో ధాన్యంలో తేమశాతం వేగంగా తగ్గుతుండటంతో బస్తాల్లో పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ తెరవకపోవడంతో బరకాలతో కప్పి బస్తాలకు రక్షణ కల్పిస్తున్నారు. భీమడోలు మండలంలోని గుండుగొలను, సీతంపేట, పోలసానిపల్లి ప్రాంతాల్లో 1153, పీఎల్ 126 రకాల పంట కోతలు చురుగ్గా సాగుతున్నాయి. ఎకరాకు 43 నుంచి 50 బస్తాల దిగుబడులు వస్తున్నా యి. అధిక శాతం సీతంపేట ఆయకట్టు రైతులే రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ఎకరాకు రూ.25 వేల వరకు ఖర్చయ్యిందని, నీటిని తోడుకునేందుకు అదనపు ఖర్చు చేశామని ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని రైతులు కోరుతున్నారు. ధాన్యాన్ని జాతీయ రహదారిపై నుంచి ఎత్తివేయాలని రైతులను పోలీసులు ఒత్తిడి చేస్తుండటంతో కొందరు అయినకాడికి దళారులకు విక్రయిస్తున్నారు. భీమడోలు మండలంలో ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని, దళారులకు అమ్మి నష్టపోవద్దని ఏఈఓ ఎస్‌పీవీ ఉషారాణి సూచించారు.


